మద్రాస్ రఘుపతి - యామిజాల జగదీశ్ చెన్నైలో అణ్ణాశాలై నుంచి పుదుప్పేట్టైకి వెళ్ళే దారిలో ఉండేది గెయిటీ అనే సినిమా థియేటర్.  ఆ కాలంలో మద్రాసులో ప్రేక్షకులకు ఇదొక ప్ధానమైన థియేటర్. భారత దేశంలో సినిమా ప్రవేశించిన కాలంలోనే దానిని మద్రాసుకు పరిచయం చేసిన వాటిలో గెయిటీ థియేటరుకి ఓ ప్రాముఖ్యముంది. గెయిటీ ప్రారంభమైన కథ, అందులో ప్రదర్శించిన సినిమాల కన్నా ముఖ్యమైనది. ఆసక్తికరమైనది.
మద్రాసులో మొట్టమొదట సెంట్రల్ రైల్వే స్టేషన్ కి సమీపంలో ఉన్న విక్టోరియా పబ్లిక్ హాల్లోనే 1897లో ఓ సినిమా ప్రదర్శించడం విశేషం. దానిని సినిమా అని చెప్పలేం. ఎన్నో ఫోటోలను "స్లయిడ్ షో"లాగా ప్రదర్శించారు. ఈ స్లయిడ్ షోని ఎడ్వర్డ్ అనే ఐరోపా అతను ప్రదర్శించాడు.
ఆ తర్వాత వార్విక్ మేజర్ అనే ఆంగ్లేయుడు మౌంట్ రోడ్డులో ఎలక్ట్రిక్ థేయటర్ నిర్మించారు. ఇందులో కొన్నేళ్ళపాటు సినిమాలు ప్రదర్శించారు. ఇదే మద్రాసులో మొట్టమొదటగా నిర్మించిన సినిమా థియేటర్. ఇది మద్రాసులోని ఆంగ్లేయులకు సాయంత్రాలు కాలక్షేపంగా ఉండేది.
ఈ క్రమంలోనే 1909లో ఇఁగ్లండ్ యువరాజైన అయిదో జార్జ్ మద్రాసు వచ్చారు. ఆయన రాకను పురస్కరించుకుని సంబరాలు చేసారు. ఇందులో భాగంగా ఓ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే శబ్దంతో కూడిన షార్ట్ ఫిలిమ్స్ కూడా ప్రదర్శించారు. 
ఇందుకోసం బ్రిటన్ కంపెనీ ఒక పరికరాన్ని (క్రోమో మెగాఫోన్) తీసుకొచ్చారు. ఇది మరేమిటో కాదు, గ్రామఫోన్ తో కూడిన ప్రొజెక్టర్. తెరపై దృశ్యం కదులుతుంటే దానికి తగ్గట్టు అప్పటికే రికార్డు చేసిన శబ్దం గ్రామ్ ఫోన్ నుంచి ధ్వనిస్తుంది. నటుల పెదవుల కదలిక, తెరమీద వచ్చే శబ్దంతో సింకయ్యేది. ఈ ప్రదర్శనలు మద్రాసు వాసులను విశేషంగా ఆకట్టుకుంది.
దీనిపై రఘుపతి వెంకయ్య అనే ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ దృష్టి పడింది. ఆయనకో ఆలోచన వచ్చింది. ఆ ప్రదర్శన ముగియడంతోనే ఆ పరికరాన్ని బ్రిటన్ సంస్థ నుంచి ముప్పై వేల రూపాయలకు కొనుగోలు చేశారు. ఆ పరికరం వెంకయ్య జీవితాన్నే మార్చేసింది. 
మద్రాసు హైకోర్టుకు సమీపంలో ఓ షెడ్డు ఏర్పాటు చేసి ఆ పరికరంతో చిత్రం చూపించారు. ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. అనంతరం ఆ పరికరంతో దేశమంతా పర్యటించి చిత్రాలను ప్రదర్శించసాగారు. 
ఆ తర్వాత శ్రీలంక, బర్మా తదితర దేశాలకు తన పరికరాన్ని తీసుకుని కొంతమంది సిబ్బందితో కలిసి వెళ్ళారు. 
అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఈ పరికరం వెంకయ్యకు డబ్బులు సంపాదించి పెట్టింది. అలా సంపాదించిన లాభాలతో మూకీ చిత్రాలను ఎప్పుడూ ప్రదర్శించడం కోసం చెన్నైలో ఓ సినిమా థియేటర్ నిర్మించారు. దక్షిణ భారత దేశంలో ఓ భారతీయుడు నిర్మించిన మొదటి థియేటర్ ఇదే.  అలా 1914లో ప్రారంభమైనదే గెయిటీ థియేటర్. ఈ థియేటరుకి ప్రేక్షకులు భారీ సంఖ్యలో వస్తుండటాన్ని దృష్టిలో పెట్టుకుని వెంకయ్య మద్రాసులో ఒక దాని తర్వాత ఒకటిగా థియేటర్లు కట్టించారు. తంగశాలై కూడలిలో క్రౌన్ థియేటర్, దాని తర్వాత పురసైవాక్కం హైరోడ్డులో గ్లోబ్ థియేటర్ వచ్చాయి. ఈ మూడు థియేటర్లలోనూ మూకీ చిత్రాలు ప్రదర్శించేవారు.
మిలియన్ డాలర్ మిస్టరీ, మిస్టరీస్ ఆఫ్ మీరా, క్లచ్చింగ్ హ్యాండ్, బ్రోకన్ కాయిన్, రాజాస్ కాస్కెట్, పెరల్ ఫిష్, గ్రేట్ బార్డ్ వంటి మూకీ చిత్రాలను విదేశాల నుంచి రప్పించి తన మూడు థియేటర్లలోనూ ప్రదర్శించారు. ఇలా హాలీవుడ్ సినిమాలను ఆ రోజుల్లోనే మద్రాసు వాసులకు పరిచయం చేసిన ఘనత వెంకయ్యగారికి దక్కింది.
ఆ సమయంలోనే మన భారత దేశంలో హరిశ్చంద్ర, కీచకవధం వంటి మూకీ చిత్రాలు విడుదలయ్యాయి. వెంకయ్య ఈ రెండు చిత్రాలను తన మూడు థియేర్లలోనూ ప్రదర్శించారు. వీటి విజయం తర్వాత ఆయన చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాశ్ ని లండన్ కి పంపించి చలనచిత్ర రంగంలో శిక్షణ పొందేలా చేశారు.
అలాగే జర్మనీకి హాలీవుడ్ కి వెళ్ళిన ప్రకాశ్ తిరిగి వస్తున్నప్పుడు 35 ఎంఎం విలియంసన్ మూకీ చిత్ర కెమేరా ఒకటి కొనుక్కొచ్చారు. దీంతో వెంకయ్య, ప్రకాశ్ "మీనాక్షి కళ్యాణం" అనే సినిమాను నిర్మించారు. అప్పట్లో ఫోటో తీయించుకుంటే ఆయుష్షు తగ్గిపోతుందన్న మూఢనమ్మకం ఉండటంతో ఇందులో నటించడానికి తమిళ నటులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మద్రాసులో ఉండిన ఆంగ్లో ఇండియన్ లను తమ సినిమాలో నటింపచేశారు. సినిమాను పూర్తి చేసి ప్రదర్శించినప్పుడు దానిని చూసిన వారికి తెగ ఆశ్చర్యం కలిగింది. కారణం, సినిమాలో నటించిన వారెవరికీ తలలు కనిపించకుండా చేశారు. ఆంగ్లో ఇండియన్లను దేవుడి పాత్రలలో నటింపచేయడం వల్ల దేవుడు కోపించుకుని అందరి తలలూ తీసేసారని మద్రాసువాసులు మాట్లాడుకున్నారు.
1932లో వెంకయ్య తన మూడు థియేటర్లలో టాకీ చిత్రాలు ప్రదర్శించేందుకు వీలుగా ఆధునిక పరికరాలను అమర్చారు. ఈ విధంగా ఆ కాలంలో మద్రాసువాసుల కలలకు ద్వారాలు తెరిచినవారు వెంకయ్యగారే. 
1914లో ప్రారంభమైన గెయిటీ థియేటర్ ఉన్న చోట ఇప్పుడు ఓ వాణిజ్య సముదాయం నిర్మించారు. 
గెయిటీ థియేటర్ మద్రాసులో కనిపించకుండా పోయినట్టు ఆ సినిమా హాలు నిర్మించిన వెంకయ్యగారి జ్ఞాపకమూ అక్కడ తెరమరుగున పడింది. అవును, మద్రాసు వాసులకు సినిమాను పరిచయం చేయడంలో ముఖ్యపాత్ర రఘుపతి వెంకయ్యగారిదే అనే విషయాన్ని తమిళ సినిమా మరచిపోయింది. కానీ ఆంధ్రుల జ్ఞాపకంలో ఆయన ఎప్పటికీ ఉంటారు. తెలుగు చలనిచత్ర పరిశ్రమలో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పేరిట అవార్డు ఇస్తుండటం గమనార్హం.  
తెలుగు చలనచిత్ర రంగానికి ఆయనను పితా మహుడుగా చెప్పుకోవచ్చు. ఈయన ప్రసిద్ధ సంఘ సంస్కర్త దివాన్ బహద్దూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడుగారి సోదరుడే.
రఘుపతి వెంకయ్య నాయుడుగారి స్వస్థలం మచిలీపట్నం. ఆయన తండ్రి, తాత ముత్తాతల కాలం నుంచీ సైన్యంలో సేనానాయకులుగా పని చేసినవారే. 1869
అక్టోబరులో జన్మించిన ఈయన 1941లో మరణించారు.

కామెంట్‌లు