*బాల గేయం- మా పిల్లలందరి ఆకాంక్ష*;- *వురిమళ్ల సునంద, ఖమ్మం*
చందమామతో దోస్తీ కట్టాలని
వెండి మబ్బుల రథం ఎక్కాలని
లోకమంతా హాయిగా తిరగాలని
చుక్కలతో చెమ్మచెక్కలాడాలని
మేఘాలలో దాగిన చినుకులని
ఒడినిండా నింపుకొని రావాలని
రైతు తాత చేలల్లో జల్లాలని
పైరులన్నీ ఏపుగా పెరగాలని
పంట చూసి రైతన్న మురవాలని
మా పిల్లలందరి ఆకాంక్ష

సీతాకోక చిలుకల్లా ఎగరాలని
పూవులతో చెలిమి చాల చేయాలని
మధురమైన మకరందం గ్రోలాలని
పరిమళాల గాలి ఊయలూగాలని
పచ్చని మొక్కలా ఎదగాలని
ప్రజలకు నీడనిచ్చి మురవాలని
మా పిల్లలందరి ఆకాంక్ష... 


కామెంట్‌లు