*ఢాం... ఢాం... ఢాం... (జానపద సరదా కథ)* ;-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒక అమాయకుడున్నాడు. అమాయకుడంటే ఏమీ తెలీనోడు అన్నమాట. ఒకరోజు వాళ్ళమ్మ వాన్ని పిల్చి "రేయ్... సంతకు పోయి ఒక మాంచి గుర్రాన్ని కొనుక్కోని రాపో" అని డబ్బిచ్చి పంపిచ్చింది. వాడు అట్లాగేనంటూ సంతకు పోయి బేరమాడకుండానే వాడు అడిగినంత డబ్బిచ్చి ఒక గుర్రాన్ని కొనుక్కోని ఇంటికి బైలుదేరినాడు.
వాడు గుర్రాన్ని తాడు పట్టుకోని పోతా వుంటే ఎదురుగా ఒకడు గుర్రం మీద పోతా కనబన్నాడు. అది చూసి వానికి కూడా గుర్రాన్ని ఎక్కాలనిపించింది. కానీ ఎట్లా ఎక్కాల్నో అర్థం కాలేదు. దాంతో వెనుకవైపు నుండి తోక పట్టుకొని పైకి ఎక్కినాడు. ఎక్కినాడు గానీ దాన్ని ఎట్లా తోలాల్నో అర్థం కాక "థాయ్.. థాయ్...." అంటూ గట్టిగా ఒక్కేటు కొట్టినాడు. అంతే... దానికి కోపమొచ్చి ఎగిరి వాన్ని కింద పడేసింది. వాడు పైకి లేచి “ఇదేందిరా నాయనా! మంచి గుర్రమియ్యమంటే ఇట్లా కింద పడేసే గుర్రమిచ్చినాడు... దీన్ని ఎట్లా వదిలించుకోవాలబ్బా" అని ఆలోచిస్తా... ఆలోచిస్తా... పోతా వుంటే దారిలో ఒకడు పొట్టేలు తీసుకోని వస్తా కనబన్నాడు. వెంటనే వీడు వాని దగ్గరికి పోయి “అనా... అనా... నా గుర్రాన్ని తీస్కోని నీ పొట్టేల్ని ఇస్తావా" అని అడిగినాడు.
పొట్టేలు కన్నా గుర్రం విలువైందిగదా... దాంతో వాడు “వీడెవడో తిక్కోనిలెక్కున్నాడే" అని నవ్వుకుంటా పొట్టేలునిచ్చి గుర్రాన్ని తీసుకోని పోయినాడు.
వాడు పొట్టేలుని తీసుకోని పోతా వుంటే మధ్యలో “ఈ పొట్టేలుకి కాళ్ళూ చేతులు అన్నీ సక్కగా వున్నాయా లేదా" అని అనుమానమొచ్చింది. దాంతో వాడు కాళ్ళూ, చేతులు, చెవులు అన్నీ చూస్తా... చూస్తా... ముందుకొచ్చి దాని కండ్లలోకి సూటిగా చూసినాడు. వాడట్లా చూస్తా వుంటే భయపడిన ఆ పొట్టేలు నాలుగడుగులు వెనక్కేసి వేగంగా ముందుకొచ్చి తన తలతో వాని తలకు ఎగిరి ఢామ్మని ఒక డిచ్చీ కొట్టింది. అంతే... ఆ దెబ్బకు వానికి దిమ్మ తిరిగి దభీమని పడిపోయినాడు.
"ఇదేందిరా నాయనా... మంచి పొట్టేలియ్యమంటే... ఇట్లా తన్నే పొట్టేలు ఇచ్చినాడు. దీన్ని ఎట్లా వదిలించుకోవాల" అని వాడు ఆలోచించుకుంటా పోతా వుంటే ఎదురుగా ఒకడు సంకలో కోడి పెట్టె పెట్టుకోని వస్తా కనబన్నాడు.
వెంటనే వాడు వురుక్కుంటా వాని దగ్గరకు పోయి "అనా... అనా... నా పొట్టేలు తీసుకోని నీ కోడిపెట్టె ఇస్తావా" అని అడిగినాడు.
కోడిపెట్టె కన్నా పొట్టేలు చానా విలువయినది గదా... దాంతో వాడు “వీడెవడో తిక్కోని లెక్కున్నాడు" అని నవ్వుకుంటా కోడి పెట్టెనిచ్చి పొట్టేలుని తీసుకోని పోయినాడు.
వాడు కోడి పెట్టెను తీసుకోని పోతా వుంటే మధ్యలో చానా దప్పికయింది. ఒకచోట బావి కనబడితే కోడి పెట్టెను పక్కన పెట్టి నీళ్ళు తోడుకోసాగినాడు. కోడి పెట్టెను అట్లా వదలడం ఆలస్యం అది అదే సందనుకోని వురకడం మొదలు పెట్టింది. వాడు అదిరిపడి దాని వెనుక పడినాడు. అది వాన్ని ముళ్ళకంపలల్లో, దిబ్బలల్లో బాగా ఉరికిచ్చింది. ఆఖరికి వాడు కిందామీదా పడి దాన్ని పట్టుకున్నాడు. పట్టుకోని “ఇదేందిరా నాయనా!
మంచి కోడి పెట్టె కావాలనుకుంటే... ఇట్లా వురికిచ్చే కోడిపెట్టె వచ్చింది. దీన్ని ఎట్లాగయినా వదిలిచ్చుకోవాల" అనుకున్నాడు. వాడు పోతావుంటే దారిలో ఒకడు సంచిలో ఉల్లిగడ్డలు వేసుకోని వస్తా కనబన్నాడు. వెంటనే వాడు వురుక్కుంటా వాని దగ్గరకు పోయి “అనా... అనా... నా కోడిపెట్టె తీసుకోని నీ ఉల్లిగడ్డలు ఇస్తావా" అని అడిగినాడు.
ఉల్లిగడ్డలకన్నా కోడిపెట్టె చానా విలువయినది గదా... దాంతో వాడు “వీడెవడో తిక్కోని లెక్కున్నాడే" అని నవ్వుకుంటా ఉల్లిగడ్డలనిచ్చి కోడిపెట్టె తీసుకోని పోయినాడు.
వాడు ఉల్లిగడ్డలు తీసుకోని పోతావుంటే మధ్యన ఈ ఉల్లిపాయలు బాగున్నాయా... లేదా... అని అనుమానమొచ్చింది. దాంతో వాడు ఒక ఉల్లిపాయ తీసుకోని కొరికినాడు. అంతే... దాని ఘాటుకు వాని కళ్ళలోంచి సర్రున నీళ్ళు కారినాయి. వాడదిరిపడి ఇదేందిరా నాయనా... మంచి ఉల్లిపాయలు కావాలనుకొంటే...ఇట్లా ఏడిపిచ్చే ఉల్లిపాయలు వచ్చినాయి. ఎట్లాగయినా వీటిని వదిలిచ్చుకోవాల" అనుకుంటూ పోతావుంటే దారిలో ఒకడు సంబరంగా బైటికి చప్పుడు వినబడకుండా నోట్లోనే పాట పాడుకుంటా చిటికెలేస్తా వస్తూ కనబన్నాడు. వానికి ఆ చిటికెల చప్పుడు బాగా నచ్చింది.
వెంటనే వాడు వురుక్కుంటా వాని దగ్గరకు పోయి "అనా... అనా... నా ఉల్లిగడ్డలనిస్తా... అట్లా చిటికెలెట్ల వేయాల్నో నేర్పిస్తావా" అని అడిగినాడు.
దాంతో వాడు “వీడెవడో తిక్కోని లెక్కున్నాడే” అని నవ్వుకొన్నాడు. ఉల్లిగడ్డలు తీసుకోని బొటనవేలు, నడుమవేలు కలిపి చిటికెలెట్లా వేయాల్నో నేర్పించి వెళ్ళిపోయినాడు.
వాడు సంబరంగా చిటికెలేసుకుంటా పోతా వుంటే దారిలో ఒకచోట ఒక చెరువు కనబడింది. దాహం తీర్చుకుందామని చెరువులోనికి దిగి దోసిళ్ళనిండా నీళ్ళు తీసుకోని బాగా తాగినాడు. తాగినాక మళ్ళా మామూలుగానే చిటికె వేసినాడు.
కానీ చేయి తడయింది గదా... దాంతో ఎటువంటి చప్పుడు రాలేదు. వాడు అదిరిపడి “అరెరే... నా చిటికె నీళ్ళలో జారిపడిపోయిందిరా నాయనో.... ఎవరయినా వచ్చి దాన్ని తెచ్చియ్యండ్రా దేముడో" అని గుండెలు బాదుకుంటా ఏడ్చసాగినాడు.
అది చూసి జనాలంతా గుంపుగా చేరి “ఏమయిందిరా" అనడిగితే వాడు "ఏం చెప్పమంటారన్నా... నీళ్ళు తాగుతా వుంటే వేళ్ళ మధ్య నుంచి జారిపోయింది. యాడ పోయిందో... ఏమో" అన్నాడు ఏడుస్తా.
వాళ్ళు వేళ్ళ మధ్య నుంచి జారిపోయిందంటే బంగారు ఉంగరమేమో అనుకోని గబగబా నీళ్ళలోకి దిగి వెదకడం మొదలు పెట్టినారు.
కాసేపటికి వాని చేతి తడంతా అరిపోయింది. దాంతో మరలా చిటికె చప్పుడు వచ్చింది. దాంతో వాడు “ఏయ్... దొరికింది... దొరికింది..." అని ఎగురుకుంటా చిటికెలు ఏయసాగినాడు.
అదిచూసి అందరూ "అరెరే... అనవసరంగా ఈ తిక్కలోని మాటలు నమ్మి నీళ్ళలో దుంకినామే" అని గొణుక్కుంటా వెళ్ళి పోయినారు.
వాడు సంబరంగా చిటికెలేసుకుంటా 
గుర్రం పోయీ పొట్టేలౌచ్చా ఢాం... ఢాం... ఢాం...
పొట్టేలు పోయీ కోడీ వచ్చా ఢాం... ఢాం... ఢాం... కోడిపోయీ ఉల్లిగడ్డాచ్చా ఢాం... ఢాం... ఢాం... ఉల్లిగడ్డపోయీ చిటికా వచ్చా ఢాం... ఢాం... ఢాం...
అని పాడుకుంటా ఇంటికి పోయినాడు.
ఉత్తచేతులతో ఇంటికొచ్చిన కొడుకుని చూసి వాళ్ళమ్మ “వీనికి డబ్బిచ్చి పంపడం నాదే బుద్ధితక్కువ " అనుకోని మట్టసంగా నోరుమూసుకోనింది.

కామెంట్‌లు