స్వాభిమానం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మరాఠా సర్దార్ పింగలే మేవాడ్ పై దండెత్తి వస్తున్నాడన్న సమాచారం మహారాణీకి తెలిసింది. ఇంతకు ముందు అనవసరంగా యుద్ధం ఎందుకు అని రెండు సార్లు బాగా డబ్బు  బంగారం అంతా ఇచ్చి సంధిచేసుకున్నాడు.ఇప్పుడు మేవాడ్ ధనాగారం ఖాళీ ఐంది. మూడోసారి పింగళే తనపై దాడి చేయటం రాణాకి కష్టం అనిపించింది.తన ప్రధాని అమరచంద్ తో మంతనాలు సాగించాడు. "ప్రభూ!మేవాడ్ సైనికుల బలపరాక్రమాలనుగూర్చి మీకు ఎలాంటి సందేహం వద్దు.కానీ వారికి  ఇంత వరకూ జీతభత్యాలు ముట్టడంలేదు.కొత్త యుద్ధసామగ్రి కూడా  వారి వద్ద లేదు. మరి జీతభత్యాలు లేకుండా వారెలా బ్రతుకుతారు ప్రభూ!"అని ప్రశ్నించాడు. "నీవు చెప్పింది నిజమే కానీ  మాటిమాటికీ ఈ మరాఠాలు మనపై దాడి చేయటం తో నాకేంచేయాలో పాలుపోటంలేదు.నీవే ఏదైనా  ఉపాయం ఆలోచించు"   "ప్రభూ!నేను ఎలాంటి ఆదేశం ఇచ్చినా మీరు కిమ్మనకుండా ఊరుకోవాలి." సరేనన్నాడు రాణా.
అంతే!రాణా అభయహస్తం అందించటంతో అమరచంద్ రాణుల నగలన్నీ తన భవంతిలోకి తెప్పించాడు.వాటిని కరిగించి నాణాలు గా చేసి సైనికులకు పంచాడు.తన జాగీర్ గ్రామాలని డబ్బున్న షావుకారులకు కుదువబెట్టి  ఆ డబ్బు తో  సైన్యంకి కావల్సిన  ఆయుధాలను తయారు చేయించాడు. మేవాడ్ యుద్ధం కి సర్వసిద్ధమైంది. మరాఠా సైన్యం ధీమాగా  మేవాడ్ పై యుద్ధభేరీ మోగించింది.తమని ఎదుర్కొనే శక్తి  రాజపుత్రులకు లేదనే ధీమా వారిలో ఏర్పడింది. కానీ అమరచంద్ బుద్ధిచాతుర్యంతో మరాఠాలు మూడోరోజు కల్లా తోకముడిచి పారిపోయారు.రాణా  అమరచంద్ కి ఎన్నో గ్రామాలు బహూకరించాడు. ఇంకేముంది? మేవాడ్ లో చాలా మంది కి  అతనంటే ఈర్ష్య ఏర్పడింది. రాణులకుకూడా  అతనంటే కోపంగా ఉంది. తమ వంటి మీది నగలు ఊడలాక్కున్నాడని బుసలు కొట్టసాగారు.ఈకుట్రదారులంతా కలిసి  రాణాకి అత్యంత నమ్మకం ఇష్టురాలైన దాసీ  రామ్ ప్యారీని కల్సి  చెవిలో విషం నూరిపోశారు. అమరచంద్ హవేలీ నిండా  ధనపురాసులు నగానట్రా బంగారం మూలుగుతోందని వారి అపోహ!మొదట్లో మహారాణా వీరి మాటలు పట్టించుకోలేదు. కానీ లోకులు కాకులు.పుకార్లు షికార్లు కొడుతాయి.చెడు త్వరగా మనసుకి హత్తుకుంటుంది.అమరచంద్ హవేలీని తనిఖీ చేయమని అధికారులను ఆదేశించాడు.
ఈవిషయం తెలియగానే  అమరచంద్ కొన్ని బుట్టలలో తన దగ్గర ఉన్న వన్నీ పెట్టించి  వాటితోపాటు ఒక లేఖను పంపాడు."ప్రభూ! నాదగ్గర ఉన్న వన్నీ  మీకు పంపుతున్నా. మీరు స్వయంగా వచ్చి హవేలీ ని తనిఖీ చేయవచ్చు. రాజభక్తి దేశభక్తి తో నేను చేసిన దంతా మీఅనుమానం చెప్పుడుమాటలు విన్న మీదోషం వల్ల  చెల్లాచెదురైనది.జనంలో ఒక భయం ఆందోళన పేరుకుపోయింది.అదేమిటి అంటే నిజం గా దేశం కోసం  మహారాణా కోసం నిష్పక్షపాతంగా విశ్వాసంగా  ఏంచేసినా  చివరికి దక్కేది అవమానం  అనుమానం!అందుకే  స్వార్థం కపటం మాయోపాయాలతో మిమ్మల్ని బురిడీకొట్టించేవారే మీచుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఒక దాసీ మాటలు మీపై ప్రభావం చూపాయి.సెలవు".  అంతే ఆలేఖ చదువుకుని రాణా కళ్ళు విచ్చుకున్నాయి.గబగబా అమరచంద్ హవేలీకి చేరాడు. కానీ అప్పటికే అతను ప్రాణాలు  వదిలాడు. అతని ఇంట్లో ఎండుపుల్ల గానీ ఎర్రని ఏగానీ కానీ లేవు.అంత దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తూ  అతను తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిని అనవసరంగా అనుమానించి నందుకు రాణా పశ్చాత్తాపం తో కుమిలి పోయాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం ఏంటి!?
మన దేశస్వాతంత్రంకోసం కొన్ని వేలమంది త్యాగాలు చేశారు. సర్దార్ పటేల్  లాల్ బహదూర్ శాస్త్రి  టంగుటూరి ప్రకాశం పంతులు  చనిపోయినప్పుడు వారి కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో  ఆదైవానికే ఎరుక.నేను  ఒక చోట చదివాను. పటేల్ ఏకైక కుమార్తె మణిబెన్ వివాహం కూడా చేయకుండా ఆతండ్రి ఆమెను స్వాతంత్ర్య సమరంలో దింపాడు.ఆరోజులలో తల్లి లేని పిల్ల ని ఆయన ప్రేమతో దేశభక్తి తో పెంచాడు.పటేల్ మరణించాక మణిబెన్  ధనంలేక నానాఅగచాట్లతో పరాయి పంచన కన్నుమూశారు.ఇవన్నీ  చరిత్ర మరుగున పడిన సత్యాలు.అందుకే మనకు దేశం విలువతెలీక ఉగ్రవాదం వైపు పోతున్నాం. మనసైన్యం వారి కుటుంబాలత్యాగం మనం అనుక్షణం గుర్తు చేసుకోవాలి సుమా!
కామెంట్‌లు