తమిళంలో తొలి సినీ నిర్మాత నటరాజ ముదలియార్!;-- యామిజాల జగదీశ్


 తమిళ సినిమా అనే వృక్షానికి విత్తనం నాటింది ఆర్. నటరాజ ముదలియార్! 
ఈయనను తమిళ సినిమా సృష్టించిన బ్రహ్మగా చెప్పుకుంటారు.
1916లో కీచకవధం అనే మూకీ సినిమాను నిర్మించారు నటరాజముదలియార్.
అది ఏ ముహూర్తాన వేశారోగానీ ఈరోజు అది బ్రహ్మాండమైన వృక్షంగా ఎదిగి ఎందరికో నీడనిచ్చి ఆదుకుంటోంది. కానీ ఆయనను మరచిపోయిందనేది విచారకరం.
నటరాజ ముదలియార్ గురించి ఓ ఇంటర్వ్యూ దర్శకుడు శ్రీధర్ సారధ్యంలో వచ్చి చిత్రాలయ అనే పత్రికలో 1970లో అచ్చయింది. దాంతో ఆయన గురించి కొన్ని వివరాలు నలుగురికీ తెలిసాయి.
1936లో నటరాజ ముదలియారుకి సంబంధించిన ఓ సమాచారం నాటి మెయిల్ అనే పత్రికలో వచ్చింది. ఈ విషయం శ్రీధర్ దృష్టికి వచ్చింది.
అది తెలిసిన మరుక్షణం శ్రీధర్ నటరాజ ముదలియార్ తో ఇంటర్వ్యూని తమ  పత్రిక చిత్రాలయాలో ప్రచురించాలనుకున్నారు.
చెన్నైలోని కీల్పాక్ పరిధిలో మిల్లర్స్ రోడ్డులో ఓ బంగళాను కొనుగోలు చేసి స్టూడియోగా మార్చారు నటరాజ ముదలియార్.
ఇందియా ఫిలిం కంపెనీ అనే పేరిట చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు 
నటరాజ ముదలియార్ మొట్టమొదటగా 1916లో మహాభారతంలోని "కీచక వధం" ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని అదే పేరుతో ముప్పై అయిదు రోజుల్లో సినిమా తీశారు.
ఈ సినిమా తమిళనాడులోనే కాకుండా బర్మా, మలేయా తదితర దేశాల్లోనూ ప్రదర్శించారు.
ముప్పై అయిదు వేల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ సినిమాతో యాభై వేల రూపాయలు వసూలయ్యాయి. అంటే ఆయనకు పదిహేను వేల రూపాయల లాభం దక్కిందన్న మాట. అప్పట్లో పదిహేను వేలన్నది పెద్ద మొత్తమేనని చెప్పుకోవచ్చు.
సినీ పరిశ్రమకు రాక మునుపు ఆయన మౌంట్ రోడ్డులో ఓ మోటర్ కార్ వ్యాపారం చేస్తుండేవారు. ఈ సంస్థను అదే రోడ్డులో సింప్సన్ సంస్థకు అమ్మేశారు.
కళల పట్ల ఎంతో ఆసక్తి ఉన్న నటరాజముదలియార్ ఫోటోగ్రఫీ పట్ల దృష్టి సారించారు. ఈయనకు కర్జన్ ప్రభువు ఆస్థానంలో ఉండిన కెమేరామాన్ స్మిత్ తో పరిచయం ఏర్పడింది. ఆయన సహాయంతో ఫోటోగ్రఫీలోని మెళకువలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ముదలియార్ కొత్త కెమేరాను కొన్నారు.
ఆ రోజుల్లో ఫిలిం లండన్ నుంచే వచ్చేది. బాంబేలోని కోడక్ సంస్థలో ఉన్నత హోదాలో ఉండిన కార్పెంటర్ అనే ఆయన ద్వారా నటరాజ ముదలియార్ తనకు కావలసిన ఫిలింరీల్స్ ని తెప్పించుకునే వారు.
కీచకవధం తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం సినిమాను నిర్మించినప్పుడు నటరాజ ముదలియార్ కు ఓ విచిత్రమైన సమస్య ఎదురైంది. ఈ సినిమాలో నటించిన ం
చడానికి తమిళ మహిళలెవరూ ముందుకు రాలేదు.
"ఏమిటీ మా చీరను దుశ్శాసనుడు లాగితే మా పరువేంకాను" అంటూ స్త్రీలు ఈ సినిమాలో నటించడానికి మొగ్గు చూపలేదు.
దాంతో ఆయన ఓ ఆంగ్లో ఇండియన్ మహిళను ద్రౌపది పాత్రలో నటింపచేశారు. ఈ సినిమా 1918లో వచ్చింది. ఈ సినిమాకూడా మంచి లాభాలే తెచ్చిపెట్టింది.
ద్రౌపదిగా నటించిన ఆంగ్లో ఇండియన్ మహిళకు సన్నివేశాలను రంగసామి పిళ్ళయ్ అనే అతను ఇంగ్లీషులో వివరించే వారు. ఈ రంగసామి పిళ్ళయే సినిమాలో దుశ్శాశనుడిగా నటించారు. ఈ సినిమా అంటే తనకెంతో ఇష్టమని ముదలియార్ చెప్పారు.
అనంతరం లవకుశ (1919), రుక్మిణి సత్యభామ (1920), మార్కండేయ (1922), మయిల్ రావణా (1923) తదితర సినిమాలు తీసిన నటరాజ ముదలియార్ చెన్నైలోని అయినావరంలో తమ కుమార్తె రాధాబాయి ఇంట్లో ప్రశాంతజీవనం గడిపారు.
తమ సినిమాకు సంబంధించి పంపిణి హక్కులను ఆయన కలకత్తాలోని మదన్ సంస్థకు, బొంబాయిలో ఆదిర్ష్ ఇరానీకి అమ్మడంతో ముదలియార్ సినిమాలు భారత దేశమంతటా ప్రదర్శనకు నోచుకునేవి. నాటకాలలో నటించేవారినే సినిమాలకు ఎంపిక చేసిన ఆయన తర్వాత్తర్వాత ఆర్థికపరమైన ఒత్తిళ్ళతో సినీ రంగంనుంచి తప్పుకున్నారు.
సినిమాలో గ్లామరస్ సన్నివేశాలను చూపెట్టి ప్రజలను ఆకట్టుకోవడమనేది ఆయనకు గిట్టేది కాదు. ఇటువంటి సన్నివేశాలతో యువతరం దెబ్బతింటుందని, సంస్కృతీసంప్రదాయాలకు ఆటంకం ఏర్పడుతుందని భావించేవారు. ప్రేమ సన్నివేశాలనైనా హుందాగా చిత్రీకరించాలనేదే ఆయన అభిప్రాయమై ఉండేది. దేశ పురోగామికి సినిమా ఓళగొప్ప సాధనంగా ఉపయోగపడాలనేవారు. అంతేతప్ప చిత్తమొచ్చినట్టల్లా సినిమాలు తీయకూడదని చెప్పేవారు.
సత్సంప్రదాయాలకు నడుంకట్టి ఆదర్శవంతమైన సినిమాలను నిర్మించడం ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నటరాజముదలియార్ ని చెన్నై రాజాజీ మండపంలో 1970లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి చేతులమీదుగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం దక్షిణ భారత సినిమా టెక్నీషియన్ సంఘం ఆధ్వర్యంలో జరిగింది.
1885లో జన్మించిన నటరాజ ముదలియార్ 1971 మే మూడో తేదీన తుదిశ్వాస విడిచారు. చెన్నై అన్నానగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 
చివరి రోజుల్లో ఆయన ఓ రసాయన ద్రవ్యాన్ని కనుగొనే పరిశోధనలు చేసారన్నది ఆశ్చర్యకరమైన విషయం.

కామెంట్‌లు