సత్యమేవజయం;-సత్యవాణి కుంటముక్కుల
ఆవు ఒకటి అడవిలోకి
మేతమేయ వెళ్ళెను

సాటి ఆవు లన్ని కూడ
సాయంత్రం మళ్ళెను

చిక్కు పడెను అడవిలోన
చిమ్మచీకటాయెను

పులి ఒక్కటి ఎదురాయెను
పట్టి తినగ వురికెను

హడలి పోయె ఆవు అంత
అడిగె ప్రాణ బిక్షను

కుదరదనెను పులి అంత
కౄరముగా అరచెను

పులి రాజా నాకు కలదు
పుట్టి నట్టి బిడ్డ ఒకతె

మూడు నాళ్ళు మాత్రమాయె
ముద్దు బిడ్డ పుట్టినాకు

ఒక్కసారి పోయి వత్తు
ఒద్దికగా వుండ నేర్పి

కడుపు నిండ పాలు ఇచ్చి
కదిలివత్తు మరల నేను

కరుణ తోడ నన్ను వదల
కాలిదండమిడుదు ననెను

జాలి కలిగె పులికి అంత
జాగు లేక పోయిరమ్మనె

పరుగు పరుగు పోయెనావు
పట్టి పాలు కుడపగా

మంచి చెడ్డ చెప్పి ఆవు
మరల వచ్చె పులి చెంతకు

ఆశ్చర్యమున వ్యాగ్రం
అక్కజ పడెనంతట

ఎంత మంచిదానవమ్మ
ఎరుగను నేనింత వరకు

సత్యమునకు నిలచి నావు
సంతసము కలిగె నాకు

పొమ్ము నీదు బిడ్డ కడకు
పొందికగా బ్రతకండనె

సత్యమేవ జయతనెను
సత్య దేవతై వ్యాగ్రం

సాగిలబడి మ్రొక్కి గోవు
సంతసమున చనెనంత   
    
                    

కామెంట్‌లు