మూగజీవాలు (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
   తన యజమాని రంగయ్య పట్ల ఎంతో విశ్వాసాన్ని చూపిస్తుంది కుక్క. రంగయ్య ఆ కుక్క పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాడు. ప్రతిరోజూ కుక్కకు మంచి ఆహారం ఇవ్వడం, బయట తిప్పుకొని రావడం, దానితో రోజూ కాసేపు ముచ్చట్లు చెప్పడం చేసేవాడు. ఇటీవల రంగయ్య ఒక మేకను కొన్నాడు. దానిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. బయటికి తీసుకెళ్ళి మేత చేయించుకొని తీసుకొస్తున్నాడు. అయితే మేక వచ్చిన తర్వాత తనపై శ్రద్ధ తగ్గిందనీ, ఎంతసేపూ మేకకు కావాల్సినవి సమకూర్చడమే యజమాని పని అని కుక్క కోపం తెచ్చుకుంది. మేకపై ఈర్ష్యను పెంచుకుంది. తొందరగా ఈ మేక పీడా విరగడైతే బాగుండు అని కోరుకుంది. 
       ఒకరోజు హఠాత్తుగా మేకను రంగయ్య కోయించడం కుక్కను ఎంతో బాధపెట్టింది. ఇన్నాళ్ళూ తనతో పాటు నివాసం ఉన్న మేక ఒక్కసారిగా తన కళ్ళ ముందే చంపబడటం సహించలేక పోయింది. ఇన్నాళ్ళూ దీన్ని అపురూపంగా పెంచుకుంది తమ స్వార్థం కోసమా? అనవసరంగా మేకపై ఈర్ష్యను పెంచుకున్నాను. మూగ జీవాల పట్ల దయ, జాలి, విశ్వాసం లేని ఇలాంటి మనుష్యుల మధ్య ఉండటం తన వల్ల కాదని కుక్క ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది.

కామెంట్‌లు