ప్రకృతి శక్తి;-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  శాండిన్యుడు అనే ఋషి ఒకసారి విక్రమసింహుడి ఆస్థానానికి వెళ్ళాడు.విక్రమసింహుడు శాండిన్యుడికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చాడు.
     భోజన సమయంలో " మహాఋషీ,మాకు క్లిష్ట పరిస్థితులు సంభవించినప్పుడు తమరి సలహాలు,ఆశీర్వచనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అందుకే తమరు ఇక్కడే ఉండి భోగభాగ్యాలు అనుభవిస్తూ నిరంతరం మాకు సలహాలు ఇస్తుండండి.ఎంతకాలం అడవిలో ఉండగలరు?మీ శక్తిని అడవికి ఎందుకు ధార పోస్తారు?" విక్రమ సింహుడు అడిగాడు.
      శాండిన్యుడు చిరునవ్వునవ్వి"రాజా నీ ప్రశ్నకు ఇప్పుడు జవాబు చెప్పిలాభంలేదు.వచ్చే పౌర్ణమికి నీవు నీ ఆస్థాన గాయకుడు మహతి రండి,అడవిలో మునులెందుకు తపస్సు చేస్తారో ప్రకృతికి ఉన్న శక్తి ఏమిటో తెలుస్తుంది" చెప్పాడు శాండిన్యుడు.
       పౌర్ణమి నాడు విక్రమసింహుడు తన ఆస్థాన గాయకుడు మహతితో శాండిన్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు.అక్కడి స్వచ్ఛమైన గాలి,చెట్ల గలగలలు,పక్షుల కిలకిలరావాలు విక్రమసింహుడిని పరవశింపచేసాయి.విక్రమసింహుడు తన కత్తి తీసి ఒక పక్కన పెట్టి ఆ వాతావరణంలో అలా తిరిగి వస్తానని వెళ్ళాడు.గాయకుడు మహతి కళ్ళు మూసుకుని ఒక చెట్టు కింద కూర్చున్నాడు.అతనికి తెలియకుండానే తన్మయత్వంతో శ్రావ్యంగా ఒక పాట పాడసాగాడు.ప్రకృతి అతని పాటకు వింత శ్రావ్యతను చేకూర్చింది! అప్పుడే అటువచ్చిన విక్రమ సింహునికి మహతి పాట తన ఆస్థానంలోకంటే అతి శ్రావ్యంగా వినబడసాగింది.పాట అంతా అయ్యాక
      "ఎలా ఉంది మహతి పాట?" అడిగాడు శాండిన్యుడు.
     "నేను సభలో విన్నదానికంటే అతి శ్రావ్యంగా ఉంది"చెప్పాడు విక్రమ సింహుడు.
      "చూశావా విక్రమసింహా ఇక్కడి ఆహ్లాదకరమైన ప్రకృతి,స్వచ్ఛమైన గాలి మనిషిలో దాగి ఉండే శక్తిని,సృజనాత్మకతను మేల్కొలుపుతుంది.నీ ఆస్థానంలో నీవు మహతి పాటను పూర్తిగా ఆస్వాదించలేవు,కారణ నీ మెదడు రాజకీయ సమస్యలతో సగం నిండి ఉంటుంది.మహతి కూడా పూర్తి తన్మయత్వంతో పాడలేడు.అదే ఇక్కడ ప్రకృతి అతని లో ఉన్న తన్మయత్వాన్ని బయటకు తీసింది.
 అందుకే ఋషులు అడవిలో తపస్సు చేసేది,ఇక్కడ సంపాదించిన శక్తి,సృజనాత్మకత ,ఆలోచనా పటిమ మేము ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తాము.నీవు నా ఆశ్రమానికి వస్తూనే కత్తి తీసి పక్కన పెట్టావు,అంటే పచ్చని ప్రకృతి  నీలో ఉన్న శాంతికాముకతను ధృఢ పరచింది!మహతిలో ఉన్న గానకళ ప్రకృతి స్పర్శతో మరింత బయట పడింది.అదే ఈ ప్రకృతి శక్తి" వివరించాడు శాండిన్యుడు.
       " మా రాతి భవనాల్లోని భోగభాగ్యాలకన్నా ఉన్నత శక్తి ప్రసాదించే గుణం ఈ ప్రకృతిలో ఉందని గ్రహించాను.ధన్యుడయ్యాను స్వామీ! ప్రతి నెలా ఒక్కరోజయినా నా ఆస్థాన కళాకారుడితో మీ ఆశ్రమంలో గడుపుతాను,మనసును ప్రశాంత పరచుకుంటాను" అని చెప్పి శాండిన్యుడి ఆశీర్వచనం తీసుకుని మహతితో రాజధానికి వెళ్ళిపోయాడు విక్రమ సింహుడు.
          **********

కామెంట్‌లు