ఓవర్ టేక్ (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు


  రంగ మితిమీరిన వేగంతో బైక్ నడుపుతున్నాడు. ముందున్న కార్లన ఓవర్ టేక్ చేయడమే లక్ష్యంగా దూసుకు వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి వచ్చిన రంగ చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగ తండ్రి రామనాథంతో మాట్లాడినాడు. రామనాథం ప్రమాదం జరిగిన విధానం చెప్పాడు. అది రంగ స్నేహితుల ద్వారా రామనాథానికి తెలిసింది.

 "చూడండి రామనాథం గారూ! చిన్న వయసులో నీ కుమారునికి డ్రైవింగ్ నేర్పించి పెద్ద తప్పు చేశారు. ఏదో గొప్ప కోసం అనుకుంటున్నారు కానీ మీ వాడి ప్రాణమే పోతే ఎలా ఉండేది? లేదా మీ వాడి నిర్లక్ష్యం మూలంగా మరొకరి ప్రాణం పోతే ఏమయ్యేది. చిన్న వయసులో మీ వాడికి డ్రైవింగ్ నేర్పినందుకు మీకు జైలుశిక్ష పడేది." అన్నారు ప్రధానోపాధ్యాయులు. అక్కడే ఉన్న రంగతో ఇలా అన్నాడు. ", చూడు రంగ! ఇంకొకరిని ఓవర్ టేక్ చేసే ఆలోచన మంచిదే. కానీ అది మన భవిష్యత్తుకు మేలు చేసే విషయాలలో ఉండాలి. కానీ ఇలా ఎదుటి వాహనాలను ఓవర్ టేక్ చేసి ముందుకు వెళితే నీకు ఏం లాభమో చెప్పు? ఈ గాయాల నుంచి కోలుకోవడానికి నెలలు పట్టవచ్చు. నీ తరగతిలో చదువులో నీ కంటి తెలివైన వాళ్ళు ముప్పై మందికి పైగా ఉంటారు. క్రమ క్రమంగా చదువులో వాళ్ళదరినీ ఓవర్ టేక్ చేస్తూ అందరి కంటే ముందు వచ్చే ప్రయత్నం చెయ్యి. నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. పద్దెనిమిది సంవత్సరాలు నిండి, నీకు లైసెన్స్ వచ్చేవరకు డ్రైవింగ్ జోలికి వెళ్ళకు." అని. రంగకు కనువిప్పు కలిగింది.


కామెంట్‌లు