ఆ ఉప్మా కోసం...:-- దోర్బల బాలశేఖరశర్మ

 

రామాయంపేట పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో నేను 1 నుంచి 5వ తరగతి వరకు చదివిన రోజుల్లో (1968-73) ఇంచుమించు ప్రతిరోజూ మధ్యాహ్నం సుమారు 12.30 నుంచి 1.00 గంటలోపు పిల్లలకు 'దొడ్డు గోధుమ రవ్వ'తో చేసిన ఉప్మా పెట్టేవారు. (ఈ రవ్వా గోధుమల నుంచి తీసిన పొట్టు అని, అప్పటి అగ్ర దేశమైన సోవియట్ రష్యా దీనిని ఉచితంగా మన భారతదేశానికి దిగుమతి చేసేదనీ విన్నాం. ఇది నిజమో, కాదో తెలియదు.) బెల్ కొట్టగానే పిల్లలం అందరం పొలోమని వెళ్లి స్కూలు వారు ఇచ్చే సత్తు గిన్నెలు పట్టుకొని క్యూలో నిలబడే వాళ్ళం. ఒక పెద్ద సత్తు గిన్నెలో వండిన వేడివేడి ఉప్మా అప్పుడే మూత తీసి, ఒక్కొక్కరికీ గిన్నెలో ఒక స్పూను (కేవలం ఒకటే గరిటె) నిండా తీసుకొని వేసేవారు. ఉప్మా ప్లేటులో పడగానే దాని ఘుమ ఘుమ వాసన అదిరి పోయేది. అక్కడి పెద్ద ఆవరణలో ఒక్కొక్కరు ఒక్కోచోట కూచొని తినే వాళ్ళం. ఈ ఉప్మా ప్రైమరీ స్కూలులోనే తిన్నాం. హైస్కూలుకు వచ్చేసరికి మధ్యాహ్నం భోజనం కోసం ఇళ్ళకు వెళ్లి, తిరిగి స్కూలుకు పగలు రెండు గంటలకల్లా వచ్చేసే వాళ్ళం.
అప్పటి ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెప్పిన వారిలో నాకు ఇప్పటికీ బాగా గుర్తున్న టీచర్లు ... నాగయ్య సార్, శంకర్ సార్, హనుమంత్ సార్. డ్రిల్ పీరియడ్ ఒకటి వుండేది. అదే బడి ఆవరణలో సుమారు ఇరవై మంది పిల్లలతో ఎక్కువగా కోకోనే ఆడించే వారు. పంద్రాగస్టు, చెబ్బీస్ జనవరి (జాతీయ పర్వదినాలు) వచ్చాయంటే, పొద్దున ప్రేయర్ చెప్పించి, స్కూలు బయటకు దారితీసేలా ఇద్దరు, ముగ్గురు పిల్లలతో కలిపి, వరుసలుగా నిలబెట్టేవారు. బస్టాండ్ అవతల నుంచి పెద్ద తరగతుల (హైస్కూల్) పిల్లలు వస్తున్నారనగానే మా పిల్లల క్యూలను ముందు పోనిచ్చి, వెనుక నుంచి వారిని కలిపేవారు. అలా చిన్న, పెద్ద తరగతుల పిల్లలంతా సుమారు అర కిలోమీటరు దూరం మేర వ్యాపించి ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళం. అందరి కంటే ముందు పెద్ద పిల్లలు ఇద్దరు బ్యాండు సైతం వాయించేవారు. ప్రధాన వీధిలోంచి గాంధీ బొమ్మ, పోలీస్ స్టేషన్, మార్కెట్ మీదుగా ఊరు చివరి వరకు వెళ్లి, వెను తిరిగే వాళ్ళం. మార్కెట్ తర్వాత వెళ్ళేటప్పుడు మా ఇంటి ముందు నుంచి వెళ్ళేవాళ్ళం. తిరిగి వచ్చేప్పుడు మా పక్క వీధిలో నుంచి మార్కెట్ వీధికి కలిసే వాళ్ళం. ఇండ్ల ముందు పెద్దలు, యువకులు, తల్లిదండ్రులు నిలబడి పిల్లలంతా వెళ్ళిపోయేదాకా ఆసక్తిగా చూసేవారు. తరగతులలోని పెద్ద పిల్లలు మధ్య మధ్య నిలబడి, పిల్లలు వరుస తప్పకుండా, బద్దకించకుండా చూసేవారు. 'మహాత్మా గాంధీకీ జై, పండిట్ నెహ్రూకు జై' అంటూ పెద్దవారు చెబుతుంటే, పిల్లలం అందరం గట్టిగా నినాదాలు ఇచ్చేవాళ్ళం. స్కూలులో ఇచ్చిన చాక్లెట్ తీసుకొని ఆనందంగా ఇంటికి చేరేవాళ్ళం. అదంతా ఒక చెప్పలేని ఆనందాన్నిచ్చేది.

కామెంట్‌లు