అట్ల బతుకమ్మ(ఐదవ రోజు);-*శ్రీలతరమేశ్ గోస్కుల**హుజురాబాద్*
పుత్తడి బొమ్మకు పువ్వుల పూజలు..
బతుకు నిలుపు తల్లికి మంగళ హారతులు...

తంగేడు గునుగు చామంతి
మందార గమ్మడి పూలను
కుప్పగా పోసీ...
అయిదంతరాలుగా గుడి గోపురమల్లే పేర్చి
శిఖరాగ్రాన గౌరమ్మను నిలుపగా..
సాగరమల్లే సాగిన చెలియలతో
వాడవాడలా వయ్యారాలన్నీ జోరందుకునే..
రామరామ రామ ఉయ్యాలో...
రామనే శ్రీరామ ఉయ్యాలో...అంటూ  
గౌరీదేవిని కొలువ వచ్చిన కోమలాంగుల హంసనడకలు..
నెమలి  నృత్యాలను చూసి..
అలలై పొంగినది బతుకమ్మ తల్లి సంబరం..

కోట్ల దేవతలంత కొత్త కొలువులకెక్కీ
కొండంత సంబరాలను చూసి
ముచ్చట పడుతుండగా...
ఇంతులందరూ చేరి  ఇంపైన పాటలతో..

ఒక్కేసి పువ్వేసి చందమామ..
ఒక్క జామాయే చందమామ...
రెండేసి పూలేసి చందమామ..
రెండు జాములాయే చందమామ..అంటూ
ఆనందసాగరాన భక్తులు తేలియాడుతుండగా...
నింగి తొంగి చూసేను..
నేల సంతసించేను..
ఊరిచెరువు బతుకమ్మలతో
పూల ముగ్గులేసినట్లాయేను...

ముతైదువలంతా పసుపు కుంకుమలు పంచుకొని
అట్ల వాయనాలు ఆరగించి
ఆనంద నదిలా సాగేను..

  


కామెంట్‌లు