గొల్ల వాడ ;- సుకన్య
ఉల్లములూపే పిల్లన గ్రోవులు ,
ఘల్లని గొల్లని , గొల్లల నవ్వులు ,
కొండల కొలనుల, సందడి నింపే 
      గల గల మాటలు ఎన్నెన్నో 
      కల కల మోముల కళలెన్నో. 

తరువుల నడుమున, తెరవుల వెంబడి 
పరి పరి రీతుల, పరుగిడి దాగిడి 
కరిమెరపుల వలె మెరిసే మేనుల 
      ఆడే ఆటలు ఎన్నెన్నో  
      పాడే పాటలు ఎన్నెన్నో .

వెన్నుని చూసిన అన్నుల కలువల 
కన్నుల మెరపులు ,  మురిపెపు నవ్వులు
మిన్నులు నిండిన పున్నమి పువ్వులు 
     ఎంతానందము అందరిలో 
     సంతోషాల సందడిలో 

ఆలల మందల  లేగల గంతుల 
సాయం కాలపు చల్లని ఝాముల,  
దుమ్ముల ధూళుల ద్రిమ్మరి, ఇళ్లకు 
    మళ్లే వేళకు  అలసటలూ 
    మళ్ళీ పొద్దున్న వేకువలూ . 

    దినమొక పండుగ అందరకూ 
    కనులకు నిండుగ నందునకూ .

కామెంట్‌లు