వక్ర బుద్ధి వద్దు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

 సుబ్బయ్య, రామయ్య పనులు వెతుక్కుంటూ రాజధానికి బయలుదేరారు.అలా పోతూ పోతూ అడవిలో ఓ చెట్టుకింద విశ్రమించారు.
        ఆచెట్టు మీద కంబనం అనే రాక్షసి ఉంటోంది.
చెట్టు కింద కూర్చున్న సుబ్బయ్య,రామయ్యలు తాము తెచ్చుకున్న చపాతీలు,గుమగుమలాడే కుర్మా కూర తీసి కబుర్లు చెప్పుకంటూ తిన సాగారు.
   ఇదంతా చెట్టు పైనుండే కంబనం రాక్షసి చూసింది.ఆ వాసనకు దాని నోరూరింది.అంతే అది ఓ అవ్వ రూపం ధరించి వారి వద్దకు వచ్చి, "బాబూ ఐదు రోజుల నుండి తిండి తినలేదు చెరొక రొట్టె కూర ఇస్తే నా ఆకలి తీరుతుంది" దీనంగా చెప్పింది.
        "అయ్యో,ఎంతమాట పెద్దదానివి ఇదుగో రొట్టెలు" ఇచ్చి, " ఇంకా కావాలంటే అడుగు" అన్నారు.
      "మీది మంచి మనసు"అన్నది.
      " అవును అవ్వా ఈ వయస్సులో ఈ అడవిలో ఏంచేస్తున్నావు?" అడిగాడు సుబ్బయ్య.
        "నా కొడుకు కట్టెలు కొడుతూ అడవిలోకి రెండురోజులక్రితం వచ్చాడు.మరలా తిరిగి రాలేదు.వాడిని వెతుకుతూ ఇటొచ్చాను" చెప్ఫి వడి వడిగా వెళ్ళి పోయింది.
       "అయ్యో" అనుకున్నారు ఇద్దరూ.ఇక బడలికతో నిద్ర పోయారు.
         ఓ గంట తరువాత మెలకువ వచ్చి చూస్తే వారి పక్కన ఓ మూట పడిఉంది! ఏమిటా అని చూస్తే అందులో వజ్రాలు ఉన్నాయి.ఇద్దరూ ఆశ్చర్య పోయారు.
       ఆ వజ్రాలు చూసే సరికి సుబ్బయ్యకు దుర్బుద్ధి పుట్టింది. ఏమైనా కనీసం నాలుగు వజ్రాలు తను తీసుకుంటే మరింత దర్జాగా బతకవచ్చునని దుష్ట ఆలోచన చేశాడు.
       మార్గమధ్యంలో ఇద్దరూ ఒక రాయి మీద కూర్చున్నారు.
      " నాకు దాహం వేస్తోంది, నీరసంగా ఉంది,వెళ్ళి ఈ చెంబులో నీళ్ళు తీసుకరా"చెప్పాడు సుబ్బయ్య.
  దొరికిన సంచీ సుబ్బయ్య వద్ద ఉంచి రామయ్య కొంత దూరంలో ఉన్న కొలను వద్దకు వెళ్ళాడు,అదే అదనుగా సుబ్బయ్య నాలుగు వజ్రాలు తీసి తన సంచీలో దాచాడు.
      కంబనం రాక్షసికి శక్తులు ఉన్నాయి కనుక సుబ్బయ్య వక్ర బుద్ధిని కని పెట్టి సుబ్బయ్య సంచీలో వేసుకున్న నాలుగు వజ్రాలను నాలుగు బొగ్గులుగా మార్చింది,రామయ్య మంచి మనసు తెలుసుకున్నది కనుక రామయ్య సంచీలో ఎనిమిది వజ్రాలు అదృశ్యంగా ఉంచింది!
       రామయ్య మంచి మనసుతో వజ్రాల సంచీలోంచి సగం వజ్రాలు తీసి సుబ్యయ్య కు ఇచ్చాడు. ఇంకేముంది ఇంటికి వెళ్ళిన సుబ్బయ్య తన సంచీ తీసి చూస్తే నాలుగు బొగ్గులున్నాయి.వాటిని చూసి సుబ్బయ్య ఏడుపు ముఖం పెట్టుకున్నాడు. ఆ గదిలో కంబనం రాక్షసి అవ్వ రూపంలో ప్రత్యక్షమయి ఈవిధంగా చెప్పింది " సుబ్బయ్యా నాకు కొన్ని శక్తులు ఉన్నాయి,నిన్ను నమ్మిన స్నేహితుణ్ణి మోసం చేయాలని చూశావు,అందుకే నీవు దొంగలించిన వజ్రాలను బొగ్గులుగా మార్చాను.జీవితంలో ఎప్పుడుకానీ మోసంతో బతకకు.కొద్ది సేపటిలో రామయ్య మంచితనం చూస్తావు.తెలుసుకో" అని చెప్పి మాయం అయింది.
      కొద్ది సేపటికే రామయ్య సుబ్బయ్య వద్దకు పరుగున వచ్చి "సుబ్బయ్యా,నా సంచిలో ఎనిమిది వజ్రాలు ఉన్నాయి,అవి ఎట్లా వచ్చాయో తెలియదు. ఇదిగో నాలుగు తీసుకో" చెప్పాడు సుబ్బయ్య.
      రామయ్య మంచితనం సుబ్బయ్యను కదిలించింది.
      జరిగినదంతా రామయ్యకు చెప్పి తనను క్షమించమని అడిగాడు సుబ్బయ్య.
      " ఒక్కొక్క సారి ఆశ మనిషిని వక్ర మార్గంలో నడిపిస్తుంది,అప్పుడే మనల్ని మనం నిగ్రహించుకోవాలి" అని చెప్పి రామయ్య వెళ్ళిపోయాడు.
          

కామెంట్‌లు