ఎవరు గొప్ప (కథ) -- సరికొండ శ్రీనివాసరాజు

 సురేంద్ర 10వ తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థి. అతనికి చదువుతో పాటు గర్వం బాగా పెరిగింది.  చదువురాని విద్యార్థులను చాలా హీనంగా చూస్తూ వారిని హేళనగా చేసేవాడు. వారితో సరిగా మాట్లాడలేకపోయేవాడు. అతను అత్యంత హీనంగా చూసే విద్యార్థి సుధామ. సుధామ చదువులో అందరి కంటే వెనుకబడ్డ విద్యార్థి‌‌. కానీ మంచి స్వభావం కలిగిన విద్యార్థి. అందరితో స్నేహం చేస్తూ వీలైన సహాయం చేసేవాడు.‌ సుధామకు ప్రాణ స్నేహితుడు విష్ణు.
      ఒకరోజు సురేంద్ర తన మిత్ర బృందంతో "మా నాన్న 50 వేల రూపాయలతో కొత్త సెల్ ఫోన్ కొన్నాడు. తెలుసా! ఫోటోలు ఎంత క్లారిటీగా వస్తాయి అనుకున్నారు. రేపు ఆదివారం మన ఊరి బయట చెరువు వద్ద రేపు మనం కలుద్దాం. నేను ఆ కొత్త ఫోన్ తీసుకుని వస్తా. బాగా ఫోటోలు దిగుదాం. ఒరేయ్ విష్ణు! నీకు ఆ పనికిమాలిన వెధవ సుధామ సావాసం ఎందుకురా! వాడితో స్నేహం చేయడం వల్ల నీకు ఉపయోగం లేదు. పైగా చదువు రాని మొద్దువు అవుతావు. రేపు మాతో పాటు రా. ఎంచక్కా ఎంజాయ్ చేద్దాం." అన్నాడు.
       మరునాడు సురేంద్ర మరియు అతని మిత్ర బృందం చెరువు వద్ద కలుసుకున్నారు. ఆ చెరువు చాలా పెద్దది. ప్రమాదకరమైనది. చెరువు గట్టున సురేంద్ర తన మిత్ర బృందంతో సెల్ఫీ ఫోటోలు దిగుతున్నాడు. ప్రమాదవశాత్తు విష్ణు కాలు జారి, చెరువులో పడి, కొట్టుకుపోతున్నాడు. సురేంద్రకు ఈత రాదు. తనవల్లే ఈ ప్రమాదం జరిగింది. తనపై నేరం పడుతుందనే భయంతో అక్కడ నుంచి పారిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుధామ విష్ణు ప్రాణాలను కాపాడినాడు. సుధామకు ఈత బాగా వచ్చు. మరునాడు పాఠశాలకు వచ్చిన సురేంద్ర సుధామను హేళన చేయసాగాడు. అప్పుడు వాసు ఇలా అన్నాడు. "ఒరేయ్ సురేంద్ర! ఏమి చూసుకోనిరా ఆ పొగరు నీకు? నీ చదువు ఇంకెవరికైనా ఉపయోగపడుతుందా? నీకు వచ్చిన విద్యను ఎంతమందికి పంచినావు? నీ చదువు నీకే సంస్కారం నేర్పలేదు. సుధామకు చదువు రాకున్నా ప్రాణాలకు తెగించి, ఆపదలో ఉన్న మిత్రుని రక్షించాడు. సుధామకు వచ్చిన ఈత నీకు వచ్చా? సుధామకు ఉన్న సంస్కారం నీకు ఉందా? నీకు ఎవరినీ చులకనగా చూసే అధికారం లేదు. ఎవరితో స్నేహం చేసే అర్హత లేదు." అన్నాడు. అందరూ కలిసి సురేంద్రను తిడుతున్నారు‌. సురేంద్ర గర్వం పూర్తిగా కరిగిపోయింది.

కామెంట్‌లు