అతడిలోని మనిషి ...!! >డా.ఏ.వి.నరసింహరావు > హైదరాబాద్.

 ఆఫీసు పని కోసం ఆంస్టర్డామ్ నగరం వచ్చి ఇవ్వాలిటికి నాలుగు రోజులు అయ్యింది. కావలసిన వారందరూ సహకరించడం వల్ల, వారం రోజుల్లో కావలసిన పని నాలుగు రోజుల్లో పూర్తి చేసి కొని , మిగతా రోజులు చుట్టూ ఉన్న వింతలు విశేషాలు చూసే పని పెట్టుకున్నాడు రాజేశ్వర్. తను ఫ్రెష్ అయ్యి,రిసెప్షన్ కు ఫోన్ చేసి రేపటికి మంచి డ్రైవర్ తో కారును ఏర్పాటు చేయమని చెప్పి తన ప్రయాణం ప్రణాళిక ఒక కాగితంపై వ్రాసుకున్నాడు. ఉదయం ఏడు గంటలకు బ్రేక్ ఫాస్ట్ తినేసి మొదట 'హేగ్ 'వెళ్లి అక్కడ నుండి రోటర్డాము సీ పోర్ట్ చూసి, అక్కడ నుండి దగ్గరలో ఉన్న పాతకాలపు గాలి మరల పని తీరుని పరిశీలించి, ఫోటోలు తీసుకొని తిరుగు ప్రయాణం లో మధ్య మధ్య ఉన్న వింతలు విశేషాలు చూసి రాత్రి భోజనం సమయం వరకు హోటల్ చేరడం . మరోసారి ప్రోగ్రాం సరి చూసికొని లైట్ ఆఫ్ చేసి నిద్రకు ఉపక్రమించాడు రాజేశ్వర్. 

రాజేశ్వర్ ఒక అంతర్జాతీయ బ్యాంకింగ్ కంపెనీ దక్షిణాసియా కార్పొరేట్ లోన్స్ విభాగం అధిపతిగా పని చేస్తున్నాడు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి యం బి యే పూర్తి చేసి సిటీ బ్యాంకులో పది సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్ గా చేసాక, తను సాధించిన విజయాలు తెలిసికొని ఇప్పటి కంపెనీ దక్షిణాసియా కార్పొరేట్ లోన్స్ విభాగం అధిపతిగా నియమించింది . ఆ పని మీదే రాజేశ్వర్ అమెస్టర్డామ్ రావడం జరిగింది. 
ఉదయం ఏడు గంటలకు హోటల్ రిసెప్షన్ నుండి కాల్ రాగానే, తన దగ్గరున్న నికాన్ యస్ యల్ ఆర్ కెమెరా, బ్యాకప్ పవర్ బ్యాంకు, బైనాక్యూలర్స్ తీసుకుని క్యాజ్వల్ డ్రెస్ లో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళే సరికి, రిసెప్షనిస్టు తన కోసం ఎదురుచూస్తూన్న కార్ డ్రైవర్ని పరిచయం చేసాడు. ఇద్దరు కలిసి పార్కింగ్ లో ఉన్న టెస్లా కార్ ని తీసుకుని బయలుదేరారు.
సరిగ్గా ఎనిమిది గంటలకు అమెస్టర్డామ్ నగరపు సిమెంటు రోడ్డు పై టెస్లా కారు పాములా జారిపోతుంది. రోడ్డుకు ఒక వైపు వెడల్పైన నీటి కాలువ, మరోవైపు నాలుగంతస్తుల భవనాలు. నీటి కాలువల్లో తేలియాడుతున్న రకరకాల బోలెడన్ని బోట్లు. బోట్ల నిండా నగర సందర్శనం కోసం దేశ వి దేశాల నుండి వచ్చిన సందర్శకులు. యూరప్ ప్రాచీన మరియు ఆధునిక నాగరికత సమ్మేళనంతో కట్టిన ఇళ్లు మరియు వ్యాపార సముదాయాలు. పచ్చని చెట్లు, చల్లటి గాలి, హడావిడి లేకుండా చేతుల్లో చేయివేసికొని నడిచే జంటలు. 
రోడ్డుమీద ఎన్ని కార్లూ ఉన్నాయో,అంతకు రెట్టింపు బోట్లల్లో సందర్శకులు పర్యటిస్తున్నారు. రాజేశ్వర్ అక్కడక్కడ కారు ఆపుతూ అక్కడిఅందాలను తన కెమెరాలో బంధిస్తూముందుకు కదూలుతున్నారు.
రెండు గంటల తర్వాత టెస్లా కారు  అమెస్టర్డామ్ నగర వీధులు దాటి ఎనిమిది లైన్ల హైవే చేరి నిశ్శబ్దం గా గంటకి నూటయబై కిలో మీటర్లు వేగం తో పయనిస్తుంది. చుట్టూ కొన్ని కిలో మీటర్ల దూరం వరకు గోధుమ పొలాలు. అక్కడక్కడ పచ్చటి పూలతో ఆవాల పంటలు, ఎప్పుడో ఓ సారి కనపడే మనుషులు. తన కారుని నిశ్శబ్దంగా దాటుకుంటూ వెళ్ళే కార్లూ. చల్లగా ఆహ్లాదంగా వున్న వాతావరణంలో,రాజేశ్వర్ గత నాలుగు రోజుల శ్రమను మరిచి పోయాడు. చిన్న పిల్లవాడిలా అన్ని మరిచి ఆ పరిసరాల అందాలను ఆస్వాదిస్తున్నాడు. 
కారు హైవే నుండి ప్రక్క రోడ్డు గుండా నగర ప్రవేశం చేసి మరి కొద్ది సేపు పయనించి ఒక విశాలమైన ప్రాంగణం లో వున్న పురాతన కాలంలో కట్టిబడ్డట్టు కనిపిస్తున్న భవనం పార్కింగ్ లో ఆగింది. డ్రైవర్ దిగి కారు డోర్ తెరిచి నిలబడితే, ఏంటన్నట్టూ చూసాడు రాజేశ్వర్. ' సార్ హేగ్ చేరుకున్నాం. ఇదే మీరు చూడాలనుకున్న ఇంటర్ నేషనల్ క్రిమినల్ కోర్టు '. అప్ప టికి గాని తను చాలా రోజుల నుండి కలలు కనే వ్యవస్థను చూసే అవకాశం దొరికిందనే స్పృహకు రాలేదు. వెంటనే కారు దిగి ఆ పరిసరాలు చూసి కోర్టు లోనికి వెళ్లాలనుకుంటే కోర్టుకు సెలవులని అనుమతించలేదు. అక్కడ రాజేశ్వర్ కు ఒక దీపం వెలుగుతుండడము, దాని గూర్చి రాసిన బోర్డు చూసి చాలా బావోద్వేగానికి గురి అయ్యాడు. ఆ దీపం చుట్టూ ఉన్న స్థలం లో వివిధ దేశాల దేశాల నుండి తెప్పించిన రాళ్ళు వరసగా పేర్చి ఉన్నాయి.అందులో మన దేశం నుండి తీసుకుని వచ్చిన రాయిని చూస్తే గర్వంగా ఉంది రాజేశ్వర్ కు. 
ఫోటోలు తీసుకొన్న తరువాత రాజేశ్వర్ కు ఆకలి అవడం తో టైము చూసుకుంటే, మధ్యాహ్నం ఒంటి గంట చూపించిఉంది సెల్ ఫోన్. కారు దగ్గరకు వచ్చి దగ్గర ఉన్న ఏదైనా మంచి హోటల్ చూపమని డ్రైవర్ ని అడిగాడు. డ్రైవర్ మాట్లాడకుండా దగ్గర లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ కి తీసుకుని వెళ్ళాడు. తను రెస్టారెంట్ లో కి వెళ్లేముందు, డ్రైవర్ ని కూడా భోజనానికి రమ్మనిపిలిచాడు. అయితే డ్రైవర్ సున్నితంగా నిరాకరించడం తో అతని పై కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. అతన్ని దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని రెస్టారెంట్ లో కి తీసుకుని వెళ్ళి తన ఎదురు గా కూర్చోబెట్టి అతన్ని పరిశీలనగా చూసాడు. అతను దాదాపు అరవై ఏళ్ళ పైబడి బక్క పల్చగా ఆసియన్ సంతతికి చెందిన వాడుగా ఉండటం తో అతని గురించి వివరాలు తెలిసికొనే ప్రయత్నం మొదలు పెట్టాడు రాజేశ్వర్. 
"మీరు ఇక్కడి సిటిజెనా?"
"అవును, అసలు మా ది బంగ్లాదేశ్ లోని ఢాకా సిటీ కి రెండొందల మైళ్ళ దూరంలోని ప్రాంతం. అయితే 1971 బంగ్లాదేశ్ విమోచనప్పుడు, యుద్ధం సమయం లో, పాకిస్తాన్ సైన్యం వేసిన బాంబులకు మా ఊళ్లో చాలా మంది చనిపోయారు. మా కుటుంబం కూడా ఆ దాష్టికానికి బలయింది. ఆ టైమ్ లో నేను ఇంట్లో లేనందుకు బ్రతుకు బయట పడ్డాను. ..." ఒక నిమిషం ఆగి ఆగి మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు డ్రైవర్ ఫజల్. 
" మా పెదనాన్న గారి అబ్బాయి అప్పటికే ఇక్కడ చిన్న చితకా వ్యాపారం చేసే వాడు. బంగ్లాదేశ్ లో పరిస్థతితులు చక్కపడ్డాక, నన్ను ఇక్కడి పిలిపించి కొని, అతని వ్యాపారం లో పనికి పెట్టుకున్నాడు,
మరో రెండు సంవత్సరాలకు నా కు పి. అర్. వీసా రావడం జరిగింది. తరువాత అయిదు ఆరేళ్లకు సిటిజెన్ షిప్ రావడం, పెళ్ళి, పిల్లలు, పిల్లల చదువులు, అలా రోజులు గడిచిపోతున్నాయి "
"మరి ఈ వయస్సులో మీరు ఇంత దూరం డ్రైవర్ గా రావడం ఏంటి....." మధ్య లోనే ఆపేశాడు రాజేశ్వర్. 
"బ్రతుకు పోరాటం చేయాలి కదా!" అంటూ ఆగి పోయాడు ఫజల్. 
" మరి మీ పిల్లలు.....?"
" అవును, మా పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటు స్వంత ఇండ్లు కొనుక్కుని సంతోషంగా నే వున్నారు. ...." అన్నాడు.
"అయితే మీరు వాళ్ళతో ఉండొచ్చు కదా....!?"
"అవును, ఉండొచ్చు, పిల్లలు నా వాళ్ళు నన్ను బాగానే చూస్తారు, కానీ వాళ్ళ ఇంటోళ్ళు, ..." అంటూ ఆగి పోయాడు ఫజల్. 
"వాళ్ళ మధ్యలో ఉండి రోజు గొడవ పడడం కన్నా, దూరంగా ఉండి సుఖంగా ఉండటం మంచిదని మా ఇంటావిడ నన్ను వొప్పించింది. అప్పుడి నుండి మా బ్రతుకు మేము బ్రతుకుతున్పాము. " అన్నాడు
" నేను నెలకు పది రోజులు ఇలా డ్రైవర్ గా పని చేస్తే మా ఇద్దరికీ నెల గడిచిపోతోంది....."అంటూ
ఫజల్ చెప్పుకుంటూ పోతున్నాడు. ఇంత లో ఆర్డర్ చేసిన పదార్థాలు రావడం తో భోజనం పూర్తి చేసి రోటర్డాము వైపు బయలు దేరారు. అయితే ఇప్పుడు రాజేశ్వర్ వెనుక సీట్లో కూర్చోలేదు. ముందు సీట్లో డ్రైవర్ ఫజల్ ప్రక్కన కూర్చొని అతనితో గౌరవంగా అక్కడి విశేషాలను అడిగి తెలుసుకుంటున్నాడు.

కామెంట్‌లు