ఔను! వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

  శ్రావణి, స్రవంతిలు చిన్నప్పటి నుంచీ ప్రాణ స్నేహితులు. చదువులో పోటా పోటీగా చదివేవారు. ఎప్పుడు ఎవరు మొదటి ర్యాంకు వస్తారో చెప్పడం కష్టాలూ. కానీ ఏనాడూ ఒకరి పట్ల మరొకరికి ఈర్ష్యా ద్వేషాలు లేవు. ఒకరి సందేహాలు మరొకరు నివృత్తి చేసుకుంటూ మార్కులు మరింత పెంచుకునేవారు. ఇప్పుడు ఇద్దరూ పదవ తరగతికి వచ్చారు. 
       ఇదిలా ఉండగా శ్రావణి తన పుట్టినరోజు నాడు తన తరగతిలో అంరికీ పార్టీ ఇచ్చింది. స్రవంతిని మాత్రం పిలవలేదు. స్రవంతికి తెలిసి, ఆశ్చర్యపడింది. మరునాడు బడికి వచ్చిన స్రవంతి శ్రావణితో మాట్లాడబోతే శ్రావణి ముభావంగా ఉంది. స్రవంతిలో భాగమైన కోపం వచ్చి, శ్రావణితో మాటలు మానేసింది. శివాని స్రవంతి వద్దకు చేరి, "ఆ శ్రావణి ఏం చూసుకొని మురుస్తుంది. చదువులో నువ్వు పోటీకి వస్తున్నావనే ఈర్ష్యతోనే నీతో మాటలు మానేసింది. ఆ శ్రావణికి బుద్ధి చెప్పాలి. మరింత కష్టపడి చదువు. చదువులో ఎప్పుడూ నువ్వే ఫస్ట్ రావాలి."అంది. "నువ్వు కూడా నాతో కలిసి చదువు. నీకు కూడా శ్రావణి కంటే ఎక్కువ మార్కులు వచ్చేల చదివిస్తా." అంది స్రవంతి. ఈ పోటీ ప్రీ ఫైనల్స్ దాకా సాగింది. ప్రీ ఫైనల్స్ ముగిశాయి. 
      విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. స్రవంతి మాట్లాడుతూ "నేను బాగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నా ప్రాణ స్నేహితురాలు శ్రావణికి." అన్నది. శ్రావణి ఆశ్చర్యపోయింది. "నిన్ననే శివానీ విషయం అంతా చెప్పింది. నేను పదవ తరగతిలోకి రాగానే నా ప్రాణ స్నేహితురాలితో ఉండేది ఈ ఒక్క సంవత్సరమే కదా అని బాగా ముచ్చట్లు మొదలు పెట్టాను. ఎంతగా అంటే శ్రావణి కష్టపడి చదువుతున్నా చదవనీయకుండా ఇబ్బంది పెడుతున్నాను. తరగతిలో ఉపాధ్యాయులు పాఠం చెబుతున్నప్పుడు కూడా శ్రావణిని విననివ్వకుండా ఒకటే ముచ్చట్లు. శ్రావణి ఎన్నోసార్లు హెచ్చరిస్తూ వచ్చింది. సమయం విలువైందని, వృథా చేయకుండా కష్టపడి చదువుదామని, ఉపాధ్యాయులు చెప్పేది శ్రద్ధగా విందామని. కానీ నేను వినిపించుకోలేదు. పుట్టినరోజున నన్ను పిలవకపోవడం, మరునాటి నుంచి నాతో మాట్లాడకపోవడంతో నాకు కోపం పెరిగింది. పైగా శివానీ సహాయంతో నన్ను కష్టపడి చదివేలా చేసింది. ఆ విధంగా నా అల్లరిని కట్టడి చేసి, నా చదువును నిలబెట్టింది. శ్రావణికి కృతజ్ఞతలు." అన్నది స్రవంతి. ఆ తర్వాత స్రవంతిని బయట కలుసుకున్న శ్రావణి "అసలు ఏమనుకుంటున్నావు నీవు? ఇంకొక్క మాట మాట్లాడినా చంపేస్తా." అన్నది. నివ్వెరపోయారు అక్కడ ఉన్న వారందరూ." "నేనేమన్నానే రాక్షసీ?" అన్నది స్రవంతి. "ప్రాణ స్నేహితురాలికి కృతజ్ఞతలు చెబుతావా?" అన్నది శ్రావణి. అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య! స్నేహితులు ఇద్దరూ ఒక్కటయ్యారు అనుకున్నారు. 

కామెంట్‌లు