పుత్రవ్యామోహం! అచ్యుతుని రాజ్యశ్రీ

 సతాలీ ఒక  చిన్న రాజ్యం.దాని రాజు భీమసేన్ వీరుడు శూరుడేగాక దానదయాగుణశీలుడు.అతని పరాక్రమం దశదిశలా పాకింది. ఇచ్చినమాటను నిలుపుకునేవాడు. లేక లేక కల్గిన సంతానం ఇంద్రసేన్.వాడిని మహా గారాబం గా సుకుమారంగా పెంచాడు.రాజగురువు ఎప్పుడు హెచ్చరిస్తు ఉండేవాడు."రాజా! పిల్లాడిని  గురుకులానికి పంపు.రాజోచితవిద్యల్లో  వాడికి తర్ఫీదు ఇవ్వాలి. "కానీ కొడుకుని  ఒక్క క్షణమైనా విడిచి ఉండలేక  గురువు మాటను పెడచెవిన పెట్టాడు. 
ఒక రోజు తనకొడుకుని  వేటకి తీసుకుని వెళ్లాడు రాజు. చీకటి పడుతోంది.
ఎక్కడినించో పులి గాండ్రింపు వినపడటంతో ఇంద్రసేన్ కెవ్వుమన్నాడు.పులి రాజు పైకి దూకబోతోంది.ఆధాటికి అతని చేతిలోని కత్తి కింద పడింది. "అయ్యో నాన్నా!"అంటూ తండ్రిని పెనవేసుకోబోతున్న రాకుమారుని పై దాడిచేయబోతున్న పులిని రివ్ న దూసుకు వచ్చిన  ఒక బాణం సర్ న పులి నుదుటగుచ్చుకుని  అది ధబ్  మని నేలకూలటం జరిగింది. తేరుకున్న రాజు కత్తి చేతిలోకి తీసుకుని పులిని చంపాడు. స్పృహ కోల్పోతున్న కొడుకుని "నాయనా!పులి చచ్చింది. భయంలేదు."అని రాజు వాడిని   తట్టి బుజ్జగిస్తుండగా ఒక సన్యాసి అక్కడ ప్రత్యక్షమైనాడు."రాజా!భయపడకు"అని  ఆపిల్లాడి  ముక్కు దగ్గర  ఒక మూలికను ఉంచాడు."సాధుపుంగవా! నాబిడ్డ ప్రాణం కాపాడారు.మీ రుణం ఎలా తీర్చుకోగలను?"రాజు మాటలకు సన్యాసి ఇలా అన్నాడు "రాజా!ఆడినమాట తప్పవుగదా?రాకుమారుని నాతో పంపు.నీవు ఒక్కడివే వెళ్ళి పో!ఇప్పటి నించి  రాకుమారుడు నాకు పుత్రుడు శిష్యుడు."ఆమాటలతో రాజు తల్లడిల్లిపోయాడు.కానీ తను ఆడిన మాట తప్పడు.అందుకే  విచారంగా మొహం వేలాడేసుకుని నగరానికి తిరిగివచ్చాడు. అనుక్షణం  కొడుకు కళ్ళముందే కదలటంతో తిండి తిప్పలు మానేశాడు.రాచకార్యాలు పట్టించుకోటంలేదు. మంత్రి గట్టివాడు కావటంతో పాలన సజావుగా సాగిపోతోంది.కానీ శత్రురాజు హఠాత్తుగా భీమసేన్ పై దాడి చేశాడు. తన సైన్యం కకావికలం అవటంతో రాజు రోషంతో శత్రురాజుని  తనే ఎదుర్కోవటం కోసం భీమసేన్ గుర్రంని అటుగా పరుగులు తీయిస్తున్నాడు.ఎక్కడినించో బాణాలు దూసుకు వచ్చి శత్రురాజు శరీరం ని తూట్లు పొడవసాగాయి.తన బల్లెంతో శత్రురాజు ని చంపేసిన ఒక ముసుగు వీరుడు భీమసేన్ ని సమీపించాడు."నాయనా  నీవెవరివి?నాకు ప్రాణదానం చేయటమే గాక నారాజ్యాన్ని రక్షించావు." భీమసేన్ ఇలా అంటుండగానే రాజగురువు  అతన్ని సమీపించి "రాజా!అతను  ఎవరో కాదు. మన రాకుమారుడు ఇంద్రసేన్. ఆనాడు అడవిలో పులిబారినుండి మిమ్మల్ని కాపాడిన సాధువు మంత్రి కుమారుడు. మీరు పుత్రప్రేమతో ఇంద్రసేనుని విడిచి ఉండలేరుఅన్న సంగతి గ్రహించాను. ఇలా ఐతే కాబోయే మీ సింహాసన వారసుడు  రాజోచితవిద్యల్లో నైపుణ్యం పొందలేడు.అందుకే  రాకుమారుని ఒక పధకం ప్రకారం  గురుకులం లో చేర్పించాను.అన్ని విద్యల్లో ప్రవీణుడైన నీకుమారుడు నీకళ్ల ఎదుటే ఉంటాడు ఇక."అంతే తన కళ్ళు తెరిపించిన గురువు  పాదాలపై వాలాడు రాజు.
కామెంట్‌లు