శిల్పి చెప్పిన సత్యం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  యువరాజు విజయసింహకు శిల్ప కళ అంటే ఎంతో ఇష్టం. పక్క రాజ్యంలో జక్కన అనే శిల్పి అద్భుత శిల్పాలు చేస్తున్నట్టు విజయ సింహకు తెలి సింది.
       విజయసింహ మంత్రి సుహస్తుడితో కలసి ఆశిల్పిని కలవడానికి వెళ్ళాడు.తమను తాము జక్కన్నకు పరిచయం చేసుకున్నారు విజయసింహ,సుహస్తులు. జక్కన అత్యధ్బుత శిల్ఫాలు చెక్కుతున్నాడు. ఒక్కొక్క శిల్పంచూస్తుంటే అసలు కళ్ళు తిప్పుకోలేము అంత అందంగా ఉన్నాయి శిల్పాలు.
        చిత్రమేమిటంటే ఆయన శిల్పాలు చెక్కే చోటుకు  పక్కనే ఎన్నో అందమైన శిల్పాలు పడవేసి ఉన్నాయి.వాటిని చూసి విజయసింహ,సుహస్తుడు ఆశ్చర్య పోయారు!
         "జక్కన గారూ మీ శిల్పాలు అత్యధ్బుతంగా ఉన్నాయి.కానీ అన్ని అందమైన శిల్పాలు ఆ పక్కన ఎందుకు పడవేసారు?" అడిగాడు విజయ సింహ.
          జక్కన చిరునవ్వుతో ఈ విధంగా చెప్పాడు.
  "విజయసింహా నేను చెక్కే శిల్పాలలో నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటాను.ఆ శిల్పాలలో ఏ మాత్రం లోపం వచ్చినా పక్కన పడవేస్తుంటాను.ఆ లోపాలు చాలా నిశితంగా చూస్తేకానీ కనపడవు.నేనే శిల్పం మొత్తం చెక్కుతాను కాబట్టి అందులో లోపం నాకు తెలిసిపోతుంది.చాలా మంది మీలాగే అడిగారు ఎందుకు శిల్పాలు పడవేసారని,ఎందుకంటే వారికి లోపాలు కనబడలేదు!  ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మనందరం కేవలం శిల్ప కళేకాదు ఏ విషయం సాధించాలన్నా పూర్తి శ్రద్ద,ఓపిక ఉండాలి,సాధ్యమైనంత వరకు లోపాలు లేకుండా చూసుకోవాలి" అని ఎన్నో మంచి విషయాలు జక్కన చెప్పాడు,కేవలం అందమైన శిల్పాలు చూడటమే కాదు జక్కన మంచి మాటలు విజయసింహునికి,సుహస్తుడికీ పూర్తి తృప్తినిచ్చాయి.ఆ రోజు వారు ఒక సందేశం తెలుసుకున్నారు.తమ అంతఃపురంలోకి అందమైన దేవతా శిల్పాలు పది తయారు చేయమని చెప్పి కొంత బంగారం జక్కన్నకు ఇచ్చారు.
        తరచి చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర మనం ఏదో ఒక మంచి విషయం నేర్చుకోవచ్చు కదా!
               **********

కామెంట్‌లు