నలుగురుండాలి!!:-- యామిజాల జగదీశ్

 ఇంత కాలానికి ఈ మాటలోని ఆంతర్యం బోధపడింది. అదీనూ నా మిత్రుడి తల్లి పోయిన మరుసటిరోజు తెలిసింది.
జొన్నలగడ్డ లక్ష్మీ నరసింహారావుగారితో నా పరిచయం యాభై ఏళ్ళ క్రితం నాటిది. మద్రాసులో వారుండిన బజుల్లా రోడ్డు (టీ.నగర్) లోనే నేను పుట్టి పెరిగింది. మా ఇంటి నుంచి ఓ ఏడెనిమిది ఇళ్ళవతల వాళ్ళుండేవారు. వాళ్ళ నాన్నగారు డాక్టర్. పేరు నాగేశ్వరరావుగారు. వాళ్ళమ్మగారి పేరు వెంకటలక్ష్మిగారు. ఈనెల ఒకటో తేదీన కాలధర్మం చెందిననాటికి ఆవిడ వయస్సు నూట నాలుగేళ్ళు. 
ఇటీవలే ఆవిడనొకమారు అనుకోకుండా కలిసాను. 
బాలాంత్రపు రజనీకాంతరావుగారి కుమారుడు వెంకోబ రావుగారిని కలవడం కోసం సాయినాధ పురం (హైదరాబాద్) వెళ్ళాను. ఆయనతో ఓ గంట మాట్లాడి వస్తూ వస్తూ నరసింహారావుగారింటికి వెళ్ళినప్పుడు ఆవిడను చూశాను. ఉన్న  ఇరవై నిముషాలలో ఓ పది నిముషాలు ఆవిడ మాట్లాడారు. ఈసారి వస్తున్నప్పుడు మీ ఆవిడతో రా. మీ పెళ్ళయిన కొత్తలో మీ ఆవిడతో మా ఇంటికొచ్చి పరిచయం చేశావు. ఆ తర్వాత మళ్ళా చూడలేదు"  అన్నారు. ఈమారు రేణుకతో వస్తానన్నాను. కానీ తీసుకెళ్ళలేకపోయాను. 
ఈమధ్యలో నరసింహారావుగారి నుంచి ఫోన్. మా అమ్మగారిని ఆస్పత్రికి తీసుకెళ్ళాం. ఇక ఎక్కువ రోజులు ఉండరని డాక్టర్లు చెప్పేశారు. ఇంటికి తీసుకుపొమ్మన్నారు. కనుక నీకు వీలున్నప్పుడు ఓరోజు ఇంటిరా అన్నారు. అలాగే అని చెప్పాను. కానీ వెళ్ళలేదు.
ఇంతలో అక్టోబర్ ఒకటో తేదీ సాయంత్రం  ఆరున్నర  ప్రాంతంలో నరసింహారావుగారి నుంచి మెసేజ్ ....అమ్మ పోయిందంటూ. 
అక్టోబర్ రెండో తేదీ ఉదయం నరసింహారావుగారింటికి వెళ్ళాను, ఆవిడ చివరి చూపు చూడటం కోసం. వెళ్ళాను. నమస్కరించాను ఆవిడ భౌతికకాయానికి. పడుకున్నట్టే ఉన్నారే తప్ప ముఖాన ఇకలేరన్నట్టుగా అన్పించలేదు చూస్తుంటే. 
ఎవరైనా పోయినప్పుడు వారి సంబంధీకులను పలకరించడం నాకస్సలు తెలీదు. అందుకనే నరసింహారావుగారి భుజంమీద చెయ్యేసాను వచ్చానని చెప్పడానికి గుర్తుగా. వాళ్ళమ్మగారి ఆఖరి క్షణాలు కళ్ళకు కట్టినట్టు చెప్పారు నరసింహారావుగారు. 
ఇక ఇంట్లో నుంచి తార్నాకలో ఉన్న చంద్రమతి శ్మశాన వాటికకు తరలించే ఘడియలు సమీపిస్తుండగా నరసింహారావుగారి చెల్లెలు సుమతి తమ అమ్మగారి భౌతికకాయాన్ని  మోయడానికెవరొస్తారు...నలుగురు కావాలి అని అనడంతోనే నేనొస్తానన్నాను. 
నేను, శివ (నరసింహారావుగారి కుమారుడు), విద్యాసాగర్ (సుమతిగారి అల్లుడు), సుమతిగారి వాళ్ళాయన మోసాం. 
శ్మశానంలో అన్నీ కానిచ్చుకుని వాళ్ళతో పాటే నరసింహారావుగారింటికి వెళ్ళి అక్కడే అన్నం తిని ఇంటికి చేరాను. 
ఎవరైనా పోయినప్పుడైనాసరే మృతదేహాన్ని దగ్గరుండి చూస్తున్నప్పుడైనా కంట్లో నీళ్ళురావు. ఈ విషయంలో గతించినవారు ఎవరైనా కావచ్చు. మా అమ్మా నాన్నా అన్నయ్యా పోయినప్పుడైనా ఏడుపు రాలేదు. అంతేకాదు, అప్పుడు చెయ్యవలసిన పనులు చకచకా కానిచ్చేస్తా చాలన్నట్టు అన్పిస్తుంది. ఇటువంటప్పుడు రాని కన్నీరు, బాధ తర్వతి కాలంలో ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తొస్తే కలిగే బాధను తట్టుకోలేను. మౌనంగా లోలోపల రోదిస్తాను. బయటకు కన్నీరు రాదు. కానీ అప్పుడనుభవించే మూగవేదనతో మనసు బరువెక్కిపోతుంది. అప్పుడనిపిస్తుంది ఏమిటీ జననం, మరణం, ఆందం, ఆవేదన....ఇవన్నీ మనం కోరుకున్నవా....కాదుగా....మన పుట్టుకే మన చేతిలో లేదు. ఉండదుకూడా. అలాగే మరణమూనూ. పరిచయాలు, స్నేహాలు, ప్రేమలు, అభిమానాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు...ఇలా ఏవేవో వైరాగ్య తలపులతో మనసు బరువెక్కిపోతుంది. ఇటువంటప్పుడు కొన్ని రోజులపాటు అన్నీ ఉన్నా ఏదీ లేనట్టే.....అన్పిస్తుంది. 
సుఖదుఃఖాలనూ
జననమరణాలనూ 
సమానంగా భావించే శక్తి 
మనందరికీ ఉంటుంది. 
కానీ 
అనుకోకుండానే 
ప్రియమైన వారు
సన్నిహితులు
ఇక మనతో ఉండరని
కనిపించరని 
తెలిసినప్పుడు
ఏదో వెల్తీ
ఏదో బాధ
ఏదీ మన చేతిలో ఉండదు
ఇదే సత్యం
ఎవరొప్పుకున్నా ఒప్పుకోకున్నా....

కామెంట్‌లు