భారతిదాసన్ ముచ్చట్లు;-- యామిజాల జగదీశ్
 భారతిదాసన్ (జననం : 1891 ఏప్రిల్ 29 - మరణం 1964 ఏప్రిల్ 21) తమిళ కవి. ఆయన భావాలకు కత్తికున్నంత పదునుండేది. భాషను తేనల్లే అందించారు. ప్రత్యర్థులను కవితలతో దెబ్బతీశారు. గాంభీర్యంతో కాలాలను దాటారు. మహాకవి సుబ్రమణ్య భారతియారుకి దాసుడనని తనను తాను ప్రకటించుకున్నారు. 1955లో పాండిచ్చేరి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కానీ నాలుగేళ్ళ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు.
భారతిదాసన్ అసలు పేరు సుబ్బురత్తినం. తండ్రి పేరు కనకసబై ముదలియార్, తల్లి పేరు లక్ష్మీ అమ్మాళ్. ఈయన కనక. సుబ్బురత్తినం పేరుతో కవితలు రాశారు. తమ గురువుపై ఉన్న అభిమానంతో తన పేరుని భారతిదాసన్ గా మార్చుకున్నారు.
ఆయన కవితలకు అభ్యుదయ కవి, పావేందర్ వంటివి ఓ చిహ్నం. బ్రిటీష్ ప్రభుత్వాన్ని, ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రచనలు చేశారు. పాండిచ్చేరి అప్పట్లో ఫ్రాన్స్ అధీనంలో ఉండేది. ఈయన రచనలపై ఆగ్రహించి ఫ్రాన్స్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకి పంపిన సందర్భాలున్నాయి. 
కవికాళమేఘం, రామానుజర్, బాలామణి, పక్కాతిరుడన్, అపూర్వ చింతామణి, సుభద్ర, సులోచన, పొన్ముడి, వళయాబది వంటి సినిమాలలో ఆయన పాత్రకూడా ఉంది. 
పుదువై కె.ఎస్.ఆర్, కండెయుదువేన్, కిరుక్కన్, కిండల్కారన్ వంటివి ఆయన కలంపేర్లు. 
వళయాబది అనే సినిమాకు ఈయన రాసిన మాటలలో కొన్నింటిని మార్చడంతో ఘాటుగా స్పందించి నలభై వేల రూపాయలూ అక్కర్లేదంటూ తిరిగిచ్చేసి అప్పటికే ఒప్పందం చేసుకున్న నాలుగు సినిమాలను మానుకోవడంతోపాటు మోడరన్ థియేటర్స్ నుంచి బయటకు వచ్చేసారు.
కోడి, పావురం, ఆవు అంటే ఇష్టం. కోడి పుంజుని ఓయ్ అని,  కోడిపెట్టని దామ్మా అని పిలిచేవారు. ఇల్లు అంటూ ఉంటే ఈ మూడూ ఉండాలనేవారు. ఆ మూడింటినీ ఇష్టంతో పెంచారు.
ఎవరు మాట్లాడినా ముక్కు మీద వేలేసుకుని వినేవారు. 
పొరపాటున సిరా చిందితే దానిని ఓ పువ్వు ఆకారంలో దిద్దేవారు.
చాప నేల మీద పరచి, తలగడమీద బోర్లా పడుకుని రాసేవారు.
నన్నెందుకు ప్రజలు కొనియాడుతున్నారంటే నేను దేనికీ భయపడక రాయడమే కారణమనేవారు. 
తమిళ సంస్కృతిని హేళన చేసేవారిపై ధ్వజమెత్తేవారు. మీరూ ధ్వజమెత్తండి అని ప్రజలను ఆదేశించారు.
మీ అందరికీ నేను మాటలను వినిపిస్తున్నాను. కానీ నాకు మాటలను ఇస్తున్నవారు భారతిదాసన్ అని కృపానందవారియార్ అంటుండేవారు. 
ఇదిగో నాయనా...టీ.నగర్ వస్తావా అని ఓ ఆటో అతనిని అడిగారు. టీ. నగరుకి రానని ఆటో అతను చెప్పగా "అయితే మరెందుకు ఇక్కడున్నావు" అని గోడవపడ్డారీయన. 
హోటల్లో వేడి వేడిగా దోసె ఉందా అని అడగ్గా ఉందంటూ హోటల్ సర్వర్ ఆరిపోయిన దోసె పట్టుకొచ్చి పెట్టాడు. "నీ నిఘంటువులో చల్లటి దోసను వేడి దోసంటారా?" అని మండిపడ్డారు. ఇలా ఆయన దేనికో దానికి నిత్యమూ గొడవపడుతుండేవారు.
పుట్టిందీ పెరిగిందీ బతికిందీ ఉన్నతస్థితికి చేరిందీ అంతానూ పాండిచ్చేరిలోనే. జీవితంలో చివరి రెండేళ్ళు మద్రాసులో నివసించారు. "మద్రాసు ఆయనను చంపేసింది" అనేవారు మిత్రులు.
పాండిచ్చేరిని ఓమారు తుపాను ముంచెత్తింది. అప్పుడు హోరుగాలి ఈయనను అయిదు కిలోమీటర్ల దూరానికి విసిరేసింది. ఆ సమయంలో ఓ రోజంతా వెతికి వెతికి ఎట్టాగో ఇంటికి చేరుకున్నారు.
ఈ ఉదంతాన్ని తెలుసుకున్న సూబ్రమణ్య భారతి "గాలి - కనకసుబ్బురత్తినం" అని ఓ వ్యాసం రాశారు. ఈ కథను అరవిందులవారు మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని వినేవారు.
ఓమారు అన్నాదురై తమిళనాడంతా తిరిగి ఇరవై అయిదు వేల రూపాయలు సేకరించి భారతిదాసన్ కు ఇచ్చారు. నేనిస్తే మీరు తీసుకోకూడదా ఆని అన్నాదురై చెప్పడంతో ...సరేనని స్వీకరించారు భారతిదాసన.
ఈయన తన పేరుని భారతిదాసన్ అని మార్చుకున్నప్పుడు ద్రావిడ కళగం వారు వ్యతిరేకించారు. 
"కుల వైషమ్యాలపై నిజంగా నిరసించిన వారు భారతి. ఆయనలాగా జనానికి తేలిక మాటలతో నా అభిప్రాయాలను చెప్పాలనుకున్నాను. కనుకే నా పేరు భారతిదాసన్ అని మార్చుకున్నాను. నన్నెవరు ఆక్షేపించినా విమర్శించినా నాకనవసరం" అని భారతిదాసన్ ప్రకటించారు.
 ఆష్ హత్య కేసులో సంబంధమున్న మాడసామి పాండిచ్చేరి వచ్చినప్పుడు ఆయనను పోలీసుల కంటికి కనిపించకుండా ఓ పడవ ఎక్కించి సముద్రం మధ్యవరకూ తీసుకుపోయి విదేశానికి తరలించిన సాహసవంతుడిగా ముద్రవేసుకున్నారు భారతిదాసన్.
ఎప్పుడూ పచ్చ రంగు శాలువనే కప్పుకునేవారు. లోపల ఓ కత్తి ఉంచుకునేవారు. రాత్రి ఎక్కడికి వెళ్ళినా మరచిపోకుండా కత్తి తీసుకుపోయేవారు.
పాండిచ్చేరి వేణు నాయకర్ దగ్గర సిలంబు నేర్చుకున్నారు. బాక్సింగూ నేర్చుకున్నారు. రెజ్లింగూ వచ్చు. అందుకే మాంసాహారాన్ని భుజించేవారు. దేహారోగ్యం ధారుడ్యం ఆన్నింటికీ మూలం అనేవారు.
"ఇదిగో సుబ్బురత్తినం! నాకోసం ఒక పాట రాయవా?" అని సుబ్రమణ్య భారతి ఆడగ్గా వెంటనే ఓ పిట రాసిచ్చారు. ఆ పాట - ఎంగెంగు కానినుం శక్తియడా..." ఎందెందు చూసినా శక్తేరా అని దీని అర్థం.
స్కూలు మాష్టారుగా 37 ఏళ్ళు పని చేశారు. ఈయనను ఒకే చోట ఉంచక పదిహేను సార్లు బదిలీ చేశారు. ఈయన స్కూల్ టీచర్ జీవితాన్ని కారైక్కాల్లో ప్రారంభించారు.
"రాజకీయాల జోలికి పోకుండా ఉంటే బదిలీ చేయరట. కానీ నేను రాజకీయాలకు ఎలా దూరంగా ఉండగలను?" అని అనేవారు భారతిదాసన్.
అ అంటే అనిల్ (ఉడుత అని అర్థం) ఆనే దాన్ని అమ్మ అని పాఠ్యపుస్తకంలో మార్పించింది ఈయనే.
 కిరాణా దుకాణాలకు వెళ్ళినప్పుడు వారు కట్టించిచ్చే పురికోసలను, దారాలను సేకరించే అలవాటుండేది ఈయనకు. నూలు విలువ సామాన్యమైనది కాదనేవారు.
పాటలను రాగయుక్తంగా ఆలపించేవారు. శృతి తప్పనిచ్చేవారు కాదు. తను రాసుకున్న పాటలన్నింటినీ పాడి వినిపించేవారు. 
"వీర సుదందిరం వేండి నిండ్రార్ ...." అనే పాటను రాసి భారతిదాసన్ పాడినప్పుడే సుబ్రమణ్య భారతి ఈయనను తొలిసారిగా గుర్తించారు.
భారతిదాసన్ భార్య పేరు పళనియమ్మాళ్. వీరికి సరస్వతి, వసంత, రమణి అని ముగ్గురు కుమార్తెలు, మన్నర్ మన్నన్ అనే కుమారుడు ఉన్నారు.
పాండ్యన్ పరిశు అనే చిత్ర నిర్మాణంకోసమే ఈయన మద్రాస్ వచ్చారు  శివాజీ, సరోజా దేవి, ఎం.ఆర్. రాధాలను ఒప్పించి ఈ సినిమాలో నటించడానికి సంతకాలుకూడా చేయించుకున్నారు. కానీ షూటింగే ప్రారంభం కాలేదు. 
భారతియార్ జీవితాన్ని సినిమాగా తీయాలనుకున్నప్పుడు కథ, మాటలు సిద్ధం చేశారు. కానీ ఈ సినిమాకూడా ప్రారంభం కాలేదు.
ఒక్క సినిమా అన్నా తీయాలనుకున్న ఆయన ఆశలు కడదాకా నెరవేరలేదు.
 "తమిళ రచయితకు రెండు అర్హతలు ఉండాలి. మొదటిది - తమిళం సరిగ్గా చదోవి భాష మీద పట్టు సంపాదించాలి. రెండు - అనుకున్న భావాన్ని నిర్భయంగా చెప్పాలి" అని చెప్తుండేవారు.
 లక్ష రూపాయల పారితోషికమైన భారతి జ్ఞాన పీఠ బిరుదుతో ఈయనను సన్మానించాలనుకున్నారు. కానీ అది జరిగేలోపే భారతిదాసన్ మరణించారు. ఆ అవార్డు బతికున్న వారికే ఇవ్వాలనే నిర్ణయం వల్ల ఈయనకు ఆ అవార్డు దక్కలేదు.
"జీవితం అనేది పరిశోధన కాదు. ప్రజలకోసం శ్రమించడమే జీవితం. మంచికోసమూ సత్యానికి కట్టుబడి రాసే సాహిత్యం ఎల్లకాలమూ సజీవమై ఉంటుంది. అదే నేను చేసిందల్లా" అని చెప్పుకున్న ఆయన భౌతికకాయానికి  పాండిచ్చేరిలో అంత్యక్రియలు చేసినప్పుడు జనం భారీ సంఖ్యలో తరలిరావడమే ఆయన సాహిత్యసేవకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
కామెంట్‌లు