పిల్లలం..పసి పిల్లలం;---గద్వాల సోమన్న
పిల్లలమండి పిల్లలం
పరిమళించే మల్లెలం
తొలకరి చిరుజల్లులం
విరిసిన హరివిల్లులం

గృహం గుడిలో వేల్పులం
తల్లిదండ్రుల రూపులం
విశ్వశాంతికి దూతలం
ప్రేమను పంచు దాతలం

చదువుల బడిలో మొక్కలం
దేవుని గుడిలో దివ్వెలం
మిలమిల మెరియు చుక్కలం
స్వేచ్ఛగ ఎగురు గువ్వలం

కిలకిల నవ్వుల వెలుగులం
కళకళలాడే మొలకలం
గలగల పారే యేరులం
జిలిబిలి పలుకుల చిలుకలం

అల్లరి చేసే పిడుగులం
ఎల్లరు మెచ్చే పిల్లలం
మంచిని పంచే జీవులం
రేపటి భారత పౌరులం


కామెంట్‌లు