మన భాష తెలుగు తెలుసుకుంటే వెలుగు; తెలుగు ఒడిలో...13మామిడి చెట్టు;-వ్యాసకర్త;--రాజావాసిరెడ్డిమల్లీశ్వరి
వేసవికాలం వస్తోందంటే మల్లెలతో పాటు మామిడి కోసము ఎదురు చూస్తారందరూ.  ఆ మామిడి ఆమ్రము, కరకము, కామవల్లభము, కామశరము, కోకిలావాసము, గంధబంధువు, చూతము, నృపప్రియము, పికబంధువు, పికరాగము, భృంగాభీష్టము, మధుదూత, మధూళి, మన్నమన్మధాలయము, మాకందము, మావి, మావిడి, రసాలము, వసంత ధూత, వసంత ద్రుమము, సహకారము, శీధు ధూత, వసంతద్రుమము, సహకారము, శీధు రసము, స్త్రీ ప్రియము, వంటి పేర్లతో పిలువబడుతున్నది. కాగా ఈ మామిడి కొండమామిడి, మంతమామిడి  ఆల్ఫంజా, చెరుకు రసాలు, చిన్న రసాలు,బంగినపల్లి,
కొబ్బరి మామిడి, ఎల మామిడి, ఇమాం పసంద్ మొదలైన అనేక  రకాలుగా ఉన్నది.

"మావికొమ్మను అల్లుకున్నది మాధవీలత "– అంటూ కవిత్వంలో వర్ణించబడిన మామిడి, చూతపల్లవముల మేసి. గండు కోయిలకూ యన్నది – అంటూ వర్ణించబడిన మామిడి కాండాన్ని రకరకాల వస్తువుల తయారీకి, ఆకులు గడపల  తోరణాలకి, కాయల్ని – పళ్ళనీ మనకాహారంగా ఉపయోగపడేలా చేస్తూ మన కు ఆరోగ్యాన్ని ఇస్తున్న మామిడి గురించి మన భాషలో ఉన్న సామెతలను చూద్దాం. 

మావిళ్ళు కాస్తే మశూచి కాలు (వ్యాధి) మెండు. మావిళ్ళకు మరణాలు చింతలకు సిరులు. మామిడి చెట్టుకు మడిగుడ్డ కట్టి దొంగలు ఎక్కరులే అన్నట్లు. మామిడి కాయలు తరిగితే కత్తిపీట దాదర పులుస్తుందా. మామిళ్ళను మంచు చెఱచును. మావిళ్ళను నరికి మోదుగలు నాటినట్లు ...అంటూ ఎన్నో  సామెతలు చెప్పబడ్డాయి ఈ మామిడి గురించి. 

      మామిడి గు,రించి మన తెలుగు భాషలో చెప్పబడిన కొన్ని పొడుపు కథలను తెలుసుకుందాం.
"మా తాత రెండెద్దులు కొన్నాడు.ఒకటి పీక్కు తిన్నాడు.మరోటి కాల్చుకు తిన్నాడు " 
అనేదొక పొడుపు కథ
(కాల్చుకు తినే మామిడి జీడిమామిడి).
ముందు ముద్దులు
పిదప పిసుగుళ్ళు..
అని, 
తండ్రి పుట్టుక ముందే
కొడుకు బేరం చేశాడు...
(ముంత మామిడి పండు)  అని, 
జీడివారి కోడలు, జింకవారి ఆడపడుచు
వయసొస్తే వైశాఖ మాసం,లో వస్తుంది...( మామిడి కాయ )అని
 ఎన్నో పొడుపు కథలు చెప్పబడ్డాయి.

“కమ్మని తేనె బిందువులు కాల్వలు గట్టెడు పూలదాన గా
నమ్ముల విందుసేయు పికనాథులు మెట్టినదాన్నచంచ
కమ్ములు మంజుల ధ్వనుల గాఢరతిన్ నినుగూడి, నీచ వృ
క్షమ్ముల వంక బోవనివిగా నొనరింపు రసాల సాలమా” 

ఓ సహకారామా! ఓ రసాలమా! కోకిల కూతల చేత మనోహరమైన దానా! ఝమ్మని కలధ్వనులు చేస్తూ భ్రమించే ఈ భ్రమరమును నీయందే ఆసక్తికల దానినిగా చేసుకో.  పనికిమాలిన వేప, వెదురు వంటి చిల్లర చెట్లు వైపు దానిని పోనీయకుండా చూచుకో. అది నీ విధి సుమా! అది నీకే శోభ సుమా! – అనేది పై పద్యం యొక్క అర్థము. దీనిని జగన్నాథపండితరాయలు చెప్పారు. 

కాగా మన్మథుడికి గల అయిదు బాణాలలో ఈ మామిడి ఒకటి. చూత (మామిడి) పల్లవముల మెసవిన  గండు కోయిల గండు స్వరం మన కాప్లాన్నిచ్చేదేకదా. 

మామిడి కాయ అనగానే ఆవకాయ, మాగాయ పచ్చళ్ళు గుర్తొస్తాయి కదా. మామిడి తాండ్ర సరేసరి మామిడి పండు గుజ్జుతో తయారు చేస్తారు. కాగా మామిడి ఆకులు, పండ్లరసం ఆరోగ్య ప్రసాదాలే. 

అయితే నాలుగుదిక్కులనీ సూచించే నాలుగు కొమ్మలుగల మామిడి చెట్టొకటి వేదకాలం నాటిదిగా చెప్పబడుతోంది. అది కాంచీపురంలోని ఏకాంబరేశ్వరస్వామి ఆలయంలో ఉంది. చెట్టు తీపి, చేదు, పులుపు, ఉప్పు  అనే నాలుగు రుచుల కాయలను కాస్తుందట. మరి ఇది విశేషమే కదా. మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలోను ఎంతో ప్రసిద్ధమై ఎన్నో విధాలుగా వెలుగొందుతున్న ఈ గొప్ప మామిడి చెట్టును ఓ కవి–

“కొమ్మ కొమ్మకును పూవులు పండ్లున్ 
కమ్మతావి కలకాలము మాకం
దమ్మ! చెల్లెనని కుందకుమా! తౌ
సమ్ము మాన్పగల విప్పుడు నీడన్” – (భావతరంగాలు) అంటూ ఓదార్చాడు.

      
చూశారుగా తెలుగు సాహిత్యంలో మామిడి చెట్టు  ఎంతగా  స్థానం
సంపాదించుకుందో..!

 

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
మామిడి చెట్టు గురించి , సాహితీ కోణంలో విశ్లేషణ బావుంది.
అజ్ఞాత చెప్పారు…
మామిడి చెట్టు గురించి , సాహితీ కోణంలో విశ్లేషణ బావుంది.