రైతే రాజు . .!! >రచయిత--బి.రామకృష్ణారెడ్డి>సఫిల్ గూడ>సికింద్రాబాద్

 సాధారణంగా మనందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ...ఓహో!మనము వీటిని ప్రత్యక్షంగా చూశామా? లేదా వీటిని ప్రత్యక్షంగా అనుభవించామా?.. అనే సందేహం కలుగుతుంది .కారణం మన ముందు తరం వరకు ఉన్న  పూర్వీకులు, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో వ్యవసాయమే ముఖ్య వృత్తిగా ఎంచుకుని జీవనం సాగించినవారు  అవలంభించిన వ్యవసాయ పనుల విధానాన్ని పరిశీలిస్తే ఎంతో విచిత్రంగా ఉంటాయి.   కొన్ని కొన్ని పద్ధతులు ఒకే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి. అటువంటి విధాన విశేషాలు అప్పట్లో రవాణా సౌకర్యము మరియు ప్రసార సాధనాలు లేకపోవటం వలన ఇతర ప్రాంతాలకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. పాతకాలపు సినిమాలలో అక్కడక్కడ మనకు కనిపించిన కొన్ని దృశ్యాలు కొన్ని  ప్రదేశాలను మాత్రమే ఎంచుకున్నట్లు  కనిపిస్తాయి .
    ఆచరణకు అనుగుణంగా ఉన్న కొన్ని పని విధానాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నా, కొన్ని పద్ధతులు మరుగున పడిపోయాయి .కారణం... అది ఆ కాలానికి సరైన విధానం అయినప్పటికీ ,వ్యవసాయ పద్ధతులు కూడా సాంకేతికంగా అభివృద్ధి చెందటం వలన వాటి అవసరం లేకుండా పోయింది .నాటి తరానికి  నేటి తరానికి మధ్య  వారధులుగా ఉన్న మనము..ఇటువంటి విశేషాలను ఎక్కడో ఒకచోట పదిల పరచకపోతే, ముందు తరాల వారికి ఇది ఒక చరిత్రగా తెలిసే అవకాశం లేనందున నాకు తోచిన విశేషాలను ఇందులో పొందు పరుస్తున్నాను.
      మాది రాయలసీమలోని అప్పటి కర్నూలు జిల్లాలో ఒక పల్లెటూరు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. అప్పట్లో రాయలసీమలోని దాదాపు అన్ని జిల్లాలు వ్యవసాయమే ముఖ్య వృత్తిగా ఎంచుకొని జీవనం సాగించే వారు.    అధికంగా మెట్ట ప్రాంతం ,మరియు వర్షపాతం తక్కువ . కాలువలు అసలే ఉండవు. చెరువులు చాలా తక్కువగా ఉండేటివి. అందువల్ల రైతులు వ్యవసాయ బావుల ద్వారా పంట పొలాలకు నీటి సౌకర్యం కల్పించుకునే వారు. బావులలో నీరు  వేసవికాలంలో బహు స్వల్పంగా ,చాలా క్రింది భాగంలో ఉండేది. ఆ నీటిని పైకి తోడే ఒక ప్రత్యేకమైన విధానం నాకు తెలిసి ఒక్క రాయలసీమ ప్రాంతానికి పరిమితమైంది అనుకుంటా. ఎడ్ల సహాయముతో ఆ నీటిని పైకి తోడే ప్రక్రియను  "కపెల" ... అని అనేవారు. ఈ పదము రాయలసీమ ప్రాంత ప్రజలు వాడే పదము కావచ్చు.
       ముందుతెలియజేసిన విధంగా మాది అధిక సంతానముతో ఉన్న  మధ్య తరగతి రైతు కుటుంబం. వయో మరియు లింగ భేదము లేకుండా అందరూ ఎవరికీ చేతనయిన వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు  సహాయ పడే వాళ్ళం .నా విషయానికొస్తే నేను 6 నుండి 10వ తరగతి వరకు మా ఊరికి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్కూల్ కి వెళ్లేవాడిని. వేసవి కాలమునకు ముందు వచ్చే పంట పొలాలకు బావులలో ఉండే నీరు అడుగంటి పోవడంతో, ఆ నీటిని  "కపెల" అనే పని ద్వారా పంట పొలానికి  సరఫరా చేయడానికి దాదాపు రెండు గంటల సమయమే పట్టేది. తిరిగి మరుసటి రోజు వరకు అలాగే వదిలి వేయడం వలన మరో రెండు గంటలు పని సాగేది. కేవలము  రెండు గంటల పనిచేసినా,   కూలీలకు పూర్తి కూలీ ఇవ్వవలసి వచ్చేది .అందుచేత మేము స్కూల్కు వెళ్లేముందు ఆ రెండు గంటలు మా నాన్నగారికి బావిలోని నీరు తోడే పనికి సహాయపడి తర్వాత  స్కూల్ కి వెళ్లే వాడిని.
      ఈ శీర్షిక యొక్క ముఖ్య ఉద్దేశం.. ఈ ప్రత్యేకమైన  కపెల అనే  ప్రక్రియ గురించి తెలియజేసే ఆలోచన మాత్రమే. ఆ రోజుల్లో, అంటే దాదాపు 60 సంవత్సరాల క్రితం వరకు ,మా ప్రాంతంలో రైతులు ఎవరూ నీటిని డీజిల్ మోటార్ల ద్వారా పైకి లాగే ప్రక్రియకు నోచుకోలేదు. విద్యుత్ సౌకర్యము అసలే లేదు .వర్షాకాలంలో మాత్రమే చెరువులు ఉండే గ్రామీణ ప్రాంత వాసులు, చెరువు నీటిని కాలువల ద్వారా పంట పొలాలకు మళ్లించి వర్షాకాలపు పంటలు పండించే వారు ,రెండవ కారు బావి నీటి పై ఆధారపడేవారు .చెరువులు లేనివారు రెండు పంటలకు బావి నీరే ఆధారం .రైతు కుటుంబాలన్నీ బావి నీటిని తోడే ప్రక్రియనే అవలంబించేవారు. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం...
    " కపెల"... అనే ప్రక్రియ విశేషాలను పరిశీలిస్తే... లోతైన బావి నుండి నీరు తోడే క్రమములో రైతులు రెండు ఎడ్లను జతగా చేర్చి, వాటిని బావి అంచున ఏర్పాటుచేసిన ఒక అరుగులాంటి ప్రదేశానికి తీసుకవచ్చి, మోకుకు (ఒక బలమైన తాడు) ఒకవైపున "బొక్కెన".. అమర్చి రెండవ కొనను రెండు ఎడ్ల  మధ్య ఉన్న కాడికి కట్టి ,పొడవైన ఏటవాలు ప్రాంతంలోకి ఎడ్లను తీసుకెళ్లటం ద్వారా... బావిలోని నీరు బొక్కెన అనే వాటర్ ట్యాంక్  ద్వారా అరుగు క్రిందిభాగంలో ముందుగానే ఏర్పరచిన కాలువ ద్వారా బయటకు వస్తుంది.( బొక్కెన అనే పరికరం ఎద్దు లేదా గేదె చర్మముతో తయారుచేసిన కాఫీ కెటిల్ ఆకారంలో ఉన్న వాటర్ ట్యాంక్ .ఈ టాంక్ కి అడుగు భాగం నుండి ఏనుగు తొండము లాంటి  చర్మపు గొట్టం ద్వారా నీటిని బయటకు విడుదల చేయవచ్చు.) ఇలా ఈ బొక్కెనను ఎడ్ల ద్వారా పెద్ద తాడుతో పైకి లాగడం వలన నీరు బయటకు వస్తుంది .తిరిగి ఎడ్లను కాడినుండి విడిపించి పల్లపు ప్రాంతం నుండి అరుగు వైపుకు తీసుకువచ్చి ,తిరిగి బొక్కెన  నీటిలోకి దింపడం ,పైకి లాగడం ద్వారా నీరు పొలంలోకి ప్రవహిస్తుంది. ఒకసారి నీటితొట్టిని పైకి లాగి ,తిరిగి విడుచుటకు  దాదాపు ఐదు నిమిషాల సమయం పడుతుంది .ఎడ్ల యొక్క దేహ దారుఢ్యాన్ని బట్టి బొక్కెన యొక్క సైజు 500 నుండి 750 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది .ఈ ప్రక్రియను కొనసాగించడానికి కనీసం ఇద్దరు వ్యక్తుల అవసరం. బావిలో నీరు పుష్కలంగా ఉండి ,ఎక్కువ పొలానికి అవసరమైతే రెండు జతల ఎడ్లను, ముగ్గురు మనుషుల సహాయముతో ఈ ప్రక్రియను కొనసాగించి   నీటిని తోడవచ్చు .
      కాలక్రమేణ నేటి యువత  ఆధునిక  ప్రపంచములో లభిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ యాప్ ద్వారానే ఎక్కడో భూగర్భంలో అమర్చిన బోర్ వెల్ మోటార్లను నియంత్రించగలిగే సామర్ధ్యము కలిగి ఉన్నా, జెట్ విమానాలను కనుగొన్నా, వాయు  వేగముతో ప్రయాణించే ఏసి కార్లను కనుగొన్నా, ఆధునిక వైద్య విధానాలు అవలంబిస్తున్నా‌ , అత్యాధునిక సదుపాయాలతో సకల హంగులు  కలిగిన విలాసవంతమైన భవనాలలో నివసిస్తున్నా... వాటిని సృష్టించిన మేధావుల ఆలోచనలు కార్యరూపం దాల్చటానికి,  ఏ నాగరికత , మరియు సాంకేతిక పరిజ్ఞానము లేని పూర్వ కాలములోని   మన రైతురాజులు సృష్టించిన మూల సంపదే....  అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బంగారు పల్లెరములో  భుజంచే వారైనా, కనకపు సింహాసనము పై ఆశీనులు  అవగలిగే వారైనా, చివరకు మరణానంతరం అంతిమయాత్రలో బంగారు శవపేటికలో ప్రయాణం సాగించిన వారైనా  బ్రతకటానికి తినగలిగే ఆహారము మన రైతులు పండించినదే.  నేటి సమాజంలో నిర్లక్ష్యానికి గురై , అన్ని వర్గాల నుండి చులకన భావానికి గురవుతున్న రైతుల గురించి ఆలోచిస్తూ ఈ పదజాలాన్ని జోడించినందుకు చింతిస్తున్నాను. 
             జై కిసాన్ ......రైతే రాజు....
                       ■■■

కామెంట్‌లు