సారంగదేవుని ఔదార్యం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మేవాడ్ మహారాణా  రాయమల్ అతని పెదనాన్న కొడుకైన సారంగ దేవ్ మధ్య చిన్న అభిప్రాయభేదం వచ్చి  మాటామాటా అనుకున్నారు.ఆరోజుల్లో రాజపుత్రులు ధైర్యసాహసాలకేగాక ఆత్మాభిమానంకి కూడా పెద్ద పీట వేసేవారు. రాణాని ఎదిరించవద్దు అని  సారంగునికి ఎంతో మంది నచ్చచెప్పినా  కయ్యానికి కాలుదువ్వాడు. రాణాకి  తను  పరిపాలన చేసేవాడిని  అనే దురహంకారం చాలా ఉంది. అందుకే తన కొడుకు పృధ్వీరాజుని"బాబాయి పై యుద్ధం చేసి విజయుడివై తిరిగిరమ్మని ఆదేశించాడు. రాజపుత్రులు  తండ్రి మాటను జవదాటేవారుకాదు.బాబాయి సారంగదేవుని  కోటను హఠాత్తుగా చుట్టుముట్టాడు. సాయంత్రం దాకా హోరాహోరీ పోరు సాగింది. చీకటి పడగానే యుద్ధ నిబంధనల ప్రకారం పోరు ఆపారు.పృధ్వీరాజు తన డేరాకి వచ్చి యుద్ధదుస్తుల్ని తీసివేసి  మామూలు వస్త్రాలు ధరించి  సారంగదేవుని కోటవైపు నడిచాడు. అతన్ని చూస్తూనే  కాపలావారు ఏదో ఆపద రాబోతోంది అని భేరీ మోగించారు. అదివింటూనే సారంగ బైటికి వచ్చి ఒంటరిగా నిలబడిన  పృధ్వీ ని చూశాడు. బాబాయి కి అభివాదం చేసి పృధ్వీ అన్నాడు"బాబాయి!ఈరాత్రి మీ ఇంట్లో భోజనం చేస్తాను. మీరు ఉండగా  నా గుడారంలో అన్నం ఎందుకు తినాలి?"అతన్ని గుండెలకు హత్తుకుని "నాయనా!నేనే నీకు భోజనం పంపాలనుకున్నాను"అని ఆదరంగా ఆహ్వానించాడు.భోజనశాలలో అన్నీ వడ్డించి సిద్ధంగా ఉన్నాయి.ఇంతలో గబగబా ఒక సేవకుడు వచ్చి సారంగముందు ఉన్న పళ్ళెం ని 
పృధ్వీ ముందు   అతని పళ్ళెం ని సారంగదేవుని ముందు మార్చాడు.
సారంగదేవునికి తటాలున ఏదో ఆలోచన తళుక్కుమంది. "నాయనా!మనిద్దరం  నా కంచంలోదే తీసుకుని తిందాం"
అని పృధ్వీది  నేలకేసి గిరాటుకొట్టాడు.సరిగ్గా ఒక పిల్లి అక్కడికొచ్చి కింద పడింది తిని గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది. "బాబాయి!నీదెంత. మంచి మనసు?నేను నీతో యుద్ధం చేసినా  నన్ను ఆదరించారు. కమ్మని భోజనం పెట్టారు. ప్రాణభిక్ష పెట్టారు."అని కొనియాడాడు.దానికి సారంగ ఇలా అన్నాడు "నాయనా పృధ్వీ!శత్రువుని మోసంతో చంపరాదు.నీవు  నాపుత్రుడివి.నాకు మీనాన్న పై ద్వేషం లేదు. అతని దురహంకారం  గర్వం నాకు నచ్చవు.కేవలం  అతను అన్న ఒకేఒక మాటకు బాధ పడి  నేను యుద్ధం చేస్తున్నాను." "బాబాయి!ఒక్క మాటకోసం మీరాజ్యాన్ని ప్రజలను ఎందుకు కష్టపెడుతూ ధన ప్రాణనష్టం చేస్తున్నారు?నాన్నని ఒప్పించి ఈపోరాటం ఆపుతాను." "వద్దు బాబూ!యుద్ధం తోనే ఈసమస్య పరిష్కారం అవుతుంది. రేపు సమరానికి సిద్ధంగా ఉండు"అని పృధ్వీని  సాదరంగా అతని డేరాదాకా సాగనంపాడు.
 ఘోర యుద్ధం జరిగింది. సారంగదేవుడు బాగా గాయపడ్డాడు.కొన ఊపిరి తో ఉన్న అతనిని పృధ్వీ దీనంగా ఆర్తితో అడిగాడు "బాబాయి!ఇప్పటికైనా నీమనసులోని మాట చెప్పవా?" "పృధ్వీ!మీనాన్న  అందరిముందు  నన్ను  పిరికివెధవా అని అవమానించాడు. సారంగదేవుడు పిరికివాడు కాదు అని నిరూపించాలనే నేను  యుద్ధం చేశాను. నేను  మీనాన్నకి వైరి శత్రువు ని కాదు నాయనా!"అంటూ శాశ్వత నిద్ర లోకి ఒరిగాడు. పృధ్వీరాజు  జరిగింది అంతా తండ్రి కి చెప్పి  భోరున విలపించాడు.ఏంలాభం!?అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. మహారాణా కళ్ళల్లో ఆగని కన్నీరు  పశ్చాత్తాపం!!
కామెంట్‌లు