అనుకున్నదొక్కటి....!!--శ్యామ్ కుమార్...> నిజామాబాద్*
 ఉద్యోగస్తులు ఉద్యోగం ధర్మం పాటించడం ఎంత ముఖ్యమో,  నిజాయితీగా చేయడం కూడా అంతే ముఖ్యమని ఎన్నో సంఘటనలు నిజజీవితంలో మనకు  గుర్తు చేస్తూ ఉంటాయి.  కార్య నిబద్ధత,  ధర్మాచరణ,   నీతి మార్గం  మాత్రమే  ఏ వ్యక్తి నయినా ఎప్పుడూ  కాపాడుతుంది.   తొలినాళ్లలో అన్యాయం ఎంత గెలుపు సాధించినప్పటికీ తుదకు న్యాయమే గెలుస్తుంది అని చెప్పే సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  అందులో ఇది ఒకటి.
ఆ రోజు చేయవలసిన పనులను పూర్తి చేసుకొని ఫైల్స్ అన్నీ కట్టగట్టి   అల్మారా లో పెట్టి కూర్చుని ఊపిరి పీల్చుకున్నాడు  శరత్.
 ఉద్యోగ సంఘాల సెక్రెటరీగా అతను దాదాపు 20 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా  ఎన్నిక  అవుతూ,అందరిమన్ననలు పొందుతున్నాడు.అతని ఆలోచనలను భంగపరుస్తూ -----
 "సార్ ! మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు " అంటూ ప్యూన్ పిలిచాడు.
 చాలా సీరియస్గా ఏదో ఆలోచిస్తూ డిప్యూటీ మేనేజర్ క్యాబిన్ లోకి అడుగు పెట్టాడు శరత్.
 "చెప్పండి ప్రభాకర్ రావు గారు .ఏంటి విషయం?" ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుని అడిగాడు శరత్.  
:ఏమి లేదు శరత్ ,నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా యూనియన్ కు వెట్టిచాకిరి చేస్తావు "అని నవ్వాడు.
 "మీరు మీ ఉద్యోగులను ప్రేమగా చూసుకుంటే   నా యూనియన్ అవసరం ఏముంటుంది సార్. రేపే   మానేసి కూర్చుంటా" అన్నాడు.
 "మీ ఉద్యోగులు వారి వారి ధర్మాన్ని అనుసరించి వారి డ్యూటీలు వారు చక్కగా చేస్తే  మాతో ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పు :"

" ప్రేమతో, అభిమానంతో చేయించుకుంటే వాళ్ళు చేయవలసిన దానికన్నా చాలా ఎక్కువ చేయగలరు సార్ "అన్నాడు. 
"సరే నీ ఇష్టం శరత్ . ఒక మాట గుర్తుపెట్టుకో, నీకు తెలుసు అనుకో,  ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా ఉద్యోగుల గురించి పోరాడుతూ  నువ్వు వృత్తిపరంగా నష్ట పోతావు?."

 "పర్వాలేదు సార్ నాకు ఇప్పుడు వస్తున్న జీతం  
  భత్యం నా కుటుంబాన్ని పోషించడానికి సరిపోతాయి .నాకు అంతకంటే అత్యాశ లేదు."
 
"సరే  కానీ  శరత్ ఒక చిన్న విషయం .నేను కట్టవలసిన  అప్పు ఇంకాస్త లేట్ అవుతుంది. కాస్త నువ్వు  ,ఆ  చిట్ఫండ్ వాళ్లకు  సర్ది చెప్పచ్చు కదా? " అన్నాడు ప్రభాకరరావు. 
" ఇప్పటికీ మూడు నాలుగు సార్లు చెప్పాను సార్ ,వారు అంతకంటే ఆగరు. "అంటూ లేచి బయటకు  వెడుతున్న శరత్ ను చూసి కోపాన్ని దిగమింగు కొన్నాడు డిప్యూటీ మేనేజర్ ప్రభాకర్.
 వారం  రోజులు సెలవు పెట్టి కుటుంబంతో తిరుపతి శ్రీశైలం వెళ్లి ,  సోమవారం నాడు ఆఫీసుకి డ్యూటీ కి వచ్చాడు శరత్.  ముందు టేబుల్ మీద ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. 
 చుట్టూ ఉన్న ఉద్యోగస్తులు కొందరు కంగారుగా శరత్ దగ్గరకొచ్చి "శరత్ గారు మీకు విషయం తెలిసిందా,  మీ మీద చాలా పెద్ద కంప్లైంట్ పై వరకు వెళ్తోందని ప్రభాకర్ రావు గారు అందరికీ చెబుతున్నారు.  ఏమైంది అసలు దేని గురించి సార్ ?"అన్నారు.
 "ఏ విషయంలో ?దేని గురించి? నాకేమీ తెలియదే !!"అన్నాడు శరత్. 
 "ఎవడో గానీ సార్ మీరు ఏదో చాలా పెద్ద ఫ్రాడ్ చేశారని దానిపైన ఎంక్వయిరీ రావొచ్చని  ప్రభాకర్ గారు అందరికీ చెబుతున్నారు"
" సరేలెండి ,మీరెవరు కంగారు పడొద్దు .నాకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు.  నా నుంచి ఎటువంటి తప్పుడు పనులు జరగవు.  మీరు అందరూ వెళ్లి నిశ్చింతగా పని చేసుకోండి." అన్నాడు శరత్.
 గత 20 సంవత్సరాలుగా ఉద్యోగుల క్షేమమే పరమావధిగా యూనియన్లో తన సేవలను అందిస్తూ ప్రతి ఒక్క ఉద్యోగి వ్యక్తిగతంగా సలహాలను ఇస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తాను ముందుండి అన్ని విధాలుగా సాయం చేస్తూ ఉంటాడు శరత్.  అదే విధంగా తన ఉద్యోగ నిర్వహణలో కూడా ఎటువంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా పూర్తి సమయాన్ని కేటాయించి పని పూర్తి చేసి గాని ఇంటికి  వెళ్ళటం జరగదు.  యూనియన్లో కొరకరాని కొయ్యగా ఉన్న శరత్ ని చూస్తే అందరికీ కోపమే కానీ అతని నిజాయితీ ఉద్యోగ నిర్వహణలో ఉన్న సామర్థ్యాన్ని చూసి తగిన మర్యాద అభిమానం  చూపిస్తూ ఉంటారు అందరూ.
 పని సరిగ్గా చేయలేక పోయినప్పటికీ సంస్థ యాజమాన్యం ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించదు .
  కానీ మోసం చేస్తే మాత్రం చాలా విపరీత పరిణామాలు ఉంటాయి. 
 అందరూ అనుకున్నట్లు గానే ఒకరోజు హెడ్ ఆఫీస్ నుంచి విజిలెన్స్ ఆఫీసర్లు  దిగారు.
 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అందరూ శరత్ కి ఫోన్ చేసి తన సంఘీభావాన్ని తెలిపారు. తనకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా మేమందరం నీతోటే ఉంటాం .,ఎటువంటి  భయం లేదంటూ  సందేశాలు పంపారు.
 శరత్ నింపాదిగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.  శరత్ ఎక్కడా ధైర్యం చెక్కుచెదరకుండా  ,మొహంలో నవ్వు తో రోజువారీ పనులు చేసుకుంటూ ఉన్నాడు. 
 మధ్యాహ్నం భోజన  విరామం తర్వాత రీజినల్ మేనేజర్ నుంచి పిలుపు వచ్చింది.  లేచి నిలబడి ఆఫీస్ లో ఉద్యోగులందరూ వంక చూశాడు శరత్ అందరూ కంగారు  ఆందోళనలతో కనిపించారు. 
 "మీరెవరు కంగారు పడకండి.
  ఏమి కాదు నిశ్చింతగా మీ పని మీరు చేసుకోండి నేను ఇప్పుడే వస్తాను "అంటూ క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు  శరత్.
 
 క్యాబిన్లో ముందువైపు రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు కూర్చుని ఉన్నారు. ఒక పక్కగా డిప్యూటీ మేనేజర్ ప్రభాకర్ రావు ఇంకోవైపు రీజనల్ మేనేజర్ కూర్చుని ఉన్నారు.
 " గుడ్ ఆఫ్టర్నూన్ శరత్ కూర్చోండి "అంటూ  కుర్చీ చూపించారు.
 "థాంక్యు సర్ ."అని కూర్చుని "చెప్పండి సార్ ఏమిటి  పిలిచారు "అన్నాడు  మర్యాద పూర్వకంగా,నవ్వుతో.
 "మిస్టర్ శరత్,  మన సంస్థ లో క్రమశిక్షణ నిజాయితీలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో మీకు తెలిసే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఉన్న మీరు ఇలాంటి పని ఎలా చేశారో మాకు అర్థం కావట్లేదు ."అన్నాడు రీజినల్ మేనేజర్.
" నాకు తెలిసినంతవరకు అలాంటిదేమీ జరగలేదు.  ఏ విషయంలో  తప్పు  చేశాను అనేది మీరే చెప్పాలి" తొనకకుండా అడిగారు శరత్. 
" ఉద్యోగస్తుల హాజరు పట్టికలో  లేనిది ఉన్నట్టుగా  సృష్టిస్తూ దొరికిపోయారు  "అని అందరూ కళ్ళార్పకుండా చాలా సీరియస్గా శరత్ వైపు చూశారు.
 ఒక్కక్షణం  నిశ్శబ్దం శబ్దం తాండవించింది. 
 మరొక్క క్షణం ఆలోచించి శరత్ అన్నాడు "అలాంటిది నేను ఎప్పుడూ చేయలేదు .ఏదన్నా ఉంటే  ఒకసారి నా దృష్టికి తీసుకొని రండి.  అది ఏదో పూర్తిగా తెలిసే వరకు నేను ఏమి మాట్లాడలేను కదా " అన్నాడు.
 "మీరు అటెండెన్స్  రిజిస్టర్ లో  సంతకాలు తారుమారు చేశారని మీ డిప్యూటీ మేనేజర్ ప్రభాకర్ రావు గారు మీ మీద మాకు కంప్లైంట్ అందజేశారు.  దానికి సమాధానం ఏమిటి?" అన్నారు.
 ఈ విషయం వినగానే విస్మయం లోంచి  తేరు కోలేకపోయాడు శరత్.  ప్రభాకర్ రావు గారి  వైపు చూసి "ఏంటండీ ప్రభాకర్ రావు గారు ,ఏం జరిగింది ?ఏదైనా విషయం ఉంటే మీరు నా దృష్టికి తీసుకురావచ్చు కదా?  ఇదంతాఏమిటి అసలు ?"అన్నాడు.
 అప్పుడు రీజనల్ మేనేజర్ శరత్ ను చూసి "మిస్టర్ శరత్! మీరు దీపావళి ముందు రోజు ఆఫీస్ కు వచ్చారా లేదా ?"  
దీపావళి ముందుగా నేను ఆఫీస్ కి వచ్చానా  లేదా అని ఆ ప్రశ్న మళ్లీ ఒకసారి తనకు తాను వేసుకుని "లేదనుకుంటా సార్ ,సరిగ్గా గుర్తు లేదు." అన్నాడు.
" సరిగ్గా చెప్పండి శరత్ .పూర్తి  గా గుర్తు చేసుకోండి ఇది చాలా సీరియస్ విషయం" అన్నారు.
 మళ్లీ ఒక క్షణం ఆలోచించి "సార్ నేను రాలేదారోజు. ఆరోజు  స్పెషల్ లీవ్ తీసుకున్నాను" అన్నాడు.
 "మరైతే ఆరోజు అటెండెన్స్ రిజిస్టర్ లో ఎవరికీ తెలియకుండా సంతకం ఎందుకు పెట్టారు ?" విజిలెన్స్ ఆఫీసర్ సూటిగా ప్రశ్నించారు.
" అదెలా జరుగుతుంది ఏది ఒకసారి చూపించండి?" అన్నాడు నిజాయితీతో కూడిన స్వరం  తో శరత్.
 పక్కనున్న అటెండెన్స్ రిజిస్టర్ తీసి అతని ముందు జరిపారు .ఆ నెలకు సంబంధించిన పేజీ తీసి అందులో చూసి పరికించి "పొరపాటు జరిగిపోయినట్టు ఉందండి. నేను ఆ రోజు సెలవు మీద ఉన్నాను. బహుశా ఏదో పొరపాటున   సంతకం పెట్టినట్టున్నాను.  దాన్ని మీరు సరిచేసి పెట్టండి " అన్నాడు శరత్ .
"అయితే అది మీరు పొరపాటున చేసినట్టు   అంటారా ?"అడిగారు.
 "అవునండి . పొరపాటు జరిగినట్టుంది .దాన్ని సరి చేసుకోండి దయచేసి" అన్నాడు .
"సరే అయితే ఆ విషయం మీరు మాకు రాతపూర్వకంగా ఇవ్వగలరా?"
"  మన సంస్థ  లో ఉన్న  ప్రామాణిక సూత్రాన్ని అనుసరించి నేను రాసి ఇవ్వగలను .దానికి నాకేమీ అభ్యంతరం లేదు: అన్నాడు శరత్. "హ్యాపీ .ఇవ్వండి "అంటూ అందరూ చేతులు కట్టుకొని శరత్ చూస్తూ కూర్చున్నారు.  అక్కడున్న పేపర్ తీసుకొని దానికి తగినట్టుగా రాసి సంతకం చేసి వారి ముందు పెట్టాడు దానిని చేతిలోకి తీసుకుని అందరూ చదివి   విజిలెన్స్ ఆఫీసర్   మొహం చూశారు. 
 అప్పుడు " వెరీ నైస్  మిస్టర్ శరత్.   మీరు ఈ తప్పు ఉద్దేశపూర్వకంగా చేశారని మాకు మీ మీద కంప్లైంట్ వచ్చింది.  మీరు కనక పొరబాటు ఒప్పుకోకుండా మీరు పెట్టిన సంతకం సరి అయినది అని చెబుతూ  మీరు ఆఫీసుకు వచ్చినట్లుగా వాదించినట్లయితే ,మేము అందరం కలిసి నీమీద కేస్ ఫైల్ చేసి నీకు శిక్ష పడేలా  చేయవలసి వచ్చేది. 
 కానీ మీరు నిజాయితీగా జరిగింది పొరపాటు అని ఒప్పుకొని ....మీ నిర్దోషిత్వాన్ని మీరే నిరూపించుకున్నారు.  ...మేము అడిగిన వెంటనే మీరు కనుక రాసి ఇవ్వకపోతే, మీరు చాలా కష్టాల్లో పడేవారు. ....... ఏది ఏమైనా  మీ నిజాయితీ మాత్రమే మీలో వున్న 
 మానసిక ధైర్యం  అని మళ్లీ మీరు  నిరూపించుకున్నారు.  ..మీలాంటివారు ఉద్యోగుల నాయకులుగా ఉండడం మన సంస్థ కు ఎంతో మంచిది.  ఈ విషయంలో మిమ్మల్ని అభినందిస్తూ ఇంతవరకు జరిగిన దానికి  మేము క్షంతవ్యులం అని చెప్పక తప్పట్లేదు. ... ఇక మీరు వెళ్ళవచ్చు "అని లేచి అందరూ  శరత్ తో కరచాలనం చేసి ,  మర్యాదగా నమస్కారం కూడా చేశారు.  శరత్ కూడా ప్రతి నమస్కారం చేసి "థాంక్యూ సార్ "అంటూ బయటికి వచ్చేశాడు.
 జరిగిన విషయమంతా కాసేపట్లో  ఉద్యోగులందరికీ తెలిసిపోయి ,  ఆఫీస్ అయిపోగానే,శరత్  దగ్గరికి వచ్చి  అతన్ని తమ చేతుల లో ఎత్తుకొని కరతాళ ధ్వనులు చేస్తూ  బయట క్యాంటీన్ వరకు వెళ్లిపోయారు.
 తర్వాత నెలలో పైవారికి తప్పుడు సమాచారం ఇచ్చి వ్యక్తిగత  ద్వేషం కారణంగా  శరత్ పై పగ సాధించడానికి  తన    ఉద్యోగాన్ని దురుపయోగ పరిచినందుకు  డిప్యూటీ మేనేజర్ 
ప్రభాకరను  శిక్షార్హుడు అని నిర్ధారించి ,,  .. వేరొక రాష్ట్రానికి బదిలీ చేశారు.
                                  ***

కామెంట్‌లు
Shyam Kumar చెప్పారు…
Thanknyou suri garu