పట్టుదల (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
  "అమ్మా నాకు బడికి వెళ్ళాలని ఉంది." అన్నది ఏడేళ్ళ సుమతి. "మనం పేద వాళ్ళం. వీథిన పడేసిన వాటిని సంచుల్లో నింపుకొని అమ్ముకోవడమే మన పని. మనలాంటి వాళ్ళు చదువు అనకూడదు." అన్నది సుమతి వాళ్ళ అమ్మ. సుమతి ఒకరోజు వెక్కి వెక్కి ఏడుస్తూ ఒకచోట కూర్చుంది. దారిన పోతున్న శ్రావణి అనే పన్నెండేళ్ళ అమ్మాయి అది చూసింది. కారణం కనుక్కున్నది. సుమతి పరిస్థితి వాళ్ళ ఇంట్లో చెప్పింది శ్రావణి.
     "అమ్మా! మనం సుమతిని చదివిద్దాం. వాళ్ళకు డబ్బు సహాయం చేస్తూ వాళ్ళను ఆదుకుంటాం." అన్నది. " నోరు మూసుకో. నీకేమైనా పిచ్చి పట్టిందా. దేశంలో అనాథలు ఎందరో ఉన్నారు. వాళ్ళందరినీ తెచ్చి మనింట్లో పెట్టుకుంటే అన్నీ అమ్ముకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి దరిద్రపు ఆలోచనలు చేస్తే కాళ్ళు విరగ్గొడుతా." అన్నది అక్కడే ఉన్న శ్రావణి వాళ్ళ నాయనమ్మ. శ్రావణి సుమతితో స్నేహం చేసింది. తీరిక సమయాల్లో శ్రావణికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషల్లో చదవడం, రాయడం పూర్తిగా నేర్పించింది. తీరిక వేళల్లో మొబైల్ ఫోన్ తీసుకెళ్ళి హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్టోరీలు చూపించింది. ఆ తర్వాత మూడు భాషల్లో కథల పుస్తకాలను కొని సుమతి చేత చదివించింది. ఇంతలో శ్రావణి వాళ్ళ నాన్నకు బదిలీ అయ్యి వేరే ఊరికి వెళ్ళారు.
       అయినా సుమతి పట్టుదల వీడలేదు. కనిపించిన కాగితమల్లా చదివేది. బయట షాపుల్లో ఉన్న వార్తా పత్రికలు క్రమం తప్పకుండా చదివేది. అలా లోక జ్ఞానాన్ని సంపాదించుకుంది. అంతకు ముందే శ్రావణి పుణ్యమా అని వేలాదిగా కథలు చదివింది కదా! క్రమంగా కథలు రాస్తూ వివిధ పత్రికలకు పోస్ట్ ద్వారా పంపడం ప్రారంభించింది. సమకాలీన విషయాలపై వ్యాసాలు రాసింది. ఇలా అనేక ప్రక్రియల్లో రచనలు చేసి, బాగా పారితోషికాలు పొందింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి కీర్తిని పొందింది.
      సుమతికి కొత్త ఆలోచన వచ్చింది. అంతరీస్తున్న కళలను బతికించాలని. తన ఊళ్ళోనే కొంతమందికి హరికథ, బుర్రకథ, నాటకాలు మొదలైన కళా రూపాలను నేర్పి, ప్రదర్శింపజేసింది. ఆయా కళా రూపాలకు కథనం తానే స్వయంగా రాసేది. జనాలకు చాలా ఆసక్తిని కలిగించేలా, సందర్భాన్ని బట్టి చక్కని హాస్యంతో రాసేది. అది జనాలపై ప్రభావాన్ని చూపింది. స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాలకు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయాన్ని చేశాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఈ కళలన్నీ విస్తరించి గ్రామాలు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. పురాణ గాథలు, నీతి కథలు, సమాజంలో సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని ఆయా కళా రూపాలను ప్రదర్శింపజేసింది. సుమతికి మంచి కీర్తి వచ్చింది. పట్ఠుదల ఉంటే ఎన్ని కష్టాలను, ఆటంకాలను ఎదుర్కొని అయినా స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరుకోగలం అని నిరూపించింది సుమతి. ‌‌

కామెంట్‌లు