మంచి ఆలోచన:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

    వాసూకి కథలంటే చాలా ఇష్టం.బోలెడు కథల పుస్తకాలు వాసు సేకరించాడు.అప్పుడప్పుడూ వాసు ఇంటికి స్నేహితులు వచ్చి ఆ పుస్తకాలు చదువుకునే వారు.
         వాసు మెయిన్ రోడ్డులో ఆదివారం ఫ్లాట్ ఫారం మీద అమ్మకానికి పెట్టే పుస్తకాలు చూసి,వాటిలో మంచి కథల పుస్తకాలు తక్కువ ధరకి కొనుక్కుని తన ఇంటి లైబ్రరీలో పెట్టుకుని హాయిగా కథలు చదువుకునేవాడు.
       ఒక ఆదివారం వాసు ఆ ఫ్లాట్ ఫారం మీద పెట్టిన పుస్తకాలు చూద్దామని వెళ్ళాడు. మంచి రంగుల ముఖ చిత్రంతో ఓ మంచి బాలల కథల పుస్తకం వాసు చూసి దానిని ఐదు రూపాయలకు కొని ఇంటికి తీసుకవెళ్ళిఎంతో ఆసక్తితో పుస్తకం పేజీలు తిప్పాడు.చిత్రంగా పుస్తకం మధ్య పేజీల్లో ఓ వంద రూపాలు ఉంది.అది చూసి వాసు ఆశ్చర్య పోయాడు.
        ఆ నోటును వాసు అమ్మకు చూపించాడు.
      "పాపం ఆ పుస్తకం అమ్మిన వాళ్ళు నోటు చూసుకోకుండా ఆ ఫ్లాట్ ఫాం మీద పుస్తకాలు అమ్మే అతనికి అమ్మి ఉంటారు.మనకు ఆ విధంగా వచ్చిన డబ్బు వద్దు వాసూ,ఈ వందతో ఒక మంచి పని చేద్దాం,మనం మరలా ఆ పుస్తకాలు అమ్మే  అతని వద్దకు వెళ్ళి ఈ వందరూపాయలతో కొన్ని మంచి పుస్తకాలు కొని మీ స్కూల్ లైబ్రరీకి ఇద్దాం ఏమంటావు?" అడిగింది వాసు అమ్మ.
         "హుర్రే!మంచి ఆలోచన చేశావమ్మా"అని సంతోషం వ్యక్తం చేసాడు వాసు.
           ఇద్దరూ ఆ పుస్తకాలు అమ్మే అతని వద్దకు వెళ్ళి వందకి బాలల కథల పుస్తకాలు,ఓ రెండు అందరికీ ఉపయోగపడే పుస్తకాలు కొన్నారు.
        రెండోరోజు స్కూల్ ప్రేయర్ సమయం అప్పుడు హెడ్మస్టర్ కి ఆపుస్తకాలు స్కూల్ లైబ్రరీకి ఇస్తున్నట్టు చెప్పాడు వాసు.
         వాసు చేసిన మంచి పనిని హెడ్మాస్టర్ ఎంతో మెచ్చుకుని పిల్లలందరికీ పుస్తకాలు చూపించి పుస్తకాలను అందరూ బాగా చదవాలని చెప్పారు. పిల్లలు అందరూ చప్పట్లు కొట్టారు.
             

కామెంట్‌లు