"పుస్తక శక్తి":-- యామిజాల జగదీశ్

 రోజూ రాత్రి పడుకునే ముందు 
యూ ట్యూబులో నాకిష్టమైన తమిళ రచయితలు లేదా వక్తల మాటలు వినడం అలవాటు. అలాగే నిన్న కూడా ఒకరి ప్రసంగం విన్నాను. తమిళ రచయిత, వక్త, దర్శకుడు భారతీ కృష్ణకుమార్ గారి ఉపన్యాసం విన్నాను. పుస్తకాలపై సాగిన ప్రసంగమది.
ఓ రష్యా కథను చెప్పారు మాటల మధ్యలో.
నేనిక్కడ ఆ కథను క్లుప్తంగా చెప్పదలిచాను.
జీవితకాల శిక్ష, ఉరిశిక్షపై జరిగిన వివాదంలో
ఓ యువకుడు, ఓ వ్యాపారి మధ్య జరిగిన ఒప్పందం.
జీవితకాలశిక్ష అనుభవిస్తానంటాడు యువకుడు. 
అది ఎంత కష్టమో నీకు తెలీదు. చెప్పుకోవడానికేం గానీ నువ్వు నిజంగానే జీవితకాల శిక్ష అనుభవించి బయటకు వస్తే నేను పదిలక్షలు ఇస్తానంటాడు వ్యాపారి. నువ్వు నిజంగా పది లక్షలిస్తానంటే నేను జీవితకాల శిక్ష అనుభవిస్తానంటాడు యువకుడు. ఈ మేరకు ఒప్పందం చేసుకుంటారు.
యువకుడిని వర్తకుడి ఆవరణలోని ఓ గదిలో బంధిస్తారు.ఆ గది తలుపుకి తాళం ఉండదు. కానీ యువకుడు గానీ గది బయటకొస్తే ఇతనే ఆ వ్యాపారికి పది లక్షలు చెల్లించాలి. కనుక యువకుడు బయటకు రాడు. మొదట్లో కొంత కాలం ఒక్కడే ఉండవలసివచ్చినందుకు బాధ పడతాడు. ఏడుస్తాడు. నెలల తర్వాత యువకుడు పుస్తకాలు అడుగుతాడు. అతను కోరిన పుస్తకాలు ఇస్తుంటారు. వాటిని చదువుతాడు. పద్నాలుగేళ్ళ జీవితకాలం రాత్రితో ముగిసి తెల్లవారితే అతను బయటి ప్రపంచంలోకొస్తాడు. ఒప్పందం మేరకు అతను విజయుడవుతాడు. తెల్లవారడంతోనే పది లక్షలు అందుకోబోతున్నాడు. 
కానీ మరోవైపు వ్యాపారి తన వ్యాపారం దెబ్బతిని పది లక్షలుకాదు కదా వెయ్యికూడా ఇచ్చుకోలేని స్థితిలో ఉంటాడు. తను తలవంచవలసి వస్తుందన్న భయంతో వ్యాపారి ఆ యువకుడిని హతమార్చాలనుకుంటాడు. రాత్రి అతని గదికేసి వెళ్తాడు. అప్పటికే ఆ యువకుడు నిద్రలో ఉంటాడు. అతని పక్కనే పుస్తకాలు కొన్ని, ఓ ఉత్తరమూ ఉంటాయి. 
వ్యాపారి ఆ ఉత్తరం తీసి చదువుతాడు. 
అందులో రాసి ఉన్న మాటలు...
"పుస్తకాలకన్నా డబ్బే ప్రధానమనుకుని నేను ఒప్పందానికి సంతకం చేసి ఏకాకినై గదిలో ఉండిపోయాను. మొదట్లో స్వేచ్ఛను కోల్పోయినందుకు బాధపడి ఏడ్చిన క్షణాలున్నాయి. కానీ పుస్తకాలు చదువుతున్నకొద్దీ అలెగ్జాండర్ మొదలుకొన్ని గొప్ప గొప్ప వారందరూ నాతో నా గదిలోనే ఉన్నట్టు ఫీలయ్యాను. మహామహులు, చరిత్ర ప్రసిద్ధులు నాతోనే ఉన్నారు. వారి సాహసాలూ, వారి మంచితనమూ, వారి చేతలూ నన్ను ఆశ్చర్యపరిచాయి. ఇవన్నీ చదువుతుంటే వాటి మీద ప్రేమాభిమానాలు పెరిగాయి. డబ్బంటే విరక్తి పుట్టింది. రేపు తెల్లవారుజామున వ్యాపారి పది లక్షలు ఇవ్వడానికొచ్చినప్పుడు వాటిని తీసుకోకుండా బయటి ప్రపంచంలో స్వతంత్రంగా ప్రయాణిస్తృ పుస్తకాల గొప్పతనాన్ని చెప్పాలని ఉంది"
ఈ ఉత్తరం చదివిన వ్యాపారి తనను తాను నిందించుకుంటాడు. ఇంతటి మనసున్న యువకుడిని నేను నా చేతకానితనంతో చంపాలనుకున్నానా...ఎంతటి హీనుడిని నీచుడినని తనను తాను తిట్టుకుని ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చి పదిలంగా దాచుకుంటాడు. డబ్బులు ఇవ్వలేని స్థితిని చెప్పాలనుకుంటాడు.
రాత్రి గడుస్తుంది. 
వ్యాపారి తన నౌకరుని వెళ్ళి గదిలోకి వెళ్ళి యువకుడిని చూసి రమ్మంటాడు. 
నౌకరు గోడకు కొట్టిన బంతిలా వెనక్కొచ్చి "అయ్యా తలుపులు తీసే ఉన్నాయి. ఆ యువకుడు లేడు" అంటాడు. 
వ్యాపారి విషయం గ్రహించి సిగ్గుపడటంతో 
కథ ముగుస్తుంది.
ఇందులో ఎవరు గెలిచారో ఎవరు ఓడారో పాఠకులే నిర్ణయించుకోవాలి. 
పుస్తకాలకున్న శక్తి ఎలాంటిదో చెప్పడానికే ఈ కథన ప్రాధాన్యం.
నాకైతే ఎంతగానో నచ్చింది.

కామెంట్‌లు