అరిపిరాల తారావళి;- రామ్మోహన్ రావు తుమ్మూరి
ఏనాటిదొ కవిబంధము
ఈనాటికి మరల ఇటుల ఎత్తెను మనలన్
కానీ యొక రకముగ నిది
పూనిన యా పుడమి వైరి పుణ్యమె చూడన్

సమయోచితముగ పద్యము 
రమణీయముగా రచించు రసహృదయుండై
విమలమనస్కుడు మిత్రుడు
మమనామము గలిగియుంట మతికతిముదమౌ

ఒకరిని జూచింకొకరికి
చెకుముకి తో నిప్పు జేయ చెలగిన రీతిన్
పెకులుచునున్నవి పద్యము
లికయాగునె పద్యవృష్టి ఇంద్రుడు వెరవన్

ధన్యోస్మి కృష్ణ శర్మా
కన్యసుడ కవిత్వమందు కాలిడ భయమౌ
విన్యాసంబులు తెలియవు
అన్యక్షేత్రంబు నాకు అడుగిడ వెరతున్

వర్షపు ధృతి అదియేమో
హర్షము వెలయింప పద్యహరిధనువొదమెన్
కర్షక జనులకు వర్షము
దర్శిత పద్యమ్ము కవికి ధరణిన్ ప్రియమౌ

కామెంట్‌లు