చిక్కం! రచన..అచ్యుతుని రాజ్యశ్రీ
 "తాతా!ఆఎద్దు మూతికి ఏంటీ అలా  మూత పెట్టినట్టు బిగించారు?"శివ ప్రశ్నకు "దాన్ని చిక్కం అంటారురా!ఇష్టం వచ్చినట్లు అన్ని చోట్లా గడ్డి గాదం చెత్త కుప్పలపై ప్లాస్టిక్ కవర్లుకూడా తింటోంది.తమ పొలాల్లో చొరబడినది అని  సర్పంచ్ దాన్ని చావచితకబాదాడు.మన మూగప్రాణిని మనమే కాపాడుకోవాలిగదా?అందుకే సీసాకి మూతలాగా దీని మూతికి చిక్కం కట్టాను."తాతజవాబు శివని ఆలోచనలో పడేసింది."మరిపాపం!అది ఎలా తింటుంది?నీరు తాగుతుంది?" "ఆటైంలో చిక్కంని తీసేస్తాను.మనిషి కూడా నోరు అదుపులోకి ఉండేలా పట్టి కట్టుకుంటే మంచిది. వాదవివాదాలు ఉండవు.చెడుపనులు చేయకుండా చేతుల్ని నియంత్రించాలి.చెడువినకు చూడకు మాట్లాడకు అనే గాంధీజీ మూడు కోతులను గుర్తుంచుకోవాలి.కానీ నేడు తెల్లారిందిమొదలు రాత్రి నిద్రపోయే దాకా టి.వి.పేపర్లలో అన్నీభయంకర దృశ్యాలు వార్తలు!అందుకే ఇంటా బైట బడిలో  మంచి కధలు పాటలు పద్యాలు నేర్చుకోవాలి.ఆటలు తోటపని చేయాలి."  "తాతా! మాకు మోరల్ సైన్స్ క్లాస్ లో అన్నీ చెప్తారు.ఏంలాభం!పొలోమంటూ అల్లరి గావుకేకలు!గీబా అని అరుస్తుంటారు."
"ఏమిటిరాశివా! తాతకి నామీద పితూరీలు చెప్తున్నావా?"అన్న గోపి మాటలతో ఉలిక్కిపడ్డాడు.వాడు మహా తుంటరి.9వక్లాస్ చదువుతున్నా డు.పెద్ద అల్లరి మూకకి నాయకుడు. 6వక్లాస్ చదివే తమ్ముడు శివని ఏడిపిస్తాడు.టీచర్లంతా శివాని పొగిడి వాడికి చురకలు అంటిస్తారు.హెడ్ మాష్టారు  వాడిని ఎలా మంచి మార్గంలో  పెట్టాలి అని అధ్యాపకులతో చర్చించారు. గోపీని పిలిచారు"నీవు చాలా చురుగ్గా తెలివిగా నాయకత్వ లక్షణాలు ఉన్న పిల్లాడివి అని అంతా చెప్పారు. నీకు చేతినిండా పని బాధ్యతలు అప్పగిస్తున్నాను.స్కూల్లో ప్రార్ధన నీవే చెప్పాలి.అందరికీ నేర్పాలి.
ప్రతిక్లాస్ కి వెళ్లి కొంత మంది పిల్లలను ఒక్కొక్క పనికి సెలక్ట్ చేసి గ్రూపులు చేయి.కథల క్లబ్ డ్రాయింగ్  తోటపని  ఇలా ఏర్పాటు చేసి  ప్రతిశనివారం  వారు చేసే వాటిని గూర్చి  రిపోర్టు ఇవ్వాలి. పాటలు మిమిక్రీ పద్యాలు నాటకాలు శనివారం లంచ్ తర్వాత పిల్లల కే ఛాన్స్ ఇవ్వాలి.డ్రాయింగ్ వేసిన వారివి అందరికీ కనపడేలా నోటీసు బోర్డులో పెట్టాలి.సూక్తులు  తెలుగు హిందీ ఇంగ్లీష్ లో రోజు  నీవు రాయాలి. "అంతే!గోపి రోజు  అందరికన్నా ముందు వచ్చి  చాలా బిజీగా మారాడు.అంతా ఒకటే ఆలోచించారు.అల్లరి పిల్లలకి పెత్తనం ఇవ్వాలి. బాధ్యతలు అప్పగించాలి. పనిలేని వాడి బుర్ర దెయ్యాల కొంప.మొండి ఘటాలకి  చదువులో వెనకబడిన వారికి ఇలా చేయటంవల్ల వారిలో మార్పు వస్తుంది. చదువుపై ఆసక్తికలుగుతుంది.

కామెంట్‌లు