పి.యు. చిన్నప్ప ముచ్చట్లు;-- యామిజాల జగదీశ్
 పుదుక్కోట్టయ్ ఉలగనాథపిళ్ళై చిన్నప్ప లేదా పి.యు. చిన్నప్ప తమిళ నటుడు. గాయకుడు. నిర్మాత. ఇలా పలు విభాగాలలో ప్రసిద్ధి పొందిన వ్యక్తి. 1916 మే అయిదున పుట్టిన చిన్నప్పా 1951 సెప్టెంబర్ 23న మరణించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు చిన్నసామి. ఆయనను నడిగర్ మన్నర్ (అంటే నట చక్రవర్తి) అని పిలిచేవారు. ఆయన తల్లి మీనాక్షి అమ్మాళ్. తండ్రి ఉలగనాథ పిళ్ళై.
ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు. ఈయన తండ్రి నాటకాలు వేసేవారు. ఆయనతో కలిసి చిన్నతనం నుంచే పాడటం అలవరచుకున్న చిన్నప్ప పుదుక్కోట్టయ్ లోని నొండి వాద్యార్ స్కూల్లో నాలుగైదేళ్ళు చదువుకున్నారు. ముందే చెప్పుకున్నట్టు చిన్నవయస్సునుంచే పాడటం మీద అసక్తి ఉన్న చిన్నప్ప తండ్రి నాటకాలలో పాడే పాటలను అడిగి అడిగి తానూ పాడుతుండేవారు. ఆలయాలలో ఏదైనా ఉత్సవం జరిగితే ఈయనను పిలిచి పాడించేవారు. దీంతో ఈయనకు పాటలమీదున్న శ్రద్ధ చదువుమీద లేకుండా పోయింది. స్కూలు మానేసి కర్రసాము, మల్లు యుద్ధం, కుస్తీ వంటివాటిని నేర్చుకున్నారు. 
కుటుంబ పరిస్థితులు బాగులేక ఈయన ఒక నూలు పరిశ్రమలో చేరారు. కొద్ది కాలానికే ఆ పని నచ్చక నాటక సంస్థలో చేరేందుకు ప్రయత్నించారు. అనుకున్నట్టే టి.టి. శంకరదాస్ స్వామి వారి తత్త్వ మీనలోచని విద్వబాల సభ అనే నాటక సంస్థలో చేరి నాటకాలలో నటించడం మొదలుపెట్టారు..
చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చిన చిన్నప్పను పాడే తీరును విన్న నారాయణన్ చెట్టియార్ సిఫారసుతో మదురైలోనిళనాటక సంస్థలో పదిహేనురూపాయల నెల జీతానికి చేరారు. ఈ సంస్థ తరఫున వేసిన పాత్రలలో ఆయనకు మంచి ఆదరణ లభించింది. తన పందొమ్మది ఏట నాటక సంస్థ నుంచి తప్పుకుని నానయ్య భాగవతార్. పుదుక్కోట్టయ్ చిదంబర భాగవతార్ తదితరుల దగ్గర సంగీత శిక్షణ పొందారు. అనంతరం ఎస్. ఆర్. జానకి వారి నాటక సంస్థలో చేరి శ్రీలంకకు వెళ్ళి అక్కడ అనేక ప్రాంతాలలో నాటకాలు వేశారు. 
1939లో ఆర్యమాలా అనే సినిమాను కె.ఎస్. నారాయణ అయ్యంగార్, ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు కలిసి నిర్మించారు.
ఈ సినిమాలో చిన్నప్పా కాత్తవరాయన్ పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ కోవై పక్షిరాజా స్టూడియోలో జరిగింది.
కోయంబత్తూరులో కందన్ స్టూడియో అని ఒకటుండేది. ఈ స్టూడియోను శ్రీరాములు నాయుడు కొనుగోలు చేసి పక్షిరాజా అని పేరు మార్చారు. వీరి సినిమాలో తనతో కలిసి నటించిన ఎ. శకుంతలను ప్రేమించిన చిన్నప్ప పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అయితే వీరి పెళ్ళికి శకుంతల తల్లి సమ్మతించలేదు. అయినప్పటికీ వీరి ప్రేమ కొనసాగుతూ వచ్చింది. 
1942లో మనోన్మణి అనే సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాలో నటించే శకుంతల షూటింగుకి ఆలస్యంగా వస్తుండటాన్ని, ఆమెలో ఓ రకమైన భయాన్ని గమనించిన దర్శకుడు టి.ఆర్. సుందరం చిన్నప్ప ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకుని పెళ్ళి చేసేసుకోమని సూచించారు. కానీ శకుంతల తల్లి ఒప్పుకోలేదు. ఇక ఎంత కాలం నిరీక్షించాలనుకున్న ఈ ప్రేమజంట 1943లో సేలంలో రిజిష్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారు.
పెళ్ళయీన తర్వాత శకుంతల టైముకి వచ్చి షూటింగులో పాల్గోనడంతో దర్శకుడి సమస్య తీరింది. ఆ సినిమా ఘనవిజయం సాధించింది కూడా. చిన్నప్ప సినిమాలతో బోజీ అయిపోయారు. ఆయన నటించిన ఆరు సినిమాలను తర్వాతి కాలంలో తమిళంలో పునర్నిర్మించారు. చిన్నప్ప నటించిన  ఉత్తమపుత్తిరన్ (1940), ఆర్యమాల (1941), కన్నగి (1942), పృధ్వీరాజన్(1942), జగదల ప్రతాపన్ (1944), హరిశ్చంద్ర (1944) లను పునర్నిర్మించారు. వాటిలో ఒకటి రెండు పేర్లు మార్చి తీశారు. శివాజీ, ఎంజిఆర్ కథానాయకులుగా నటించారు. జగదల ప్రతాపన్ సినిమా 1963లో మళ్ళీ తీసినప్పుడు ఎన్టీ రామారావు హీరోగా నటించారు.
అయితే కొన్ని కారణాలతో చిన్నప్ప ఊబకాయంతో పూర్వంలా నటించలేకపోయారు. పాట్టిగా లావుగా ఉండటంతో సినిమా అవకాశాలు తగ్గాయి. ఇరవై ఆరు సినిమాలకన్నా నటించలేకపోయారు. ఆయన నటించిన చివరి సినిమా సుదర్శన్ ఆయన మరణానంతరమే విడుదలైంది. ఆయన సినీజీవితం 1936లో మొదలై 1951 వరకూ సాగింది. 
ఆయన నటించిన సినిమాలలో ఆర్యమాల, కన్నగి, మనోన్మణి, జగదల ప్రతాపన్, కృష్ణభక్తి, రత్నకుమార్, వికటయోగి వందరోజులు ఆడి భారీ వసూళ్ళతో రికార్డు పుటలకెక్కింది.
ఓ నటుడు రెండు పాత్రలలో నటించిన చిత్రం ఉత్తమపుత్తిరన్. తమిళ సినీ ప్రపంచంలో ద్విపాత్రాభినయం అనేది ఈయనతోనే మొదలైంది. అలాగే మూడు పాత్రలలో నటించిన తొలి నటుడుకూడా ఈయనే. ఆ సినిమా పేరు మంగయర్ కరసి.
1965లో విడుదలైన తిరువిలయాడల్ సినిమాలో పాట్టుం నానే అనే పాటపై చిత్రీకరించిన సన్నివేశంలో శివాజీకి మార్గదర్శి చిన్నప్పనే. జగదల ప్రతాపన్ అనే సినిమాలో ఒకే పాటలో చిన్నప్ప అయిదు పాత్రలలో కనిపించారు.
1964లో వచ్చిన నవరాత్రి సినిమాలో శివాజీ తొమ్మిది వేషాలలో నటించగా ఇటీవలి కాలంలో దశావతారం చిత్రంలో కమలహాసన్ పది పాత్రలలో నటించారు. అయితే కమలహాసన్ కన్నా ముందరే ఆర్యమాల (1941) అనే సినిమాలో చిన్నప్ప పది పాత్రలు పోషించారు. అంటే తమిళ సినిమాలో ఓ నటుడు పది పాత్రలలో నటించిన తొలి ఘనత చిన్నప్పకే దక్కినట్లయింది. 
ఇదిలా ఉండగా, ఆయన నటించి విడుదల కాని చిత్రం ఒకటుంది. అది కట్టబొమ్ము (1948).
చిన్నప్పను జన్మతః నటుడు అని అభిర్ణిస్తుండేవారు టి.ఆర్ రాజకుమారి అనే నాటి నటి.
జ్యూపిటర్స్ పిక్చర్స్ వారు 1942లో కన్నగి 
శీర్షికతో ఓ సినిమా తీశారు. కన్నగి పాత్రలో కన్నాంబ నటించగా చిన్నప్ప కోవలన్ పాత్రలో కథనాయకుడిగా నటించారు. ఆయనకు ఈ సినిమాలో పది వేల రూపాయలు ఇచ్చారు. అయితే కన్నాంబకు ఇచ్చిన డబ్బు ఇరవై వేలు. ఆమౄ కన్నా తనకు తక్కువ డబ్బే ఇచ్చినప్పటికీ చిన్నప్ప నటించడానికి కారణం జ్యూపిటర్ పిక్చర్స్ పై ఆయనకున్న మర్యాదాభిమానాలే. అంతేకాదు, ఆయనకు చందిరకాంత అనే  సినిమాలో తొలిసారిగా అవకాశం ఇచ్చింది ఈ సంస్థనే. 
చిన్నప్పకు సుబ్రహ్మణ్య భారతియార్ పాటలంటే చాలా ఇష్టం. తమిళ సినిమాలో మొట్టమొదటిసారిగా భారతియార్ పాటను పాడింది ఈయనే. ఆయన ఉత్తమపుత్తిరన్ సినిమాలో సెందమిళ్ నాడేనుం బోధినిలే అనే పాటను పాడగా అది సూపర్ హిట్టయింది.
అయితే ఈ పాటను అప్పటి ఆంగ్లేయులు 1940లో  నిషేధం విధించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఆ పాటను తిరిగీ సినిమాలో ప్రదర్శించారు. 
భారతియార్ జన్మించిన ఎట్టయాపురంలో భారతియార్ స్మృత్యర్థం నిర్మించిన మండపానికి చిన్నప్ప తన వంతుగా వెయ్యి రూపాయల విరాళం ఇచ్చారు.
తమిళ సినీ జగత్తులో పి.యు. చిన్నప్ప స్థానం ఎప్పటికీ ఓ ప్రత్యేకమే.
కామెంట్‌లు