బీరన్న దోశ ఇడ్లీ ఫ్యాక్టరి;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  కర్నూలు జిల్లా  ఆదోనీ దగ్గరున్న ఆస్పిరి నుండి హైదరాబాద్ కి వచ్చాడు పరాల బీరన్న.బీరన్న కి ఆస్పిరిలో ఓ చిన్న పాక హోటల్ ఉంది.అధ్బుతంగా దోశలు, ఇడ్లీలు చేస్తుంటాడు.ఇడ్లీ తో కారం పొడి నెయ్యి వేసుకుని తింటే కొంచెం తిండి పుష్టిగల మనిషైతే ఏకంగా ఓ పది ఇడ్లీలు లొట్టలేసుకుంటూ తినగలడు.ఇక దోశల విషయానికొస్తే గుండ్రటిదోశలు గుమ గుమ లాడే వేరుశనగ చట్నీ,అల్లం పచ్చడితో తినాల్సిందే!
        అంతబాగా చేస్తున్న బీరన్న దోశలు తిన్న నారయ్య "ఇంత బాగా చేస్తున్నావు ఇడ్లీ,దోశలు నామాట విని హైదరాబాద్ కి వచ్చి కనీసం బండి హోటల్ పెట్టు ఇక నీకు డబ్బే డబ్బు.నీవు ఈ ఊళ్ళో ఎంతచేసినా సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుందికదా,ఆలోచించు" అన్నాడు.
       "నిజమే ఇక్కడ ఎంత హోటల్ వ్యాపారమున్నా సంపాదన అంతంత మాత్రమే, అందుకే హైదరాబాద్ వెళ్ళి అదృష్టాన్ని పరీక్షించుకోవాలి" అనుకున్నాడు బీరన్న.
      ఓ మంచి ముహూర్తం చూసి పదివేలతో హైదరాబాద్ కి బయలు దేరాడు, రకరకాల బండ్ల వ్యాపారుల్ని అడిగి అడ్వాన్సు ఇచ్చి ఓ తోపుడు బండి అద్దెకు తీసుకుని ఓ పార్క్ దగ్గర బండి పెట్టుకుని ఆస్పిరిలో వేసే దోశలు,ఇడ్లీల వంటివే ఇక్కడావేయటం మొదలు పెట్టాడు.రోజు రోజుకీ అతని తిండి రుచి మరిగిన ప్రజలు ఒకరికి ఒకరు చెప్పుకోవడం వలన బీరన్న వ్యాపారం మూడు ఇడ్లీలు ఆరు దోశలుగా మారిపోయింది.హైదరాబాద్ కి తగిన రేట్లు దోశ,ఇడ్లీలకు నిర్ణయించాడు.
     బీరన్నలో ఉన్న సుగుణం ఏమిటంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు,మాట సొంపుగా మాట్లాడతాడు.అసలైన వ్యాపారికి ఉండాల్సిన లక్షణాలు అతనికి ఉన్నాయి.వ్యాపారం పెరిగిందికదా,మరి సహాయం చేయడానికి మనుషులు కావలసి వచ్చారు.ఆస్పిరి నుండి తన బామ్మర్దిని,మరొకణ్ణీ పిలుపించుకుని మంచి జీతాలు ఇవ్వసాగాడు,త్వరలోనే ఇద్దరు హైదరాబాద్ కుర్రాళ్ళని కూడా పనిలోకి తీసుకున్నాడు. మరి రోజులన్నీ ఒకటిగా ఉండవు కదా ఒక హైదరాబాద్ కర్రోడికి హస్తలాఘవం ఎక్కువ ,బీరయ్యకు తెలియకుండా గళ్ళా పెట్టెలోని డబ్బులు కొన్నింటిని నొక్కేయ సాగాడు! అది గమనించిన బీరయ్య వాణ్ణి పనిలోనుండి తీసి తరిమేశాడు అది ఒక అనుభవం! గబుక్కున కొత్త వాళ్ళని నమ్మకూడదని నిశ్చయించాడు.
          అలా అలా బీరన్నఅభివృద్ధి చెంది ఓ సింగిల్ బెడ్రూము ఫ్లాట్ కొనుక్కుని తన కుటుంబాన్ని ఆస్పిరి నుండి హైదరాబాద్ కి తెచ్చుకున్నాడు.
       ఇంకా చిత్రమేమటంటే కష్టపడి కూడబెట్టి ఓపాత హోటల్ అమ్మేస్తుంటే కొన్నాడు.
         అతని,ఇడ్లీలు,దోశలు తినడానికి అప్పుడప్పుడూ ఎమ్.బి.ఏ విద్యార్థులు వచ్చేవారు.
          అందులో ఓ విద్యార్థికి ప్రాజెక్టు వర్క్ చేయడానికి బీరన్నహోటల్ అతని అభివృద్ధిని ఎంచుకున్నాడు! ఆ విద్యార్థి తన ప్రాజెక్టు విషయాన్ని చెబితే బీరయ్య ఆశ్చర్య పోయాడు.
       ఆ విద్యార్థిని అడిగి బోలెడు విషయాలు తెలుసుకున్నాడు.
       తన కొడుకుని కూడా ఎమ్.బి.ఏ చదివించాడు.
      కొద్ది సంవత్సరాలలోనే హైదరాబాద్ మణికొండలో "బీరన్న దోశ,ఇడ్లీ ఫ్యాక్టరీ" అనే హోటల్ ఏర్పడింది.
        క్వాలిటీ,డెడికేషన్ ఉంటే వ్యాపారంలో రాణిస్తారు కదా!
                *********

కామెంట్‌లు