ఆయన సేకరణ అపూర్వం !గాంధీజీ స్టాంపులూ, పోస్టు కార్డులూ!!:-- యామిజాల జగదీశ్
 కోయంబత్తూరుకి చెందిన తపాలా శాఖ మాజీ ఉద్యోగి ఒకరు గాంధీకి చెందిన అరుదైన ఫోటోలు, పోస్టల్ డిపార్టుమెంట్ వారు ముద్రించిన గాంధీ స్టాంపులను సేకరించి పలువురి దృష్టిని ఆకర్షించారు.
ఇందుకుగాను ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డు కూడా లభించింది. ఈయన రిటైర్డ్ పోస్ట్ మాస్టర్.
వాట్సప్, ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రాం వంటి సామాజిక మాధ్యమాల ద్వారా క్షణాల్లో అనుకున్న వారికి సమాచారం చేరవేసే ఈ హైటెక్ యుగంలో పరస్పరం ఎన్నో విషయాలు పంచుకున్నప్పటికీ పోస్టుమ్యాన్ నుంచి అందుకున్న పోస్ట్ అది కార్డో ఇన్లాండ్ లెటరో ఎన్వలప్పో ఏదైనా కావచ్చు చదవగా కలిగే ఆనందానుభూతే వేరు. ఆరోజులు ఇప్పుడు లేవు. ఉత్తరాలు రాసేవారే లేరు. 
మనసుకిష్టమైన వారి సంతోషాలనూ, ఆవేదననూ మోసుకుంటూ వచ్చి పోస్ట్ మ్యాన్ అందించే పోస్ట్ ఎంత విలువైనవో మాటల్లో చెప్పలేం. అవి అమూల్యం.
అయితే ఇక్కడ నేను చెప్పబోయే వ్యక్తి ఒకింత భిన్నమైన వారు. జాతీయస్థాయిలో అవార్డు పొందిన పోస్టల్ శాఖ ఉద్యోగి హరిహరన్ సేకరణలో గాంధీజీ ఫోటోలు, పోస్టేజ్ స్టాంపులు ఉన్నాయి. ఆయన సేకరణలో ఒకటి 1951లో అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి పురస్కరించుకుని (82వ జయంతి) విడుదల చేసిన గాంధీజీ చిత్రంతో కూడిన ఓ పోస్ట్ కార్డు ఉండటం విశేషం.
ఈ పోస్ట్ కార్డు ఆవిష్కరణ చేసినప్పుడు దాని వెల తొమ్మిది పైసలు. అలాగే ఒకటిన్నర అణా ఖరీదుచేసే పోస్టల్ స్టాంప్ కూడా ఆయన దగ్గర ఉంది. ఇది గాంధీజీ ఎనబయ్యో జయంతి సందర్భంలో ముద్రించారు. అప్పుడే పది రూపాయల నోటు కూడా ముద్రించారు. ఈ నోటుపైనా గాంధీజీ చిత్రముంది.
ఇతర పోస్టు కార్డుల కన్నా ఈ కార్డు కాస్త భిన్నమైనది. ఈ కార్డుకి విశేష ఆదరణ లభించిందికూడా. అందుకే దీనిని ఒకటిన్నర అణాకు అమ్మారు. ఇప్పుడీ కార్డు వయస్సు డెబ్బై ఏళ్ళు.
హరిహరన్ మాటల్లో....
"సాధారణంగా దేశానికి అంకితమైనవారినీ దేశానికి వన్నె తెచ్చినవారినీ గౌరవించే రీతిలో పోస్టల్ శాఖ స్టాంపులు, ఫస్ట్ డే కవర్లు వంటివి విడుదల చేస్తుంటుంది. భారత దేశ స్వాతంత్ర్య పోరాటానికి సారధ్యం వహించి భారతీయులనెందరినో ఒక తాటిపైకి తీసుకొచ్చి జాతిపితగా పిలువబడే గాంధీజీ స్మృత్యర్థం ఎనభై ఏడు దేశాలుపైనే ఆయన చిత్రంతో పోస్టు కార్డులను ముద్రించాయి. నాకు తెలిసినంత వరకు అంతర్జాతీయ స్థాయిలో మరే నాయకుడికీ ఇంతటి గౌరవమర్యాదలు దక్కలేదు. ఇక మన దేశం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పోస్ట్ కార్డుని కరెన్సీ నోట్లను ముద్రించే నాసిక్ ప్రెస్ లో ముద్రించారు. అలాగే గాంధీజీ (1869 - 1948), కస్తూరిబా (1869 - 1944) కలిసున్న ఫోటోతో కూడిన పోస్ట్ కార్డుని కేంద్ర ప్రభుత్వం 1969లో అక్టోబర్ 2వ తేదీన ముద్రించింది. మన దేశంలో విడుదలైన ఓ దంపతులపై విడుదలైన తొలి పోస్ట్ కార్డు ఇదే. గాంధీజీ శతజయంతి సందర్భంగా ఇది విడుదల చేశారు. దీని ధర ఇరవై పైసలు. ఇలాగే నేను సేకరించిన వాటిలో గాంధీకి సంబంధించిన అరుదైన సమాచారం, పోస్ట్ కార్డులు, స్టాంపులు ఉన్నాయి. అహింస గురించి గాంధీజీ తన భార్యకు ఎప్పుడూ బోధించేవారు. ఆయన పోరాటానికి ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ, నిరాహార దీక్షలోనూ పాల్గొన్నారు. ఆమె 1944లో ఫిబ్రవరి 22వ తేదీన కన్నుమూశారు. స్వాతంత్ర్యం ముందు వరకూ రాజవంశీకుల దంపతుల చిత్రాలను మాత్రమే స్టాంపులుగా ముద్రించారు. స్వాతంత్ర్యం తర్వాత మన దేశానికి చెందిన దంపతులుగా గాంధీజీ, కస్తూరిబా చిత్రాన్ని తొలిసారిగా ముద్రించారు" అంటూ అనేక విషయాలు పంచుకున్నారు.
పోస్టల్ డిపార్టుమెంటువారు 1984లో ప్రవేశపెట్టిన మేఘదూత్ అవార్డుని మొదటిసారిగా హరిహరన్ కే ఇచ్చారు. ఆయనకు ఈ డిపార్టుమెంటు నుంచి మొత్తం ఆరు అవార్డులు లభించాయి. 
1952 అక్టోబర్ రెండో తేదీన గాంధీజీ, కస్తూరిబా కలిసున్న చిత్రంతో ఓ పోస్ట్ కార్డుని ముద్రించారు. మిగిలిన పోస్ట్ కార్డులు ఓ చిన్నారిని ఎత్తుకున్న గాంధీజీ, రాట్నంతో గాంధీజీ వంటి చిత్రాలతో ముద్రించారు. హిందీ, ఉర్దు స్టాంపులపైన "బాపూ" అనే మాట ముద్రించేలా చేసింది జవాహర్ లాల్ నెహ్రూ అని హరిహరన్ గుర్తు చేశారు. 1924లో ఆయన ఐక్యతకోసం చేసిన నిరాహార దీక్ష చేసినప్పటి సంఘటనను, 1930 మార్చి నెలలో చేసిన దండి యాత్ర గుర్తుగానూ ముద్రించిన స్టాంపులు ఆయన దగ్గర ఉన్నాయి. గాంధీజీ సత్యాగ్రహాన్ని గుర్తు చేసే రీతిలో 2007 అక్టోబర్ రెండో తేదీన ముద్రించిన నాలుగు స్టాంపులుకూడా ఆయన సేకరణలో ఉన్నాయి. మన దేశం తర్వాత గాంధీజీపై స్టాంపులను ముద్రించిన మొదటి దేశం అమెరికా. నాలుగు సెంట్లు, ఎనిమిది సెంట్లకు అమెరికా ఈ స్టాం
పులను విక్రయించింది. గాంధీజీ దండి మార్చ్ దాదాపు 385 కిలోమీటర్ల మేరకు సాగింది. అహ్మదాబాద్ లో ఈ యాత్ర మొదలైంది. 
1948 ఆగస్ట్ 15వ తేదీన మహాత్మా గాంధీపై ముద్రించిన ఫస్ట్ డే పోస్టల్ కవర్ కూడా హరిహరన్ సేకరణలో ఉంది.
ఆయనకు గాంధీజీ అంటే ప్రాణం. 

కామెంట్‌లు