అన్నాదురై ముచ్చట్లు;-- యామిజాల జగదీశ్
 తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా, డిఎంకె పార్టీ వ్యవస్థాపకుడిగా, రచయితగా, ద్రవిడనాడు పత్రిక సంపాదకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన  అన్నాదురై ( జననం : 1909 సెప్టెంబర్ 15 - మరణం 1969 ఫిబ్రవరి 3) గొప్ప వక్త. తన మాటలతో ఎవరినైనా కట్టిపడేసేవారు. అన్నాదురైని "అరిజ్ఞర్ అన్నా" లేదా " పేరరిజ్ఞర్ అన్నా " అని పిలిచేవారు. 
తొలిరోజుల్లో సి.ఎన్.ఎ అనే మూడక్షరాలతో పరిచయమైన అన్నాదురై తమిళనాడు రాజకీయాలలో మొదటి దళపతిగా ఖ్యాతి గడించారు. పెరియార్ శిష్యుడిగా ఉన్నప్పుడు అందరూ ఆయనను సి.ఎన్.ఎ అనే పిలిచేవారు. ఆ తర్వాత అందరికీ ఆయన "అన్నా" అయ్యారు.
స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే ముక్కుపొడం వేసుకునేవారు. కాలేజీకొచ్చేసరికి వక్కా ఆకూ  వేసుకునేవారు. బయట ఉమ్మడానికి వీలుగా తరగతిగదిలో కిటికీ పక్కన కూర్చునేవారు. ఈ అలవాటు చివరిరోజు వరకూ కొనసాగింది.
"నా జీవితంలో పెరియార్ లాంటి నేతను మరొకరిని చూడలేదు" అంటుండేవారు అన్నా. కొన్నింట్లో పెరియార్ తో విభేదించిన అన్నా "డికె" పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా డిఎంకె పార్టీని ప్రారంభించారు.
అన్నాదురై కాలధర్మం చెందేవరకూ డిఎంకెకు అధ్యక్షుడిని ప్రకటించనే లేదు.
రెండు నెమళ్ళు, రెండు జింకలు, పావురాలు, కుక్కను చివరిరోజు వరకూ ఇష్టంతో పెంచారు. ఆయన చనిపోయిన వారంరోజుల తర్వాత కుక్క ఆయన మంచం చుట్టూ తిరిగి చనిపోయింది. మిగిలిన వాటి సంరక్షణ కోసం తెలిసిన వారికి ఇచ్చేసారు. 
అన్నా - రాణి దంపతులకు పిల్లలు లేరు. దాంతో తన అక్క కుమార్తె సౌందర్య నలుగురు బిడ్డలను దత్తతు తీసుకున్నారు. వారి పేర్లు - పరిమళం. ఇళంగోవన్, గౌతమన్, రాజేంద్రన్.
రోజూ ఉతికి శుభ్రం చేసిన ధోవతి, చొక్కా వేసుకోవాలనేమీ అనుకునేవారు కాదు. ఒకే చొక్కాని రెండు మూడు రోజులు వేసుకునేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాతే తెల్లటి చొక్కా వేసుకునేవారు.
తల దువ్వుకునేవారు కాదు. అద్దం చూసుకునే వారు కాదు. ఉంగరం పెట్టుకునేవారు కాదు. చేతికి వాచీ ఉండేదికాదు. "నన్ను క్యాలండర్ చూడనిచ్చి, గడియారం వంక చూడనిచ్చి పరిస్థితులకు బందీగా మార్చేయకు ఈ ముఖ్యమంత్రి పదవిని" అని అంటుండేవారు అన్నా.
కాంచీపురం పరిధిలోని తేనంబాక్కంలో ఎకరా భూమి, కాంచీపురంలో ఒక ఇల్లు, చెన్నై నుంగంబాక్కంలో ఒక ఇల్లు ఉండేది. ఆయన పోతూ పోతూ మిగిల్చిన ఆస్తులివి.
మూఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆయన మరణించిన నాటికి నుంగంబాక్కం ఇండియన్ బ్యాంకులో ఆయన ఖాతాలో అయిదు వేల రూపాయలు ఉన్నాయి. మైలాపూర్ ఇండియన్ బ్యాంకులోనూ అయిదు వేల రూపాయలు ఉండేవి.
నేత పనిలో దిట్ట. నాకు ఒకింత ఓర్పు ఎక్కువే.  అందుకు కారణం ఈ నేత పనే అని అంటుండేవారాయన. నేసేటప్పుడు నూలు తెగిపోకూడదని నేతపనివాడు ఎంత జాగర్తపడతాడో, ఎంతటి సహనాన్ని పాటిస్తాడో తెలిసిందే కదా అనేవారు.
క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు చెన్నైలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్నాను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తుండగా వద్దని వారించారు. తనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తే మనమే ప్రభుత్వాన్ని కించపరచినట్లవుతుందన్నారు.
రాష్ట్రానికి తమిళనాడు అనే పేరు తీసుకొచ్చింది ఆయనే. అలాగే తమిళం, ఇంగ్లీష్ రెండు భాషల ప్రణాళికను అమలు చేసింది ఆయనే. 
డిఎంకె అధికారంలోకొస్తే తానే ముఖ్యమంత్రి అనే ఆలోచనే లేకుండా దక్షిణ చెన్నై పార్లమెంట్ నియోజకవర్గం నించీ పోటీ చేశారాయన.
ఒక్కొక్కప్పుడు ఆయన ప్రసంగాన్ని వినడం కోసం రెండణాలు వసూలు చేసేవారు కార్యక్రమ నిర్వాహకులు.
దేన్నయినా భరించే 
హృదయం కావాలి!
కత్తులు దూయకు.
బుద్ధి బలాన్ని ఉపయోగించాలి!
దేన్నయినా భరిస్తూ పేదవారు చిందించే  నవ్వులలో భగవంతుడిని చూడాలి!
బాధ్యత - నిజాయితి - క్రమశిక్షణ ఈ మూడూ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి! 
మన్నించుదాం - మరచిపోదాం!  
ప్రజా సేవే భగవంతుడి సేవ! - వంటి మాటలన్నీ ఆయన ఎప్పుడూ చెప్పే వారు. ఇవన్నీ ఆయన నినాదాలు. వీటికనుగుణంగానే ఆయన జీవించారు.
మూర్ మార్కెట్ లో యూనివర్సల్ బుక్ షాప్, హిగ్గిన్ బాథమ్స్ కు వచ్చే ఇంగ్లీషు పుస్తకాలన్నీ తప్పనిసరిగా కొని చదివేవారు. ఒకానొక కాలంలో హిగ్గిన్ బాథమ్స్ లో మైసూరు మహారాజా జయచామరాజ్ ఉడయార్, అన్నాదురై ఎక్కువ పుస్తకాలు కొన్నారట.
తలుపులు మూసిన గదిలో ఒంటరిగా పడుకోవడానికి భయపడేవారు. ఎవరైనా మరొక వ్యక్తి తోడుంటే తప్ప అటువంటి గదిలో పడుకునే వారుకాదు. 
కాంచీపురంలో కోతులు ఎక్కువగా ఉండేవి. దాంతో అవెక్కడ కరుస్తాయోనని భయం భయంగా ఉండేవారు.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అన్నా అప్పటివరకూ తనను విభేదించిన పెరియార్, కామరాజ్‌, భక్తవత్సలం తదితరులను స్వయంగా కలిసి సలహాలు అడిగేవారు. వారు చెప్పినవి విని మనసుకు నచ్చితే తప్పనిసరిగా వాటిని పాటించేవారు.
ఓర్ ఇరవు అనే సినిమాకు మాటలు రాశారు. మొత్తం మూడు వందల అరవై పేజీలు రాశారు. ఇన్ని పేజీలు ఒక్క రాత్రిలో రాశారు.
తాను ఉపన్యసించవలసిన కార్యక్రమానికి ఎప్పుడూ ఆలస్యంగానే వచ్చేవారు. కార్యక్రమం జరిగే చోట వెనుక నిలబడి అందరి ప్రసంగాలు విన్న తర్వాతే ఆయన ప్రసంగించేవారు.
ఆయన మరణించినప్పుడు తరలి వచ్చిన జనసంద్రం రికార్డుపుటలకెక్కింది.
1806లో బ్రిటన్ డిప్యూటీ దళపతి నెల్సన్, 1907లో ఈజిప్ట్ రిపబ్లిక్ అధినేత కమాల్ అబ్దుల్ నాజర్  మరణించినప్పుడు భారీ సంఖ్యలో అంతిమయాత్రకు తరలివచ్చిన జనం తర్వాత అణ్ణాదురై అంతిమయాత్రలోనూ భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. ఇది గిన్నిస్ రికార్డు పుటలకెక్కింది.
గోవా విముక్తికోసం పోరాడి పోర్చుగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మోహన్ రాణడే విడుదల చేయడానికి పూనుకోవాలని పోప్ పాల్ ని  కోరారు అన్నాదురై. జైలు నుంచి విడుదలయ్యాక రాణడే అణ్ణాను కలిసి కృతజ్ఞతలు చెప్పాలనుకుని చెన్నై  వచ్చారు. కానీ అప్పటికే అన్నా మరణించారు. 
అన్నా తన జీవితాన్ని పేదల అభ్యున్నతికి అంకితం చేసిన మహనీయుడు. నిస్వార్థ జీవి. 








కామెంట్‌లు