కష్ట పెట్టబోకు!..అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆ పార్క్ లో పిల్లలు గోలగోలగా అరుస్తూ ఆడుతున్నారు. స్కూళ్ళు తెరిచి దాదాపు  నెల కావస్తోంది. పాఠాలు చెప్పుతున్నా పరీక్షలు లేవు.శివ మహాతుంటరి.అక్కడ ఎగురుతున్న సీతాకోకచిలుకలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.చీమల పుట్టలను తొక్కేస్తున్నాడు.గండుచీమలునోట కరుచుకుపోతున్న గింజలని చేత్తోలాగేసి వాటిని నలిపేస్తున్నాడు.లైన్ గా వెళుతున్న చీమల బారుపై నీరు పోసి అవి కకావికలై తన్నుకుంటుంటే చప్పట్లు చరుస్తున్నాడు.ఏడోక్లాస్ చదువుతున్న వాడు మహామొండి పెంకి.ఒక్కడే కొడుకు అని అమ్మా నాన్న  కావలసినంత డబ్బు ఇస్తారు. అమ్మ పెట్టిన టిఫిన్ బాగా లేదని పక్కకు గెంటేసి  రోడ్డు పక్కనే ఉన్న వాటిని కొనుక్కుని తింటాడు.ఇక అమ్మవంట వాడికి ఏంసయిస్తుంది?
 సాయంత్రం కాగానే పుస్తకాలు గిరాటేసి పార్క్ కి పరుగెత్తి  తనలాంటి ఆకతాయిలను పోగేసి ఆడుకుంటాడు."ఒరే శివా!ఎందుకురా మూగజీవులను  ఏడిపిస్తారు?"సాయి అడిగాడు.
 "నీకేంటిరా?మాఇష్టం."వాడిచొక్కా పట్టుకున్న శివని ఎవరో ఆపారు."బాబూ!నీకంటే పెద్ద పిల్లాడిని అలా అవమానించవచ్చా? ఐనా వాడు నిన్నేమన్నాడని?రోజూ చూస్తున్నా.చెట్ల ఆకులు పూలు  తెంపి నలుపుతావు.అవి కూడా ఏడుస్తాయని మన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్  నిరూపించారు కదా? అన్నెంపున్నెం ఎరుగని చీమలను ఎందుకు హింసిస్తావు?అందంగా ఎగిరే సీతాకోకచిలుక రెక్కలను విరుస్తావు?" శివా  పొగరుగా అన్నాడు "ఆ!చెట్ల నిండా బోలెడన్ని  ఆకులు పూలుంటాయి. నేను తెంపితే నష్టం ఏంటీ?మా అమ్మ రోజూ దేవుని పూజకు పూలు తెమ్మంటుంది.అందుకే దొరికిన పూలు కోస్తాను.పక్కింటి ఆంటీ
కయ్ మని అరుస్తుంది. అందుకే ఆమె చూడకుండా కోస్తాను.అమ్మ కి పూజకు పూలు ఉంటే చాలు. పైగా  రెండు రూపాయలు ఇస్తుంది "."ఆరెండు రూపాయలు నీకు ఇచ్చేబదులు పూలమ్మేవారికి ఇవ్వవచ్చుగదా?గుప్పెడు పూలు ఇస్తారు. "ఆ ఆంటీ ప్రశ్నలకు శివా కి ఏంజవాబు ఇవ్వాలో తోచలేదు.కానీ మొండిగా "నాఇష్టం ఆంటీ!పిల్లలకు ఆమాత్రం ఆడి అల్లరిచేసే హక్కు లేదా?"డబాయిస్తూ ఆమె చేతిని పక్కకి తోసేసి పారిపోయాడు.ఆరోజు ఆంటీ పిల్లలందరినీ  పార్క్ లో  ఒకచోట కూచోపెట్టి చిన్న చిన్న పాటలు పద్యాలు నేర్పిస్తోంది.తనతో ఆడే పిల్లలు కూడా ఆమె దగ్గరికి వెళ్లారు. వాడికి ఓమూల బుజ్జి కుక్కపిల్లలు కనపడ్డాయి.వాటిని సమీపించాడు.తల్లికుక్క  వాడిని చూస్తూనే  బొయ్ మని మొరిగింది.అంతే  భయంతో పరుగు అందుకున్నాడు. కానీ హడావిడిలో కాలికి రాయి తగిలి బోర్లబొక్కలా పడ్డాడు. నుదుటినుంచి రక్తంకారసాగింది.పెదాలుచిట్లాయి.ఇంతలో  సాయి మిగతా పిల్లలు వచ్చి శివాని లేవదీశారు.గాయాన్ని శుభ్రం చేశారు. ఆంటీ  వాడితల మొహం శుభ్రం చేస్తూంటే"ఆంటీ!జుట్టు పీకకండి.నెప్పి!"ఏడవసాగాడు."శివా!జుట్టుకి ప్రాణంలేదుకదా?జుట్టు ఊడితే కొత్త జుట్టు వస్తుంది. రోజూ నీవు సీతాకోకచిలుక చీమలు చెట్లు  అన్నీ నలిపి కాలరాస్తావు.అవి ఎంత గిలగిలలాడిపోతాయో చూస్తూ ఆనందంతో గంతులేస్తావు.మనభాషలో ఏడవటంరాదు.మీఅమ్మ నాన్నలకు వచ్చి చెప్తాను .""ప్లీజ్ ఆంటీ!నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడూ తుంటరి పనులు చేయను."అప్పుడే పార్క్ లోకి వచ్చిన శివ తల్లి అంది"చక్కగా గీతోపదేశం చేశారు అమ్మా!తండ్రి భయంలేదు.నామాటవినడు.అందుకే  రోజూ  మీఇంటికొచ్చి మొరపెట్టుకుంటున్నాను."
ఆంటీ అంది"శివా!ఈపద్యం నేర్చుకో!కష్ట పెట్టబోకు కన్నతల్లి  మనసు..నష్ట పెట్టబోకు నాన్న పనులు!" "ఆంటీ!మాకూ నేర్పండి "అరిచారు పిల్లలు అంతా!
కామెంట్‌లు