సాహసయాత్ర;-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

    కొంతమందికి ఏదో ఒక సాహస యాత్ర చేయాలని,సాహస కథలు లేదా నిజంగా జరిగిన సంఘటనల్ని గురించి చదవాలనే బలీయమైన కోరిక ఉంటుంది.కొందరు సైకిల్ లేదా మోటార్ సైకిల్ మీద ప్రపంచాన్ని చుట్టి వస్తారు.కొందరు బోటులో ప్రపంచాన్ని చుట్టి రావాలని,ఇంకొందరు బెలూన్ లో సుదీర తీరాలు చూడాలను కొంటారు.
        అటువంటి కోవకు చెందినవాడే వీరకుమార్.
కొత్త ప్రదేశాలను కనిపెట్టాలని, కొత్త విషయాలు ప్రపంచానికి తెలియ చెయ్యాలని కలలు కంటుంటాడు.  ఆ విషయాల మీద గూగుల్ వెతికి వెతికి అడ్వంచర్ యాత్రలకు చేయూతనిచ్చే రకరకాల సంస్థలను వెతికి తన డైరీలో వ్రాసుకున్నాడు.
       ఎలాగో 'సీ అడ్వెంచర్' అనే దక్షిణ అమెరికాసంస్థను సంప్రదిస్తే  మూడులక్షల ఫీజుతీసుకుని బోటులో ప్రయాణానికి,జాగ్రత్తలకు ఆరునెలలు ట్రైనింగ్ ఇస్తామని వివరంగా లేఖ వ్రాసారు.
         వీరకుమార్ ఓ పది లక్షలు సేకరించుకుని దక్షిణ అమెరికా వెళ్ళి మంచి ట్రైనింగ్ తీసుకుని మిగతాడబ్బు తో బోటు అద్దెకు తీసుకుని బోటులో కావలసినవన్నీ సమకూర్చుకున్నాడు. ఏదైనా నిధి దొరుకితే డెబ్భై శాతం అతను తీసుకోవచ్చునని,మిగతాది కంపెనీ తీసుకుంటుందనీ అగ్రీమెంటు వ్రాయించుకున్నారు.
         తుఫానులు ఇతర ప్రకృతి వైపరీత్యాలు లేవని వాతావరణ నిపుణుల వద్ద తెలుసుకున్నాక అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణించడం మొదలు పెట్టాడు.
   అలా ప్రయాణిస్తూనే ఉన్నాడు దిక్సూచి ని చూసుకుంటూనే ఉన్నాడు, బోటులో తాగునీటిని చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాడు.
     ప్రకృతిని గురించి ఎవరెన్ని ఎన్ని అంచనాలు వేసినా ప్రకృతి దాని పని అది చేస్తుందికదా! 
       మెల్లగా నల్లని మబ్బులు కమ్ముకొచ్చాయి.గాలి వీయడం మొదలు అయింది.చిన్నగా చినుకులు ప్రాంభమయ్యాయి.
       వీరకుమార్ పడవ అదుపు తప్ప సాగింది! ఆగాలి ధాటికి అది వేరే దిక్కుకు పోసాగింది! అంతే సాయంత్రానికి ఒక దీవిని చేరింది అసలే వాన చీకట్లు కమ్ము కుంటున్నాయి. ఇక ఎందుకైనా మంచిదని పడవకు లంగరు వేసి గొలుసుతోకట్టి ఒక గూటం పాతి దానిని కట్టాడు.
        తల దాచుకుందుకు ఏదైనా ఇల్లు గానీ మరీదైనా కనబడుతుందేమో అని బిస్కెట్ల డబ్బా,నీళ్ళ బాటిల్ తీసుకుని కనబడుతున్న కొండ వైపు అరచుకుంటూ పరుగెత్తాడు.కానీ ఎవరూ పలకలేదు. అలా కొంత దూరం వెళ్ళే సరికి.కొండలో ఓ గుహ కనబడింది,గుహలోకి పోవాలంటే వీరకుమార్ కి భయం వేసింది. తన మొలనున్న టార్చ్ లైటు తీసి గుహలోకి వేసాడు.ఏ అలికిడి లేదు! జంతువులు కూడా ఆ దీవిలో లేనట్టుంది! ఏది ఏమైనా వాన తగ్గేంత వరకు అక్కడే గడప దలుచు కున్నాడు గుహలో ఓ రాయి మీద పడుకున్నాడు.నిద్ర పట్టేసింది.
        తెల్లవారింది  అప్పటికి వాన వెలిసింది.సూర్య కిరణాలు వీరకుమార్ మొహం మీద పడ్డాయి. మెడలో వేలాడు తన్న కెమేరాతో గుహ బయటికి వచ్చి కొండను గుహను ఫోటో తీసాడు.
      ఎంత తిరిగినా మనుషులెవరూ కనబడలేదు! కొద్ది దూరం వెళ్ళే సరికి కొన్ని జంతువుల ఎముకలు అంటే కంకాళాలు పడి ఉన్నాయి! వీరకుమార్ కి వళ్ళు జలదరించింది.
    వాటిని కూడా ఫోటోలు తీసాడు ఆదీవి పేరేమిటో అతనికి తెలియదు!ఇక లాభంలేదని తన పడవ వద్దకు పరుగెత్తి రేడియో పరికరం ద్వారా సందేశం పంపాలని చూస్తే ఆ పరికరం పనిచేయడం లేదు! మరికొంత పరిశీలిద్దామని వెళితే  అక్కడ నేలనుండి చిత్రమైన గుండ్రటి గుడ్డు లాటిది పొడుచుక వచ్చినట్టు కనబడింది! దానిని కూడా ఫోటో తీసుకుని పడవ లంగరు తీద్దామని వెళుతుంటే దూరంగా ఓ పాడు పడిన పడవ కనబడింది. జాగ్రత్తగా పడవలోకి చూస్తే కుర్చీలో కూర్చున్నటు మనుషుల అస్థి పంజరాలు కనబడ్డాయి! మరింత తరచి చూస్తే ఓ పట్టె కనబడింది దాని మీద పోర్చుగీసు 1784 అని ఉంది! అంటే అప్పటిలో వచ్చిన పోర్చుగీసు వాళ్ళు ఏ కారణం చేతనో చనిపోయి ఆ ఒడ్డుకు పడవతో సహా కొట్టుకొచ్చినట్టుంది! పెట్టె తీసి చూస్తే బంగారు ఆభరణాలు,నాణేలు ఉన్నాయి.వీరకుమార్ కళ్ళు మెరిసాయి ఆ దృశ్యం అంతా ఫోటోలు తీసి జాగ్రత్తగా తన పడవలోకి ఆ పెట్టె చేర్చాడు.
        ఇక తిరుగు ప్రయాణం అయిపోయాడు వీరకుమార్.ఏదో విధంగా దక్షిణ అమెరికా చేరుకుని 'సీ అడ్వెంచర్' సంస్థ వారిని కలసి తన అనుభవాలు ఫోటోలు ఛూపించాడు.వాళ్ళు ఆశ్చర్య పోయారు.ఇంతకు ముందు వెళ్ళిన బృందాలు తిరిగి రాలేదని ఎంత వెతికినా వారి పడవలు కానీ ఆచూకీ కానీ లభించలేదని చెప్పారు.అక్కడ వింత పక్షుల గుడ్లు ఉన్నట్టుందని ఆ నల్లని గుండ్రటి ఆకారంచూసి చెప్పారు.అతని యాత్ర వలన ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలిసాయని అతనిని దక్షిణ అమెరికా యూనివర్సిటీ సన్మానించి, పదివేల డాలర్లు,దొరకిన బంగారంలో డెబ్బై శాతం ఇచ్చి 'సాహస యాత్రికుడు' అనే బిరుదు ఇచ్చారు.
       వీరకుమార్ తన అనుభవాలతో ఓ పుస్తకం వ్రాశాడు.అనేక పత్రికలు అతని సాహసాన్ని పొగిడాయి.మన ప్రధాని కూడా ఒక సభలో మెడల్ ఇచ్చి పొగిడి డిల్లీ యూనివర్సిటీలో సాహసాల మీద పరిశోధనలు చేసేవారికి గైడ్ గా ఉద్యోగం ఇచ్చి గౌరవించారు.
    సాధించాలనే తపన,ధైర్యం ఉంటే ఏదీ అసాధ్యం కాదు.
    (బర్నాకెల్స్ దీవిని గురించి చదివాక వచ్చిన ఆలోచనే ఈ కథ)
                ***********

కామెంట్‌లు