నాయకుడు (కథ) రచయిత సరికొండ శ్రీనివాసరాజు


   రామవరం ఉన్నత పాఠశాలలో రాజేంద్ర 9వ తరగతి చదువుతున్నాడు. అతడు చదువులో అంతంత మాత్రమే. కానీ అందరికంటే ఎత్తుగా, లావుగా ఉండటమే కాక అందరినీ అదరగొట్టే స్వభావం ఉండటం వల్ల అతనిని ఆ తరగతికి నాయకుణ్ణి చేశారు. అతడు ఆ గర్వంతో ఎంతోమంది అమాయక విద్యార్థులను హేళన చేయడం, గొడవ పెట్టుకోవడం, తిట్టడం వంటివి చేసేవాడు. భయం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆ విషయం తరగతి ఉపాధ్యాయునికి చెప్పుకోలేక పోతున్నారు. అదే తరగతిలో జయంత తెలివైన విద్యార్థి. అతనితో చాలామంది వెనుకబడిన విద్యార్థులు తమకు తెలియని విషయాలు చెప్పించుకునేవారు. ఎంతో ఓపికతో జయంత వారిని కూడా తెలివైన విద్యార్థులుగా తీర్చి దిద్దేవాడు. తనకంటే ఎక్కువగా జయంతకు ఎక్కువ మంది స్నేహితులు ఉండటం చూసి రాజేంద్ర సహించలేకపోయాడు. ప్రతిరోజూ అల్లరి చేసే విద్యార్థులతో పాటు జయంత పేరును కూడా తప్పు చేసినట్లు ఉపాధ్యాయులకు చెప్పేవాడు. ఉపాధ్యాయులు జయంతను మందలిస్తుంటే రాజేంద్ర సంబరపడిపోయేవాడు.


       జయంతకు ప్రాణ స్నేహితుడు రాము. "జయంతా! నువ్వు ఏ తప్పూ చేయునప్పుడు ఉపాధ్యాయులతో ఎందుకు తిట్లు తింటావు. జరిగింది చెప్పరాదా?" అన్నాడు. "పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. సహనంతో ఉండటం చాలా మంచిది. నన్ను తిట్టిస్తే రాజేంద్రకు అదో ఆనందం. తిట్టించనీ. మీ అందరికీ తెలియదా నా గురించి?" అన్నాడు జయంత. ఒకరోజు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శంకరం గారు ప్రజాస్వామ్యం గురించి చెబుతున్నాడు. "నాకు ఏమీ అర్ధం కావడం లేదు మాస్టారూ! మన తరగతిలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకుణ్ణి ఎన్నుకునేలా చేయండి. అప్పుడు అందరికీ అర్థం అవుతుంది." అన్నాడు రాము. శంకరం గారు ఈ తరగతికి నాయకునిగా ఉండటానికి ఎవరెవరు ఆసక్తితో ఉన్నారో చెప్పమన్నాడు. రాజేంద్ర నిలబడ్డాడు. భయానికి అతనికి పోటీగా ఎవరూ నిలబడలేక పోతున్నారు. కానీ చాలామంది విద్యార్థులు జయంతను నిలబడమని ఒత్తిడి చేశారు. జయంత నిలబడ్డాడు. రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నిక జరిగింది. 55 మంది విద్యార్థులు ఓటు వేస్తే జయంతకు 51, రాజేంద్రకు 4 వచ్చాయి. ఇక మన నూతన తరగతి నాయకుడు జయంత అని అన్నాడు వాసు. "ఇవి ఒట్టి ఎన్నికలే. మీకు అర్థం కావడానికి ఇలా నిర్వహించాను. అయినా ప్రతిరోజూ అల్లరి చేస్తూ ఉపాధ్యాయులచే చివాట్లు తినే జయంత తరగతి నాయకుడు కావడం ఏమిటి?" అన్నాడు శంకరం మాస్టారు. "అయితే మళ్ళీ మీరు చెప్పింది అర్థం కాలేదు గురువు గారూ!" అన్నాడు రాము. అప్పుడు వాసు లేచి, "గురువు గారూ! నాదొక విన్నపం. 51 మంది విద్యార్థులు జయంతను నాయకునిగా ఎందుకు కోరుకున్నారో కారణాలు రాసి బాక్సులో వేయమనండి. అది మీరు చదివాక మీరు చెప్పినట్లు మేము వింటాం." అన్నాడు వాసు. విద్యార్థులు జయంత క్రమశిక్షణ గురించి, చదువులో ఇతరులకు చేసే సాయం గురించి రాయడమే గాక, రాజేంద్ర అహంకారంతో చేసే పనులను గురించి కూడా రాసినారు. అవి రహస్యంగా చదివిన శంకరం గారు జయంతను తరగతి నాయకునిగా నియమించాడు. ఇకపై అందరూ జయంత చెప్పినట్లు వినాలని, ఏ విద్యార్థీ మరొక విద్యార్థితో అనుచితంగా ప్రవర్తించినా కఠినమైన శిక్షతో పాటు పాఠశాల నుంచి వెళ్ళగొట్టడం జరుగుతుందని హెచ్చరించాడు. విద్యార్థులు అంతా చప్పట్లతో జయంతను అభినందించారు. రాజేంద్ర అల్లరి వేషాలు మాని చదువుపై శ్రద్ధ చూపాడు.

కామెంట్‌లు