ఎవరి గొప్ప వారిదే;-డా. నీరజ అమరవాది ;-హైదరాబాద్ --సెల్ 9849160055


 గుణ , మిత్ర స్నేహితులు . గుణ చిత్రలేఖనంలో ప్రవీణుడు . వాళ్ల తాతయ్య కూడా మంచి చిత్రకారుడు . చూసి నేర్చుకున్నాడో , లేక తాతయ్య నేర్పాడో కాని  గుణ ఏ బొమ్మను చూసినా వెంటనే అచ్చు గుద్దినట్లు గీసేస్తాడు . ప్రకృతి చిత్రాలైతే నిజమా అన్న భ్రమలో పడిపోతాము . అలాగే మిత్ర మంచి క్రీడాకారుడు . ఎప్పుడూ  ఉత్సాహంగా  కనిపిస్తాడు . ఏ ఆట ఆడినా బహుమతి తీసుకోకుండా రాడు . వారు చదివేది ఏడవ తరగతి అయినా , వచ్చిన బహుమతులకు లెక్కే లేదు . 

    ఒక రోజు గుణ , మిత్ర వారికి వచ్చిన బహుమతులను ఒకరికొకరు చూపించుకుంటూ , దిగులుగా కూర్చున్నారు . రోజూ అలవాటుగా కూరలు ఇచ్చే  రంగయ్య , వాళ్ల ఇంట్లో కూరలు ఇచ్చి వస్తూ వీళ్లని చూశాడు .  ” ఏంటి బాబులూ ! బహుమతులు  చూపించి , మిఠాయిలు పెడతారను కుంటే , విచారంగా కూర్చున్నారేమిటని “ ప్రశ్నించాడు .  అప్పుడు మిత్ర  “నేను బాగా ఆటలు ఆడుతాను , కాని గుణ లాగ బొమ్మలు వేయలేను . గుణకి నాలాగా ఆటలాడడం రాదు , కాని అందంగా చిత్రాలని గీస్తాడు . ఇప్పుడు నాకేమో , వాడిలాగ బొమ్మలు గీయాలని , వాడికేమో నాలాగా ఆటలు ఆడాలని ఉంది . ఎలాగా అని ఆలోచిస్తున్నామని” చెప్పాడు .

     రంగయ్య వారిని తన కూరల బండి దగ్గరికి తీసుకెళ్లాడు . అక్కడున్న కూరల పేర్లు చెప్పమన్నాడు.  గుణ ఒక పక్కన ఉన్న “క్యారట్ , బీట్ రూట్ , ముల్లంగి , చిలగడ దుంపల పేర్లు” చెప్పాడు. మిత్ర మరో పక్క ఉన్న “వంకాయ , టమాట , బెండ , ఆకుకూరల” పేర్లు చెప్పాడు . 

       అప్పుడు ‘రంగయ్య’ నిజంగా జరిగిన సంఘటనని చెబుతాను, వినండి అంటూ, ఇలా చెప్పాడు . నేను , నాకున్న కొద్దిపాటి భూమిలో కూరలను పండించి అమ్ముతాను . అదే నా జీవనాధారం. ఒకసారి పెద్దగాలి , దానితోపాటు వడగళ్లు , వర్షం పడ్డాయి . అప్పుడు కోతకి వచ్చిన “బెండ , వంగ , టమాటా , ఆకుకూరలు” అన్నీ నీటిలో కొట్టుకుపోయాయి . వాటిని చూసి నేను చాలా బాధపడ్డాను . కాని మరోపక్క “కారట్ , ఆలు , బీట్ రూట్ , ముల్లంగి మొక్కలు” కనిపించాయి . వాటిని తవ్వి చూస్తే , కాయలు అన్నీ అలాగే అన్నాయి . అవి భూమి లోపల పెరుగుతాయి , కనుక వాననీరు వాటిని ఏమీ చేయలేకపోయింది . అప్పుడు నేను ఆ దుంపలను అమ్మి నా అవసరాలకు ధనాన్ని సంపాదించుకోగలిగాను . అలాగే మీలో ఒకరు బాగా ఆటలు ఆడుతారు . మరొకరు బొమ్మలు బాగా వేస్తారు . ఎవరి గొప్పవారిదే . మనకు ఉన్న నైపుణ్యంతో విజయం సాధించాలి . పేరు తెచ్చుకోవాలని చెప్పాడు . ఆ మాటలకి మిత్ర , గుణ తో పాటు వారి తల్లిదండ్రులు కూడా పిల్లల సమస్య కు తగిన విధంగా పరిష్కారం దొరికిందని ఆనందించారు .

                  ***************


కామెంట్‌లు