చేప చేసిన మేలు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   అప్పుడు ఎప్పుడో బంగాళాఖాతం సముద్రం ఒడ్డున ఉన్న దువ్వూరు గ్రామంలో కోటయ్య అనే వాడికి నూనె గానుగ ఉండేది.ఎవరైనా గింజలు తెస్తే నూనె తీసి వారికిచ్చి డబ్బు తీసుకుని బతుకు ఈడుస్తుండేవాడు.
        ఒక సంవత్సరం కరవు సంభవించింది.పొలాలు పండలేదు,గింజలు రాలేదు.కోటయ్య కు డబ్బు లేక తినడానికి లేక చాలా ఇబ్బంది పడసాగాడు.
       అతనికి ఒక వెన్నెల రాత్రి నిద్ర రాలేదు.ఎందుకంటే ఎలా సంపాదించి కుటుంబాన్ని పోషించాలో అర్థం కాలేదు.అలా ఆలోచిస్తూ సముద్రం ఒడ్డుకి వెళ్ళాడు.
          వెన్నెలలో సముద్రం గంభీరంగా అందంగా కనబడుతోంది.సముద్రం కేసి కోటయ్య అలాచూడ సాగాడు.అతనికి ఓ బంగారు రంగులో ఉన్న చేప కనబడింది.ఇంతలో ఆకాశం నుండి రాత్రి సంచరించే ఒక వెన్నెల పక్షి ఆ చేపను పట్టుకుందుకు వేగంగా రాసాగింది,దానిని గమనించిన కోటయ్య వెంటనే తన చేతిలో ఉన్న కర్రతో ఆ పక్షిని అదలించాడు.అది భయపడి కీచుమని అరుస్తూ వెళ్ళి పోయింది.
       బంగారు చేప చిత్రంగా ఈవిధంగా మనుష్య భాషలో చెప్పింది.
       "కోటయ్యా,నీ మంచితనం నాకు తెలుసు, నీవు నన్ను వెన్నెల పక్షి నుండి రక్షించావు, అదిగాక నీకు భూతదయ ఎక్కువని నేను గ్రహించగలిగాను. అందుకే నీకు సహాయం చేయదలిచాను" అన్నది.
దాని మాటలకు కోటయ్య ఆశ్చర్యపోయాడు.
       "అసలు నాగురించి నీకు ఎలా తెలుసు,నీకు ఇన్ని మహిమలు ఎలా వచ్చాయి?" అడిగాడు.
         "నా పేరు మత్స్య నందిని,అలనాడు విష్ణువు మత్స్యావతారం ఎత్తినపుడు  ఆ అవతారాన్ని తాకడం వలన మా పూర్వీకులకు ఈ వరం లభించింది నేను వారి సంతతినుండి పుట్టిన దానినే నా జీవితంలో కేవలం వెన్నెల రాత్రులలో అవసరమైనవారికి సహాయం చేస్తే ఈ చేప జన్మనుండి విముక్తి కలిగి విష్ణులోకానికి వెళ్ళి పోతాను" చెప్పింది మత్స్యనందిని.
     "నిన్ను చూడటం నా అదృష్టం" నమస్కారం పెట్టాడు కోటయ్య.
      వెంటనే మత్స్యనంది సమద్రంలో మునిగి బోలెడు ముత్యాలు నోట కరుచుకుని వచ్చి కోటయ్యకు ఇచ్చి," ఇవి అతి విలువైన ముత్యాలు వీటిని అమ్మి బతుకు,మంచిపనులు చేయి.ఒక ముత్యం మటుకు అమ్మకు నీకు సదా మేలు జరుగుతుంది" అని చెప్పి సముద్ర అలలో కలసి పోయింది.
        కేవలం ఒక చేపను అపాయం నుండి తప్పించడం వలన కోటయ్యకు మేలు జరిగింది.మన కళ్ళ ఎదుట ఎవరైనా అపాయానికి గురి అవుతే మన చేతనైనంత సహాయం చేయాలి,నాకెందుకులే  అని వెళ్ళి పోకూడదు.ఏదో ఒక అదృశ్య శక్తి మనల్ని కాపాడుతుంది.
        కథ సముద్రానికి మనం మరోకథ వ్రాయడానికి మన గదికి.
             **********

కామెంట్‌లు