ఎంజిఆర్ ముచ్చట్లు;-- యామిజాల జగదీశ్
 దేవుడే మనిషిగా అవతరించాడని ఇప్పటికింకా తమిళ ప్రజల జ్ఞాపకాలలో నివసిస్తున్న నాయకుడు ఎంజిఆర్. 
ఎం.జి.ఆర్ గా ప్రసిద్ది చెందిన మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (1917 జనవరి 17 - 1987 డిసెంబర్ 24) తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ చలనచిత్ర నటుడు. దర్శకుడు. 1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఎంజిఆర్ దాత, సమాజ సేవకులు. 1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణానంతరం లభించింది.
1972లో అన్నాదురై మరణించిన మూడేళ్ళకు డిఎంకెను విడిచిపెట్టి,  ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట కళగం (ఎఐఎడిఎంకె) ను ఏర్పాటు చేశారు. ఐదేళ్ళ తరువాత, 1977  తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో భారతదేశంలో మొట్టమొదట ముఖ్యమంత్రి పదవి సాధించిన సినీ నటుడిగా చరిత్ర సృష్టించాడు.
 అటువంటి ఎంజిఆర్ గురించి కొన్ని సంగతులు....
ఎంజిఆర్ నటించినమొత్తం సినిమాలు 136 మొదటి సినిమా "సతీ లీలావతి" (1936). చివరి సినిమా "మదురయై మీట్ట సుందరపాండియన్" (1977) 
ఆయన నటించిన సినిమాలలో అరవైదాకా తెలుగులో వచ్చిన సినిమాలనే తమిళంలో పునర్నిర్మించినవే. వాటిలో ఒక్క సినిమా మినహా మిగిలినవన్నీ తెలుగులో ఎన్టీ రామారావు నటించినవే. "ఉరిమైక్కురల్" అనే తమిళ చిత్రానికి మూలం తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రం.
ఎంజిఆర్ మొదటి భార్య తంగమణి. రెండవ భార్య సదానందవతి. ఈమె మరణించిన తర్వాత వి.ఎన్. జానకిని పెళ్ళి చేసుకున్నారు.
ఎంజిఆర్ నటించిన సినిమాలలో యాభై చిత్రాలకు పాటలు రాసింది కవి కణ్ణదాసనే.
కణ్ణదాసన్ రాసిన  "అచ్చం ఎన్బదు మడమయడా....అంజామై ద్రావిడ ఉడమయడా" పాట ఎం.జి.ఆర్ స్వరంలో ఎప్పుడూ వినిపిస్తుండేది.
శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ కి 6 కోట్ల 37 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. అయితే ఎం.జి.ఆర్ కి  ప్రభాకరన్ ఎ.కె.47 తుపాకీ కానుకగా ఇచ్చారు.
సిగరెట్ తాగుతున్నట్టు నటించే సన్నివేశాలకు "నో" చెప్పే ఎంజిఆర్ "నినైత్తదై ముడిప్పవన్" సినిమాలో ఓ సన్నివేశంలో సిగరెట్ నోట్లో పెట్టుకుంటారు. కానీ నిప్పంటించారా సిగరెట్టుకి.
"మలైకళ్ళన్" సినిమాలో హుక్కా తాగుతున్నట్టు ఓ సన్నివేశంలో నటించారు. అయితే ఆ సన్నివేశాన్ని సినిమాలో ఉంచాలా వద్దా అనే తర్జనభర్జనలతోనే ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. 
ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత షూటింగుకి సరిగ్గా వెళ్ళగలనో లేదో అని ఆలోచించి ఆ పదవీబాధ్యతల స్వీకారోత్సవాన్ని పది రోజులు వాయిదా వేసుకున్న ఎంజిఆర్ "మదురై మీట్టియ సుందరపాండియన్" సినిమాను ఫూర్తి చేసిచ్చారు.
"కర్ణన్" సినిమాలో శివాజీ గణేశన్ పోషించిన కర్ణుడి పాత్రలో నటించమని ఎంజిఆర్ నే మొదటగా కోరారు దర్శకనిర్మాతలు. కానీ పౌరాణిక చిత్రాలలో నటించకు అని అన్నాదురై చెప్పడంతో "కర్ణన్" సినిమాలో ఎంజిఆర్ నటించలేదు.
ఎంజిఆర్ కు నచ్చిన విలన్లు నంబియార్. అశోకన్. పి.ఎస్. వీరప్పన్, జస్టిన్ పోషించే యుద్ధ సన్నివేశాలలో ఎంజిఆర్ ఖుషీ ఖుషీగా నటించేవారు.
ఆయన సినిమాలలో జంటగా అత్యధిక సినిమాలలో నటించిన కథానాయిక సరోజా దేవి. తర్వాతి స్థానం జయలలితకు దక్కింది.
ఎంజిఆర్ - కరుణానిధి కాంబినేషన్లో "మలైకళ్ళన్" సినిమా అమోఘమైన విజయం సాధించింది. ఈ సినిమాకు తమిళంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి అవార్డు దక్కింది. ఈ సినిమా అనేక భారతీయ భాషలలో అనువదించబడింది.
"కాంజిత్తలైవన్" సినిమాతో తన కండలు  ప్రదర్శించడం మొదలుపెట్టారు.
తైలం మర్దనం చేసుకుని స్నానం చేసినట్టు నటించిన "ఉరిమైక్కురళ్" సినిమా సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 
నాడోడి మన్నన్, ఉలగం సుట్రుం వాలిబన్, మదురయై మీట్టియ సుందరపాండియన్ - ఈ మూడు సినిమాలకు ఎంజిఆర్ దర్శకత్వం వహించీ నటించారు. అప్పటివరకూ తమ సినిమాలలో పార్టీ భావాలను ప్రతిఫలించేలా నటించేవారు. కానీ తాను దర్శకత్వం వహించిన ఈ మూడు సినిమాలలో పాత్రలతో మమేకమై నటించారు.
డిఎంకె పతాకం, ఉదయసూర్యుడు చిహ్నం, అన్నాదురై ఫోటో ఎంజిఆర్ సినిమాలలో తప్పనిసరిగా ఏదో ఒక సన్నివేశంలో కనిపించేవి.
ఎంజిఆర్ ఎందరో పిల్లలకు అండగా ఉంటూ చదివించారు. వారిలో ఇద్దరు ప్రముఖులు - రాజకీయాలలో ఎదిగిన దురైమురుగన్. సినిమాలలో కోవై సరళ.

తమిళ సినిమా అభిమాన ప్రేక్షకుల గురించి 1970లో ఆయన చేసిన వ్యాఖ్యలు "ఆనాటి అభిమాన ప్రేక్షకులలా నేటి ప్రక్షకులు లేరు. పది నిముషాలకో క్లయిమాక్స్ ఆశిస్తున్నారు. అలా ఉంటేనే సినిమా ఆడుతుంది".
"పొన్నియన్ సెల్వన్" అనే కథ ఆధారంగా తమిళంలోనూ ఇంగ్లీషులోనూ సినిమా తీయాలనుకున్నారు. ఇంగ్లీషులో అయితే అన్నాదురైని మాటలు రాసివ్వమని కోరారుకూడా. కానీ ఎంజిఆర్ ఆశ తీరలేదు.
పరిచయం లేని వారైతే వెంటనే కరచాలనం చేసి "నేను ఎంజి. రామచంద్రన్ ని. సినీ నటుడిని" అని పరిచయం చేసుకునేవారు.
రామావరం గార్డెన్స్ లో ఉన్నప్పుడు ఆవులు, మేకలు, కోళ్ళు, కుక్కలు, ఒక ఎలుగుబంటి, సింహం పెంచారు.  వీటన్నింటి సంరక్షణకోసం ఆయన ప్రత్యేకించి ఓ డాక్టర్ ని నియమించారు.
అత్యంత సన్నిహితులను "ఆండవనే" (దేవుడా) అని పిలిచేవారు.

"అడిమైప్పెన్" సినిమా షూటింగుకోసం జైపూర్ వెళ్ళిన ఎంజిఆర్ చలిని దృష్టిలో ఉంచుకుని తెల్ల టోపీ పెట్టుకోవడం మొదలుపెట్టారు. అది బాగుందనుకుని దానిని పెట్టుకునే ఎక్కడికైనా వెళ్ళేవారు.
ఆయన ఇద్దరికి బహిరంగంగా కాళ్ళకు మొక్కి నమస్కరించింది ఇద్దరికి. ఒకరు నటుడు ఎం.ఆర్. రాధా. ఎంజిఆర్ కత్తిసాము, ద్విపాత్రాభినయానికీ ఈయనే స్ఫూర్తి. మరొకరు - హిందీ దర్శకుడు శాంతారాం. ఈయన సినిమాలనే ఎక్కువగా ఫాలో అయ్యేవారు ఎంజిఆర్.
మోచేతుల వరకూ ఉండే సిల్క్ లాల్చీ, లుంగీ ధరించి టోపీ, కళ్ళజోడులేకుండా తన కారుని తానే డ్రైవ్ చేస్తూ అప్పుడప్పుడూ చెన్నైలో ప్రయాణించడం ఆయన అలవాటు. ఇటువంటప్పుడు తననెవరూ గుర్తించేవారు కాదు. టోపీ, కళ్ళజోడు ఉంటేనే తనను గుర్తుపడతారు కాబోలు అనుకునేవారు ఎంజిఆర్.
తల్లి సత్యను ఆరాధించడం కోసం రామావరం గార్డెన్స్ లోనే ఆవిడ కోసం ఓ ఆలయం నిర్మించారు.
"నాన్ ఏన్ పిరందేన్" అనే శీర్షికతో ఆనంద విగడన్ లో ఎంజిఆర్ తన స్వీయచరిత్రకు సంబంధించి సీరియల్ ప్రారంభించారు. కానీ ఇది పూర్తికానేలేదు. కానీ "ఎనదు వాయ్ కై పాదయిలే" (నా జీవిత పయనంలో) అని ఇంకొక సీరియల్ ప్రారంభించారు. అదికూడా పూర్తవలేదు. 
అయితేనేం, ఇప్పటికీ అభిమానుల గుండెల్లో ఆయన జీవిస్తూనే ఉన్నారు. ఆయన గొప్పతనం ఎప్పటికీ ఉంటుంది. ఈ అభిమానానికి ముగింపనేది లేదు.








కామెంట్‌లు