ఆ ఇంటివెనుక కథ ..!! >రచయిత :-శీరంశెట్టి కాంతరావు .> పాల్వంచ *

 ఇప్పుడంటే వినాయక చవితి ఇంత ధూమ్ ధామ్ గా కోట్లరూపాయల ఖర్చుతో పర్యావరణాన్ని పాడుచేస్తూ వెర్రిసంతోషంతోటి చంకలు గుద్దుకుంటూ చేస్తున్నారుగానీ మా చిన్నప్పుడు మా ఊళ్ళో జరిగే వినాయక చవితి పండుగను గురించి నేనెప్పుడు తల్చుకున్నా అప్పటి దృశ్యాలు అనేకం కండ్ల ముందు ఇప్పుడే జరిగినట్టు మెదులుతుంటాయి
మాలాంటి వ్యవసాయ కుటుంబాలవారు పండగను పెద్దగా జరుపుకునేవారుకారు
ఎవరో కొందరు బ్రాహ్మలు, కోమట్లతోపాటు వడ్ల, కమ్మరి, కుమ్మరి, సాలెలు వంటి కొన్ని చేతివృత్తుల కులాలవారు మాత్రం తప్పకుండా చేస్కునేది   మా ఇంటి చుట్టూ వుండే బాపనిండ్ల దోస్తుల్తోటి నేను గూడ పొద్దున్నే పత్రికోసం కుశాలుగా ఊరి పెద్దపటేల్ తోటకు బొయ్యేటోణ్ణి నేలమీద దొర్కే పత్రంతా పేరు పేరున  కోసుకున్న దోస్తులు ఆఖర్న మాత్రం నాదిక్కు ఆశగా జూసేటోళ్ళు ఎమ్మటే నేను ఎలగచెట్టెక్కి ఫటా ఫటా కావాల్సి నన్ని ఎలక్కాయలు కోసి కిందికి జార విడుస్తుంటే దోస్తులంత ఒక్కకాయగూడ నేలపాలు కాకుంట ఒడిసి పట్టుకునే టోళ్ళు ఊరు చేరంగనే వాళ్ళంత  ఒకరిద్దరు వడ్లోళ్ళు చెరువు మన్నుతోటి చెక్కచ్చులమీద తయారు చేసే చిన్న చిన్న వినాయకుళ్ళను పావలా కొకటి చొప్పున కొను క్కొని పూజ జేస్కునే టోళ్ళు 
మేం పూజ చేయకపోయినా అమ్మ మాత్రం ప్రతి చవితి పండక్కి తప్పకుండా ఎలక్కాయ తొక్కు నూరేది ఆ ఎలక్కాయల కోసమే నేను దోస్తులతోటి పత్రికి పొయ్యేది
పైటన్నాలు తినంగనే దోస్తుల మంత గూడి ఏనెల బీడుదిక్కు బొయ్యి పల్లేరుకాయలు కోసు కొచ్చుకునేది, సందె దీపాలు  పెట్టంగనే మాకుసంబందించిన అసలు వినాయకచవితి  మొదలయ్యేది వరసైనోళ్ళ ఇండ్లకు చీకటి మాటున సప్పుడు జెయ్యకుంట బొయ్యి పక్కల్ల గడపల్ల పల్లేరుగాయలు చల్లి పక్కకు తప్పు కునేది
ఎక్కడ రేకులిండ్లు కనబడ్తే అక్కడ రాళ్ళవాన కురిపించేది
ఆ ఇండ్లోళ్ళంతా నోటికొచ్చినట్టు ఎంతెక్కువ తిడ్తే ఆ ఏడాదంత అంత మంచి జరుగుద్దని మేమంతా సంబరపడేది 
మా ఊరంతటికీ ఖతర్నాక్ కత  ఎంగిలిచేత కాకినిగూడా కొట్టని నాగన్న శేట్ ఇంటికాడ జరిగేది శేట్ ఊరోళ్ళందరిని ఏడాదంతా ఆడిస్తే వినాయక చవితి ఒక్కరోజు మాత్రం ఊరి పోరలు  అతన్తోటి ఘోరంగ ఆడుకునేది పొద్దు గూట్లె పడంగనే శేట్ వాళ్ళంత తలుపులు బిడాయించుకొని తెల్లారి పొద్దు పొడ్చిందాక దేవుడొచ్చి పిల్చినా  తీసేదిగాదు ఊళ్ళో పోరలంత శేట్ ఇంటిమీద తలుపులమీద రాళ్ళ వాన కురిపించినా కసి దీరక పాత పిడతొకటి సంపాయిచ్చి దాన్నిండా శౌచం కానిచ్చి గోలగోలగ అర్సుకుంటు పిడతను తీసుకొచ్చి శేట్ గాని పుర్రె పలిగిందిరో! అనుకుంట దూరం నుంచే తలుపులకేసి ఇస్సిరి కొట్టి ఇండ్లకు పారిపొయ్యే టోళ్ళు
తెల్లారి బారెడు పొద్దెక్కినంక మెల్లగ తలుపులు తీసిన శేట్ ముక్కుకు గుడ్డగట్టుకొని నోటి కొచ్చిన కటిక తిట్లు తిట్టుకుంట రోజంత కడుక్కునే టోడు, వారంరోజుల పాటు అతని తిట్టిన నోరు తిట్టినట్టే వుండేది
ఏండ్లు గడిచిపాయె  
ఊరు చెదిరిపాయె!
ఇప్పుడా శేట్ కుటుంబం ఎటు బాయెనో? వాళ్ళంతా ఏమాయెనో? ఎవరికీ తెలియక పాయె ఎన్నో చేతులు మారిన ఆ ఇల్లు రూపం మారినా ఇంకా నిల్చే వుంది ఆ ఇంటి వెనుక ఇంత కత వుందన్న సంగతి ఇప్పటి వాళ్ళకు తెలియదు సరే! పాతవాళ్ళల్లో గూడా ఎందరికి గుర్తుందో?
                         ***
కామెంట్‌లు