సరస్సు మంచితనం;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   ఆరావళీ పర్వతాల మధ్యలో ఒక సరస్సు ఉంది.అది స్వచ్ఛమైన నీటితో ఎన్నో జంతువుల,పక్షుల, అటుగా వచ్చే మనుషుల దాహం తీరుస్తుండేది.దానిలో రంగు రంగుల చేపలు ఉండి సరస్సుకు మరింత అందాన్ని ఇస్తున్నాయి! సరస్సు లో పడిన పురుగులను తినివేసి సరస్సును స్వచ్ఛంగా ఉంచుతున్నాయి చేపలు. చేసే సహాయానికి సరస్సు చేపలకు కృతజ్ఞతలు తెలిపింది. చుట్టూ ఎన్నో చెట్లు ఉన్నాయి.అవి రంగు రంగు పూలతో పచ్చదనంతో ఆప్రాంతానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తున్నాయి.
          ఒకరోజు గంధర్వుడు తన లోకం నుండి సరస్సు వద్దకు వచ్చాడు.ఆ ప్రాంతం గంధర్వుడికి ఎంతో నచ్చింది.సరస్సు మరీ నచ్చింది!
          జింకలు మొదలైన జంతువులు తమ దాహం తీర్చుకోవటం చూసి గంధర్వుడు సంతోషించాడు.ఎందుకంటే సరస్సు కూడా ప్రాణుల దాహం తీర్చి సేవ చేస్తోంది కదా!
        ఒక వ్యక్తి బడలికతో సరస్సు వద్దకు వచ్చి మొహం కడుక్కుని నీరు త్రాగి తృప్తిగా నిద్ర పోయాడు.ఇదంతా అదృశ్య రూపంలో ఉన్న గంధర్వుడు గమనించాడు.
సరస్సు ఆహ్లాదం పంచిదాహం తీర్చి ఆరోగ్యం పంచుతోంది. మరి సరస్సుకు ఏదైనా వరం ప్రసాదించాలని గంధర్వుడు తలిచాడు.వెంటనే తన చేతిని ఆసరస్సులో ముంచి ధన్వంతరీ మంత్రం చదివాడు.సరస్సు లోని నీటికి ఎన్నో ఔషద గుణాలు లభించాయి! సరస్సు   తన నీళ్ళలో ఆనంద తరంగాలు ప్రసరింపచేసింది.
         కొద్ది సేపటి తరువాత ఆ నిద్ర పోయిన వ్యక్తి లేచి నీళ్ళు త్రాగాడు.అతనిలో కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది!అది మొదలు మనుషులు,జంతువులు,పక్షులు ఆ సరస్సు నీళ్ళు తాగుతే ఏదైనా సుస్తీ ఉన్నా నయమైపోసాగింది. మామూలుగా దాహానికి ఆ సరస్సు నీరు త్రాగితే రోగనిరోధక శక్తి పెంపొందసాగింది.ఆ సరస్సు ఆరోగ్య ప్రదాయిని అని పేరు పొందింది.
         ఇదీ సరస్సు కథ.నీతి ఏమిటంటే మనం కూడా స్వచ్ఛమైన మనసుతో,సేవాగుణం  కలిగి ఉంటే పైవాడి దీవెనలతో మన సంకల్ప బలం పెరుగుతుంది.
                ******************

కామెంట్‌లు