*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౧౧౫ - 115)

 శార్దూలము:
*కాయల్గాచె వధూనఖాగ్రములచే | గాయంబు వక్షోజమల్*
*రాయన్రాపడె రొమ్ము మన్మథ విహా | రక్లేశ విభ్రాంతిచే*
*ప్రాయంబాయెను బట్టగట్టెతల చె | ప్పన్ రోత సంసారమే*
*జేయంజాల  విరక్తుఁజేయగదవే | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
చిన్నప్పుడు నా తోటి వయసులో వున్న ఆడవారి తో సరదాగా గడిపి నప్పుడు వాళ్ళ చేతి గోళ్ళు చేసిన రక్కులు వంటి నిండా వున్నాయి.  ఇద్దరి వక్షస్థలాల వత్తిడి వలన కలిగిన గుర్తులూ వున్నాయి.  కానీ, ఇప్పుడు  పెద్ద వయసు వచ్చింది. తలమీద జట్టు ఊడి పోయి బట్టతల వచ్చింది.  ఈ సంసార చక్రంలో జీవితం గడపడం నావల్లకాదు, స్వామీ!  నన్ను కరుణించి, నాకు ఈ సంసారం మీద విరక్తి కలిగే టట్టు దీవించు, సుందరేశా!....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*చక్కని ప్రాయంలో వున్నప్పుడు నే నొర్చిన పనులకు గుర్తుగా, నా శరీరము నిండా కామినీ మణుల గోళ్ల గుర్తులు కనిపిస్తున్నాయి.  మదన సామ్రాజ్య విహారాన్ని గుర్తు చేస్తూ వక్షోజాల మర్దన ఆలోచనలలో నిలిచివుంది.  ఆ సమయంలో "అంగన పరిష్వంగ సౌఖ్యం కంటే గొప్పది వేరేమున్నది" అనిపించింది. "ఇదే శాస్వతమైతే బావుండు" అని కూడా అనిపించింది. కానీ ఇప్పుడు వయసు అయిపోయింది. జవసత్వాలు సన్నగిల్లాయి. తల మీద అందంగా వుండే జుత్తు రాలి పోయి, బట్టతల వచ్చింది. ఆనాకారితనం అవగత మౌతోంది. ఇప్పటికైనా నీ మాయలో నుండి నన్ను బయటకు లాగు వ్యుప్తకేశా! నాకు, ఈ లలనామణుల లాలిత్యం వద్దు, స్వర్గసుఖాలు కూడా మైమరపించే నీ పొందు కావాలి. నేను ఎలావున్నా, ఆదరించే నీ చిరునవ్వు కావాలి.  నన్ను వైతరణి ని తరింప జేయి, కపర్ధీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు