నిదానం ప్రదానం;- సత్యవాణి
 అనగనగా ఊరినందు
అనంతయ్య ఒకడు కలడు
మంచి దైన భార్య కలిగి
మనుగడ సాగించు చుండె
అన్యోన్యపు దంపతులని
అందరు కొనయాడు చుండె
వారికి ఒకటే చింత
వారసుడు లేడటంచు
ముంగిసను ఒకటి తెచ్చి
ముద్దు గాను పెంచ సాగె
కొన్ని నాళ్ళ తరువాత
కొడుకొక్కడు కలిగినాడు
ముద్దులొలుకు కొడుకుని
మురిపముతో సాక సాగె
ముంగిస ఆబిడ్డ తోడ
ముదముతోడ ఆడు చుండె
ఇద్దరు బిడ్డలు మాకని
అందరి తోడ అను చుండిరి
ఒకనాడా బాపనమ్మ
ఒంటి బిందె చంక నెట్టి
నీలాటి రేవు కడకు
నీళ్ళ కొరకు సాగి పోయె
బిందె నిండ నీళ్ళ తోడ
వేవేగముగరుతెంచెను
ముంగిటనే ఎదురాయెను
ముంగిస నోట రక్త మోడుచును
అమ్మమ్మో ఈ ముంగిస
అంతరించె నాబిడ్దను
అని గుండెలు బాదుకొనుచు
అంతము చేసెను దానిని
లోనికెళ్ళి చూసెనామెఆమె 
లోకాన్నే మరచి బిడ్డ
హాయిగ నిదురించు చుండె
ఊయల ముంగట ఒక ఫణి
ముక్క ముక్కలై వుండె
అయ్యయ్యో నాముంగిస
అన్యాయం అయి పోయె
ముందు వెనుక కానకుండ
ముంగిసనంతంచేసితి
కొడుకు వలె పెంచి నేనె
కాటికప్పజెప్పినాను
అని ఆ బాపనమ్మ
అధికముగా రోదించెను
రక్షించెను నా బిడ్డను
రక్కసి పాము బారి నుండి
కృతజ్ఞత ఇంత లేక 
కూల వేసితినయ్యో నేను
మంచి చెడ్డ కాన లేని
మందమతిని ఐతి నేను
అనుచు వగచె ఆ బ్రాహ్మణి
అధిక మైన శోకంతో
చేత కుండ చే జార్చి
చింతించిన ఏమి ఫలం
నిదానమే ప్రధానమను
నీతి మాట నమ్ము బాల
                    

కామెంట్‌లు