మౌనం మహోజ్జ్వల ప్రాణ దీపం:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు9849305871.

చలనం కోల్పోయిన హృదయాలు
మోసే దేహాలన్నీ శవాల 
చితల్ చితలైన శరీర ఖండికల నిద్ర
స్వప్న తెరపై మారణ మహాచిద్రాలు

సంధించబడని శస్త్రాలన్నీ 
మోడుబారిన అస్త్రాలే
 యుధ్ధంలో కదిలే కళేబరాలు

అలిసిన ఊపిరితిత్తుల ఊపిరి
శత్రు దాడిని మార్కొను బరిలో
 ధైర్యం విసిరే ఆయుధం

నిన్ను విడువని పోరులో 
నాతో తలపడని  కాలం నీది
అమేయ శక్తి నా ధ్వజం రెప‌రెపలే

రాలిపడే పచ్చని ఆకులు ఎన్నెన్నో
సమర భూమిలో దూసే బాకులకు
రుధిరం పారే అద్భుత ఆకాశంలో

మౌనం తన దారిలో తను శబ్దించింది
పూరించిన శంఖారావంలా 
మౌనం మహోజ్జ్వల ప్రాణ దీపం

అక్షరాలు రాసిన పేజీలలోని శాంతి గీతాన్ని
తెల్లని పారావతాలు పాడుతున్నవి
నల్లని మబ్బుల ఆవల వెన్నెల కురిసే
విశ్వాసం వేకువలో మౌన చలనం
ఓ జీవన వైవిధ్యం

కామెంట్‌లు