అమ్మ కోసం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

   సోము చదువులో బాగా వెనుకబడేవాడు. తండ్రి చనిపోవడంతో తల్లి కూలిపని చేస్తూ చదివిస్తుంది. నిరుపేద కుటుంబం. అయినా సోముకు బాధ్యత తెలిసి రావడం లేదు. "చదువుకోరా నాయనా! నువ్వు మంచిగా చదువుకొని, మంచి ఉద్యోగం సాధిస్తే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి. సుఖంగా బ్రతుకవచ్చు. చదువులో వెనుకబడితే నువ్వు కూడా నాలాగ కూలిపని చేయాల్సి వస్తుంది. నీ జీవితాంతం కష్టాలు తప్పవు." అన్నది తల్లి. అయినా మనోడు వినిపించుకోలేదు. మళ్ళీ తక్కువ మార్కులు వచ్చాయి. ఇక లాభం లేదనుకుని "ఒరేయ్ సోమూ! ఈసారి మంచి మార్కులు వస్తే కొత్త సైకిల్ కొనిస్తా." అని అన్నది. మళ్ళీ మామూలే.

       ఒకరోజు సోము తల్లి కూలిపనికి వెళ్తుండగా దూరంగా నలుగురైదుగురు పిల్లలతో తన కుమారుడు ఉన్నాడని గమనించింది. రహస్యంగా వెళ్ళి చూడగా తన కుమారుడు వాళ్ళ స్నేహితుల మొబైల్ ఫోన్లో ఆటలు ఆడుతున్నాడు. ఇదేమీ తెలియనట్లు ఉంది తల్లి. నాలుగు రోజుల తర్వాత తల్లి కొడుకును పిలిచి, *ఈసారి నీకు మంచి మార్కులు వస్తే నీకు ఖరీదైన సెల్ ఫోన్ కొనిస్తా." అని వాగ్దానం చేసింది. ఖరీదైన సెల్ ఫోనా? కూలీ పని చేసే నిరుపేద తల్లి ఎలా కొనిస్తుంది అని ఆలోచించాడు. సెల్ ఫోన్ అనగానే ఆశ పుట్టింది? అప్పటి నుంచి తెలివైన విద్యార్థుల సావాసం చేశాడు. తన పరిస్థితిని వివరించాడు. ఆ తరగతిలో తెలివైన విద్యార్థులు సతీశ్, మంజునాథ, శ్రీరాంలు సోమును తమతో పాటు కూర్చోబెట్టుకుని అర్థం కాని విషయాలు చెప్పారు. కంబైన్డ్ స్టడీ చేశారు. సోము పట్టుదల, నిరంతర శ్రమ వల్ల ఆరు నెలల్లోనే తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. తనకు వచ్చిన మంచి మార్కులు తల్లికి చూపించాడు. ",ఇంత మంచి మార్కులు వస్తాయని అనుకోలేదు నాన్నా. నా బంగారు. నాకు ఒక్క రెండు నెలల గడువు ఇవ్వు. నీకు ఖరీదైన సెల్ ఫోన్ కొనిస్తా." అని అన్నది తల్లి. "వద్దులే అమ్మా! నా కోసం నువ్వు అతిగా పొదుపు చేద్దామని కడుపు మాడ్చుకోవద్దు. ఎక్కడా అప్పులు చేయవద్దు. ఆ సెల్ ఫోన్ వ్యసనం లేకపోతేనే ప్రశాంతంగా ఉంది. ఇక నుంచి నేను మంచి సావాసాలు చేసి, కష్టపడి చదువుతా." అని అన్నాడు సోము. తల్లి కొడుకును అక్కున చేర్చుకుంది.

కామెంట్‌లు