ఎవరు?:-కవిరత్న నాశబోయిన నరసింహ(నాన), ఆరోగ్య పర్యవేక్షకులు,చిట్యాల, నల్గొండ,8555010108.


మన మధుర స్మృతులు 
జన్మ జన్మలో నెమరేస్తూ 
ఆనంద జీవన తరంగాలలో
అణువణువు ఐక్యమైనపుడు
మన అనుబంధ సుగంధాన్ని
విడదీసే దెవరు?

నా గుండెలో నీ గుండె 
పెనవేసుకు పోయి 
మనిద్దరిదీ ఒకే స్పందనైనపుడు
మన హృదయ శృతిలయల సరాగం
ఆగి పోతుందన్న దెవరు? 

నీ అంతరాత్మ నా ఆత్మలో
అంతర్లీనమై మనిద్దరిదీ 
ఓకే ఉచ్ఛ్వాస నిష్ఛ్వాసైనపుడు  
మన ప్రాణం అనంత వాయువుల్లో 
విలీన మవుతుందన్న దెవరు? 

కష్ట సుఖాల కలయికలో 
కలకాలం తోడు నీడగా నిలిచావు
పారిపోవటం విడిపోవటం 
ప్రేమ స్వరూపం స్వభావం కాదన్నావు 
మన అనురాగ మహా సంద్రానికి 
అడ్డుకట్ట వేసేదెవరు?

నీ జతలేని కాపురం అగమ్య గోచరం
నా మదిలో నీ ఆవాసం సుస్థిరం 
మన సహవాసం ఆజన్మ తారార్కం
ఇష్ట దైవారాధనలో సదా నిమగ్నమైన
మన అంతరాత్మ నదృశ్యం చేసే దెవరు?

కామెంట్‌లు