ఆత్మీయబంధువు:- సత్యవాణి
 నాన్న కాడతడు
అన్నైనాకాడు
మేనమామాకాడు
వలపు చెలికాడా
అంతకన్నాకాడు
ఆత్మీయ నేస్తమా కాదు 
కడుపున పుట్టిన కొడుకూకాడు
మరి ఎందుకట ఆ ఎదురుచూపులు
స్వాతి వానకై ఎదురుచూసే 
చకోర పక్షుల్లా
ఏమీకానివాడికోసం
కళ్ళుకాచేలా ఎందుకా ఎదురుచూపులు
ఎదురింటికొచ్చి
మనింటికి రాలేదే అనే బేలచూపులులేల
ఎందుకతగాడిపై అంతటి మమకారం
ఏమౌతాడు నీకని
తడికెందుకంత పక్షపాతం
ఒక ఇంటివారిని
సంతోషంలో మునకలేయిస్తాడు
మరొక ఇంటివారిని దుఃఖంలో ముంచివేస్తాడు
ఒకరిని ఆశల శిఖరాలకు చేరుస్తాడు
మరొకరిని అంధపాతాళంలో పడదోస్తాడు
అయినా అందరికీ ఆప్తుడే అతడు
నిన్న అతగాడు వచ్చివెళ్ళినా
నేటికి పరగడుపే
అతడి రాకకొరకు ఎదురుచూపులే
ఎవరతగాడు
ఇంకెవరు మన ఆత్మీయ పోష్టుమేన్
ఒకప్పుడుమనందరి దృష్టిలో సాప్ట్ మాన్
          

కామెంట్‌లు