నా బాల్యం - పుస్తకాలు -మణినాథ్ కోపల్లె

 బాల్య స్మృతులలో అందరి అనుభవాలు చదువుతుంటే నాకూ ఏదో కొద్దిగా రాయాలనిపించింది.   నేనూ నా చిన్నప్పటి అనుభవాలు పంచుకుంటున్నాను. మాకు అయిదేళ్లు వచ్చాకే ఒకటో క్లాసు లో బళ్ళోకి  వెళ్ళేవాళ్ళం. కాన్వెంట్ లో ఒకటో క్లాసులో మా అన్నయ్య చేర్పించాడు. వయసు కొద్దినెలలు  ఎక్కువ వేసి. ఒకటో తరగతి తెలుగు పుస్తకం నాకు ఎంతో నచ్చింది. ఇప్పటికీ ఆ పుస్తకంలోని అక్షరాలు గుర్తే! చాలా పెద్దవిగా వుండేవి. బొమ్మలు, అచ్చులు హల్లులు తరువాత గుణింతాలు .. వుండేవి. నేను చదివిన తెలుగు పుస్తకంలో “ఎవరు గొప్ప?” పాఠం  బాగా గుర్తే! శరీరంలో ని  కాలు, చేయి, చెవులు  కళ్ళు, ఇలా అన్నీ భాగాలూ నేను గొప్ప అంటే నేను  గొప్ప అని పోట్లాడుకుంటుంటూ, బద్ధకంతో  ఏ భాగం పని చెయ్యవు.  కానీ ఏ భాగం పని  చేయక పోయినా శరీరం అసలు చేయదు.  అందరూ కలిసి  శరీరంలోని  అన్నీ భాగాలూ పని చేసి ఆరోగ్యంగా వుండగలడు  మనిషి అని “ఐకమత్యం” గురించి చెప్పే కథ ఇన్నేళ్లయినా మర్చిపోలేదు. ఆనాటి నీతి కథలు పాఠ్యాంశాలుగా వుండేవి.  (ఇప్పటికీ).. ఇక   కాపీ రైటింగ్ పుస్తకం లాగా గుణింతాలు, నీతి వాక్యాలూ వుండేవి.    ఒక పేజీ అంతా కాపీ రాసే హోమ్ వర్క్ ఇచ్చేవారు. అందరం ఆడుతూ పాడుతూ చదివే వాళ్ళం. ఎంతో బాగుండెవి ఆ రోజులు. క్లాస్ లో 50 మందిమి  వుండేవాళ్ళం. 
ఆరవ క్లాసు నుంచి సెక్షన్ లు గా డివైడ్ చేసి ఎ &  బి సెక్షన్ లు చేసేవారు. మాకు ఇంగ్లీష్ 6 th  క్లాసు నుంచి వుండేది. నేర్చుకున్నాను. హిందీ ఏడో క్లాస్ అనుకుంటాను. ఎనిమిదో  క్లాసు లో మాథ్స్ ఆల్జీబ్రానా లేక అర్థమెటిక్ డిసైడ్ చేయాలి. నేను ఆల్జీబ్రా మాథ్స్ నే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగుండేవి లెక్కలు చేయటం. నాకు ఇష్టం అయిన సబ్జెక్ట్ కూడా.  
ఇక పుస్తకాలు చదివే అలవాటు చిన్నప్పుడే వచ్చింది. ఇంట్లో అందరూ పేపర్ లు, ఆంధ్ర పత్రిక , నవలలు పుస్తకాలు చదివేవారు. మొదట్లో వార పత్రికల్లో బొమ్మలు చూసినా పెద్ద పెద్ద మాటర్ వున్న కథలు ఆర్టికల్స్ చదవాలంటే బోర్ కొట్టేది. అందుకే మొదలు, చివర చదివేదాన్ని. ఇష్టంగా చదివేది చందమామ. ఆ తరువాత బాలమిత్ర, చదివేవాళ్ళం. అందులో పజిల్స్, ఫోటోకి వ్యాఖ్య లాంటివి, ఒక పేజీ కథలు చదివాక బేతాళ కథలు, పురాణ కథల సీరియల్స్ చదివే దాన్ని. ఆ పుస్తకాలలో కథలు చదివి,  చదివి నేనూ రాయాలి అనిపించి రాజుగారి ముగ్గురు భార్యలు వంటి  జానపదం కథ రాసి బాలమిత్రకి పంపాను. రిటర్న్ పోస్టల్ కవర్ స్టాంప్ లతో సహా పెట్టి బోల్డు కాగితాలు రాసి పోస్ట్ చేశాను. అప్పుడు ఏడవ  తరగతిలో వున్నా.. ఆ తరువాత నెల నుంచి బాల మిత్ర కొని నా కథ పడిందేమో అని ఓ ఆరు నెలలు  చూస్తూ వుండేదాన్ని.  ఇక ఆ తరువాత ఎదురు చూడలేదు. కథ తిరిగి రాలేదు.  తరువాత తరువాత్తెలిసింది ఒక కథ ఎంపిక చేయాలంటే చాలా రోజులు పడుతుందని .. బాగా కథలు రాసే రచయితలు రాయాలని,  అనుభవం వుండాలని తెలిసింది. దానికి నా వయసు సరిపోదని .. చివరికి  నా కథ ఏమయిందో తెలీదు. యువలోని సీరియల్స్, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర  పత్రికలలోని సీరియల్స్ బాగా చదివేవాళ్ళం. కోడూరి కౌసల్యా దేవి, యద్దన పూడి సులోచనారాణి, వంటి రచయిత్రుల తో పాటు, మిగతా రచయితల కథలు.. ఆకట్టుకునేవి.  ప్రభలో వచ్చే మాలతీ చందూర్ గారి ‘ప్రమదావనం’ వదలకుండా ముందు చదివే దాన్ని ..
  అన్నీ వార మాస పత్రికల  పుస్తకాలు, నవలలు  అద్దెకు దొరికేవి. .   ఏ పుస్తకం అయినా పది పైసలు అద్దె. ఆ పుస్తకాల రచయితల కన్నా పాత్రలు ఇప్పటికీ గుర్తే!  లత, రాజశేఖర్ ల యద్ధనపూడి వారి కథా నాయికా నాయకులు,   విమలా రామం స్వీట్ హోమ్, బీనాదేవి కథలు, ముప్పాళ వారి కూలిన గోడలు రచనల్లోని  పాత్రలు ఇప్పటికీ గుర్తే! ఆ రోజుల్లో రచయితలు ఇంటి పేర్లతోనే బాగా పాపులర్ అయ్యారు. కోడూరి,( అరికెపూడి), ముప్పాళ, యద్దనపూడి ఇలా ఎందరో రచయితల ఇంటి పేర్లతోనే వారి రచనల గురించి చర్చించు కునే వాళ్ళము.  అలాగే ఆనాటి తెలుగు గ్రంధ రచనలు చేసిన  సంఘసంస్కర్తలు ఇంటి పేరు చెప్పగానే తెలుగు వారందరికీ సుపరిచితులు.. వారే  గురజాడ, గిడుగు, దేవులపల్లి, కందుకూరి, చిలకమర్తి, ఇలా ఎందరో మహానుభావులు. 
ఆ తరువాత పబ్లిక్ పరీక్షలు, చదువు ... డిగ్రీ ల చదువుల వేటలో పుస్తక పఠనం కాస్త తగ్గింది.  ఆ తరువాత  చిన్ననాటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు మాత్రం ఇప్పటికీ మానలేదు. ఆ అలవాటు వాళ్ళ హైదరాబాదు లోని నగర 
గ్రంధాలయం లో నాలుగు ఐదు గంటలు చదవటం, 4 పుస్తకాలకి మెంబర్  షిప్ కట్టి ఇంటికి  4 నవలలు తెచ్చి, పదిహేను రోజుల తరువాత రిటర్న్ చేసేదాన్ని. అలాగే ఎం. ఏ. చదివే రోజుల్లో NSC certificates  లైబ్రరీ వాళ్ళ  దగ్గర పెట్టి చాలా ఖరీదైన పుస్తకాలు అంటే ఒక్కొక్కటి 400/- ఆ పైన వరకూ వున్న పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని చదువుకునే దాన్ని. చిన్ననాటి  కోరిక నా రచనలు అచ్చులో చూసుకోవాలనే కోరిక ఆ తరువాతి కాలంలో తీరింది. 
చిన్ననాటి సంగతులు తల్చుకోవటం ఆనందం.  ఎన్నో జ్ఞాపకాలలో  పుస్తకాలు చదివే అలవాటు గురించిన జ్ఞాపకాలు కొన్ని పంచుకున్నాను. 
“పుస్తకం హస్త భూషణం!”   
“పుస్తక జ్ఞానం  తరగని నిథే!” 
  --మణినాథ్ కోపల్లె--9703044410 maninathkopalle@gmail.com
  

కామెంట్‌లు