ములుకుట్ల విశ్వనాథ శర్మ గారి బాల్య స్మృతులు...సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 ములుకుట్ల వంశం భక్తి పురాణప్రవచనం హరికధలకు పుట్టినిల్లు.అలాంటి వంశంలో పుట్టిన  విశ్వనాథ శర్మగారు తన బాల్య స్మృతులు నెమరువేసుకున్నారు.ఆయన గాత్రం కూడా తండ్రిగాత్రం లా ఉండటం ఇంకో ప్రత్యేకత.
 శ్రీవిశ్వనాథంగారు తెనాలి తాలూకా హైస్కూల్ లో 12వ క్లాస్ దాకా చదివారు.నాగార్జున యూనివర్సిటీ లో తెలుగు ఎం.ఎచేసి తను చదివిన బడిలో అధ్యాపకునిగా చేరి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా మొత్తం 33ఏళ్ల సర్వీస్ తో రిటైరయ్యారు. తండ్రి తో కలిసి  హరికథలకు సహగాత్రం అందించే వారు.ఆయన దగ్గర పురాణాల గూర్చి తెలుసు కుని  స్వయంగా రామాయణ భారత భాగవతాలపై సామాన్యులకు అర్థం అయ్యే రీతిలో  ప్రవచనాలు దేశం నలుమూలలా ఇస్తున్నారు. విజయవాడ ఆకాశవాణి లో ఈయన సూక్తిసుధ విశేష ప్రాచుర్యం పొందింది. షిర్డీసాయి సచ్చరిత్రను సప్తాహంగా ప్రచారం చేశారు. కార్తీక పురాణం శ్రీశైల భద్రాచల మొదలైన స్థల పురాణాలు ఆడియోలుగా రిలీజ్ చేశారు. శృంగేరిజగద్గురువు ఆస్థాన పౌరాణికునిగా సత్కారం పొందారు.సత్యసాయిబాబా అధ్యక్షునిగాఏర్పడిన భాగవత భక్తసమాజం సభ్యులు. గుంటూరు గాయత్రి ఛారిటబుల్ ట్రస్ట్  ఈయనను  పౌరాణిక  కధావిశారద బిరుదుతో సత్కరించింది. ప్రశాంతంగా ఒకే ఇంటి ఆవరణలో అన్నదమ్ములతో ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న ధన్యజీవి.
ఆయన మాటల్లో బాల్య స్మృతులు చదువుదామా?"నాపేరు విశ్వనాథ శర్మగా ఎలా వచ్చింది?తమ్ముడు శివరామకృష్ణ శాస్త్రి. దీని వెనుక కధ ఉంది. నేను 1948లో పుట్టాను. నాన్న అధ్యాపకులు హరికధలతో ఎప్పుడు బిజీ.అమ్మ అనసూయమ్మ ఇంటి పనితో పాటు  మాపిల్లలందరినీ గారాబం గా చూసేది.చదువు పై శ్రద్ధ పెట్టాలని తెలీని రోజులు. నాన్న పనిచేసే తాలూకా హైస్కూల్ లో  ఆరోజులలో 6వక్లాస్ కి ఎంట్రన్స్ పరీక్షలు ఉండేవి.అవిపాసైతే డైరెక్ట్ గా తెలుగు మీడియంలో చేరవచ్చు. కానీ 10ఏళ్ళు నిండాలి.ప్రభలశాస్త్రి గారు వకీలు.ఆరోజుల్లో అడ్వకేట్ బర్త్ సర్టిఫికెట్ ఇస్తే చాలు. ఆయనవల్ల1946లో పుట్టిన రోజు గా విశ్వనాథ శర్మ పేరు తోపరీక్షరాశాను.అసలు చదివితేగదా?డింకీ కొట్టాను.ఏడుస్తూ కూచున్నాను.ఇంకోసారి ఆపరీక్షరాసి ఎలాగైతేనేం టెన్త్ దాకా నెట్టేశాను.ఈసారి ప్రభుత్వ విద్యా విధానంమార్పుతో ఇంగ్లీషు మీడియం 11 12 క్లాసులు చదవాలి. ఇన్నాళ్ళు చదివిన  తెలుగు మీడియంతో కుస్తీ పట్టి  దెబ్బలు తిన్నా.పరాజయాలు చవిచూశాను. నాన్న  ఇంట్లో  తెలుగు విశారద పరీక్షల పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. అంతే అది చదివి పాసైనాను.నా18వ ఏట అద్దంకి లో తెలుగు పండిట్ గా చేరాను.అలా ప్రైవేటు గా అన్ని పరీక్షలు రాసి ఎం.ఎ.తెలుగు ఉన్నత శ్రేణిలో పాసైనాను. నాన్న తో పాటు హరికధలకు హార్మోనియం వాయిస్తూ  నాన్న తోపాటు  నాకూ పూలదండ వేస్తే మురిసిపోయిన బాల్యం !మాతెలుగు మాష్టారు శ్రీ బూర్గుల గోపాల కృష్ణ మూర్తి గారు కమ్మని పద్యాలు పాడుతూ నాటకీయంగా పాఠాలు చెప్పటం నాపై గొప్ప ప్రభావాన్ని చూపింది.అందుకే తెలుగు మాష్టారుగా నేను చదివిన  తాలూకా హైస్కూల్  కాలేజీలో చదువు చెప్పటం గొప్ప అనుభూతి దైవసంకల్పం.నాన్న గారు పెట్టిన భిక్ష."
కామెంట్‌లు